ముస‌లి హీరోలు, హీరోయిన్ల‌లా…!

రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో శుక్ర‌వారం కాంగ్రెస్ చింత‌న శిబిరం ప్రారంభ‌మైంది. ఒక కుటుంబంలో ఒకే టికెట్ ఇవ్వాల‌ని ముకుల్ వాస్నిక్ క‌మిటీ ప్ర‌తిపాదించింది. రెండో టికెట్ ఇవ్వాలంటే అత‌ను పార్టీలో సంస్థాగ‌తంగా ఐదేళ్లు ప‌ని చేసి…

రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో శుక్ర‌వారం కాంగ్రెస్ చింత‌న శిబిరం ప్రారంభ‌మైంది. ఒక కుటుంబంలో ఒకే టికెట్ ఇవ్వాల‌ని ముకుల్ వాస్నిక్ క‌మిటీ ప్ర‌తిపాదించింది. రెండో టికెట్ ఇవ్వాలంటే అత‌ను పార్టీలో సంస్థాగ‌తంగా ఐదేళ్లు ప‌ని చేసి వుండాలి.

సినిమా ఫీల్డ్‌లో ఒక భ్ర‌మ లేదా భ్రాంతి వుంటుంది. అదేమంటే ముస‌లి హీరోలు కూడా ఇంకా త‌మ‌కు జ‌నంలో క్రేజ్ వుంద‌ని, బ‌య‌టికెళితే చుట్టుముట్టి ట్రాఫిక్ జామ్ చేసేస్తార‌ని. హీరోయిన్లు కూడా వృద్ధాప్యాన్ని అర్థం చేసుకోలేక ఘోరంగా మేక‌ప్ చేసుకుని వ‌స్తుంటారు. వాళ్ల టైం అయిపోయింద‌ని ఎప్ప‌టికీ అర్థం కాదు. ఇది గ్ర‌హించిన వాళ్ల‌ని విజ్ఞులు అంటారు.

కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి కూడా ఇదే. పార్టీకి ముస‌లిత‌నం వ‌చ్చేసింది. జ‌బ్బు ప‌డింది. అనేక రాష్ట్రాల్లో మీ టికెట్లు అడిగే వాళ్లే లేక‌పోతే ఇక కుటుంబానికి ఒక‌టేంటి, రెండేంటి? ఈ 3 రోజుల శిబిరంలో రొడ్డ కొట్టుడు ఉప‌న్యాసాలు త‌ప్ప ఇంకేమీ వుండ‌వు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడుల్లో కాంగ్రెస్ దాదాపుగా జీరో. క‌ర్నాట‌క‌లో దెబ్బ‌తినింది. కేర‌ళ‌లో అంతంత మాత్ర‌మే. అనేక పొత్తుల‌తో పోటీ చేయాల్సిందే. తెలంగాణాలో అంతోఇంతో బ‌లం ఉంది కానీ, ముక్కోణ‌పు పోటీలో కాంగ్రెస్‌కి Edge వుంద‌ని ఆ పార్టీ వాళ్లే న‌మ్మ‌డం లేదు.

యూపీలో మునిగిపోయింది. ఒరిస్సా, ఢిల్లీ, బెంగాల్‌లో, బీహార్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ల్లో ప‌రిస్థితి తెలుసు. ఒంట‌రిగా అధికారంలోకి రావ‌డం అసాధ్యం. కాంగ్రెస్‌తో పొత్తుల‌కి ఎన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి? బీజేపీని ఓడించాల‌ని సంక‌ల్పం మాత్ర‌మే స‌రిపోతుందా? వ్యూహం ఎక్క‌డుంది?

పార్టీలో 50-60 మ‌ధ్య వ‌య‌సు వుంటే వాళ్ల‌ని యంగ్‌స్ట‌ర్స్ అంటారు. ముస‌లి వాళ్ల‌తో పార్టీతో నింపేశారు. వాళ్లు కొత్త వాళ్లని రానివ్వ‌రు. వ‌చ్చిన వాళ్లు ఇమ‌డ‌లేరు. నెహ్రూ కుటుంబం నుంచి బ‌య‌టికి రాలేని స్థితిలో పార్టీ వుంది. రాహుల్ నాన్‌సీరియ‌స్‌గా క‌నిపిస్తూ వుంటే, అత‌ను ప్ర‌ధాని అవుతాడ‌ని, ఏదో చేసేస్తాడ‌ని క‌నీసం ఆ పార్టీలో వాళ్లు కూడా న‌మ్మ‌డం లేదు.

1977లో ఇందిరాకి వ్య‌తిరేకంగా అనేక పార్టీల ఏకీక‌ర‌ణ జ‌రిగిన‌ట్టు జ‌రిగితే త‌ప్ప బీజేపీని ఇపుడున్న స్థితిలో ఎదుర్కోవ‌డం అసాధ్యం. దానికి జ‌య‌ప్ర‌కాశ్‌నారాయ‌ణ్ లాంటి నాయ‌కుడు పుట్టాలి. పుట్టాడో లేదో తెలియ‌దు.

జీఆర్ మ‌హ‌ర్షి