టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జ్ఞానోదయం అయ్యింది. ఎట్టకేలకు తన తప్పుల్ని ఒప్పుకున్నారు. ఇదంతా కుప్పంలో ఓటమి తీసుకొచ్చిన మార్పే అని చెప్పక తప్పదు. 2019లో ఘోరంగా ఓడించేంత తప్పు ఏం చేశానని అనేక సందర్భాల్లో చంద్రబాబు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
తనను ఓడించి ప్రజలే తప్పు చేశారని నిష్టూరమాడిన పెద్ద మనిషి… సొంత నియోజక వర్గానికి వచ్చే సరికి కాస్త తగ్గినట్టే కనిపిస్తోంది.
కుప్పంలో చంద్రబాబు మూడు రోజులు పర్యటించారు. చివరి రోజు పర్యటనలో భాగంగా కుప్పంలో పార్టీ బూత్, యూనిట్, క్లస్టర్ కన్వీనర్లు, యువతతో చంద్రబాబు వేర్వేరుగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యలు ఆయనలో తీసుకొచ్చిన మార్పును ప్రతిబింబిస్తున్నాయి. చంద్రబాబు ఏమన్నారంటే…
” పార్టీలోని సీనియర్లు పని చేసినంతకాలం పనిచేశారని, ఇక మీదట వారు సలహాదారులుగానే కొనసాగుతారు. ఇంతకు ముందు నేను తప్పు చేశాను. ఎవరో సీనియర్లు చెప్పేవారికి, వారు సూచించే వ్యక్తులకే పదవులిచ్చా. చివరికి పార్టీని ఈ స్థితికి తెచ్చుకున్నా. నాయకులు కూడా నా చుట్టూ తిరుగుతూ, నా ప్రాపకం కోసం అర్రులు చాచేవారు. తిరిగి చూసుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇకపై అలా జరగదు. అలాంటి తప్పులు చేయను” అని చంద్రబాబు పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో పాటు గతంలో చేసిన తప్పుల్ని ఇక చేయనని హామీ ఇచ్చారు.
గతంలో చంద్రబాబు ఎప్పుడూ ఇలా మాట్లాడిన సందర్భం లేదు. తప్పులైతే పార్టీ నాయకులవి, ఒప్పులైతే తన ఘనత అని చెప్పుకునేవాళ్లు. చంద్రబాబు మారిన పరిస్థితుల్లో తప్పుల్ని కూడా తన ఖాతాలో వేసుకోవడం విశేషం. పనిచేసే వాళ్లకు మాత్రమే పెద్దపీట వేస్తామని చంద్రబాబు చెప్పడంతో పార్టీకి మంచి రోజులొస్తున్నాయని టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి.