గుణపాఠం నేర్వడానికి మనమే తప్పులు చేయనవసరం లేదు. ఇతరుల జీవితానుభవాల నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. తప్పేంటో తెలుసుకుంటేనే ఒప్పేంటో అర్థమయ్యేది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వాళ్లు సొంత పార్టీ వ్యవహారాలతో పాటు ప్రత్యర్థుల పంథాపై డేగకన్ను వేసి వుంటారు. ప్రత్యర్థుల బలాలు, బలహీనతలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ, తమ వ్యూహాలను మార్చుకుంటూ వుంటారు.
ఈ విషయంలో చంద్రబాబు చాలా అప్రమత్తంగా ఉన్నారని తాజాగా ఆయన చేసిన ఓ కామెంటే నిదర్శనం. పార్టీ కోసం పని చేసే కార్యకర్తల ఆర్థిక స్తోమత పెంచడం, వారికి ఆదాయ మార్గం చూపడం కూడా తన బాధ్యతే అని చంద్రబాబు చెప్పడం అత్యంత ప్రాధాన్యంతో కూడిన అంశం.
ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు ఆయన చెప్పారు. పార్టీ కోసం పని చేస్తూనే స్వయం ఉపాధి పొందేలా తగిన విధంగా ప్లాన్ రూపొందిస్తానని చెప్పడం విశేషం. గతంలో చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు బడానేతలకు కావాల్సినంత ఆర్థిక లబ్ధి చేకూర్చడంపై విమర్శలున్నాయి.
ఇదిలా వుండగా వైసీపీ ప్రతిపక్షంలో వున్నప్పుడు కార్యకర్తలకు ఆర్థిక భరోసా కల్పించలేదంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అధికారంలోకి వచ్చినా కార్యకర్తలు, నాయకుల ఆర్థిక పరిస్థితి మెరుగు పడేలా చేయకపోవడంతో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది, పార్టీ కోసం పదేళ్లు కష్టపడ్డామని, అధికారంలోకి వచ్చినా ఎలాంటి మార్పు రాలేదనే ఆవేదన అధికార పార్టీ నేతలు, కార్యకర్తల్లో బలంగా ఉంది.
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి ముఖ్య అనుచరుల జీవన స్థితిగతుల్లో అనూహ్య మార్పు రావడం తప్ప, సామాన్య కార్యకర్తలు, గ్రామ, వార్డు, డివిజన్ స్థాయి నాయకులకు ఒరిగిందేమీ లేదనే అసంతృప్తి ఉంది. దీన్ని చంద్రబాబు పసిగట్టారు. అందుకే తన వాళ్లకు ఆ పరిస్థితి రాకూడదని ఆయన వ్యూహాత్మక ప్రకటన చేశారు. తద్వారా ప్రత్యర్థులను సైతం తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.
రాజకీయాలను శాసించేది ఆర్థికమే. అదే అధికారాన్ని తేల్చేది. రాజకీయాలను నడిపించే ఇంధనం డబ్బే. ఆర్థిక భరోసా కలిగిస్తారనే చిన్న నమ్మకం ఏర్పడితే చాలు, ఎవరైనా అటువైపు వాలుతారు. చంద్రబాబు చేసిన చిన్న ప్రకటన ఆ పార్టీ శ్రేణుల్లో గట్టి విశ్వాసాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు. కానీ ఆ విషయంలో వైసీపీ ఫెయిల్యూరే చంద్రబాబు వినూత్న ఆలోచనకు బీజం వేసిందని చెప్పొచ్చు.
మూడేళ్లలో సామాన్య కార్యకర్తలు, నాయకులకు అధికార పార్టీ చేసిందేమీ లేదు. మరి ఈ రెండేళ్లలో ఏం చేస్తుందనేది ప్రశ్న. వైసీపీ పాలనలో ఎక్కడెక్కడ, ఎవరెవరు అసంతృప్తులకు గురి అవుతున్నారో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం జాగ్రత్తగా గమనిస్తోంది. అలాంటి వాటిని తమకు అనుకూలంగా మలుచుకునే క్రమంలో ప్రధాన ప్రతిపక్షం వ్మూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
సొదుం రమణ