సవాల్ విసరడం కాదు… దానిపై నిలబడడం గొప్ప. రాజకీయాల్లో సవాళ్లు విసరడమే తప్ప పాటించిన సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి. కానీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మాత్రం రాజకీయ నేతల్లో తనది ప్రత్యేక పంథా అని చాటి చెప్పారు. అంతేకాదు, దమ్ము ధైర్యానికి ప్రతీకగా నిలిచే నిర్ణయాన్ని ఆమె తీసుకున్నారు. ఇంత వరకూ దేశంలో మరే నేత నుంచి ఎదుర్కోని సవాల్‌ను మమతా బెనర్జీ నుంచి బీజేపీ ఎదుర్కొంటోంది.
పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు యావత్ దేశ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగను న్నాయి. ఈ నేపథ్యంలో అన్ని స్థానాలకు నేడు ఆమె తన పార్టీ అభ్యర్థులను ప్రకటించి బీజేపీకి సవాల్ విసిరారు. అంతేకాదు, తాను ముందు ప్రకటించినట్టుగానే నందిగ్రామ్ నుంచి మమతా బరిలో నిలుస్తుండడం విశేషం. ఈ మేరకు అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు నందిగ్రామ్ నుంచే ఉంది. రెండో స్థానం నుంచి పోటీ చేసేది లేదని తేల్చి చెప్పారు.
ఇప్పటి వరకూ ఆమె భవానీపూర్ నుంచి బరిలో దిగుతూ వచ్చారు. ఈ దఫా అక్కడి నుంచి సోవన్‌దేవ్ ఛటోపాధ్యాయ పోటీ చేయనున్నారు. ఇటీవలే నందిగ్రామ్ ప్రాంత టీఎంసీ బలమైన నేత సుబేందు బీజేపీలో చేరాడు. ఆ సందర్భంలో మమతాబెనర్జీ తాను నందిగ్రామ్ నుంచే పోటీ చేసి సుబేందు, బీజేపీ పని పడతానని శపథం చేశారు.
అయితే రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అని అందరూ భావించారు. కానీ తానన్న మాటకు కట్టుబడి నందిగ్రామ్ నుంచే బరిలో దిగాలని మమతా నిర్ణయించుకోవడం సాహసమే అని చెప్పాలి. అందులోనూ రెండో నియోజకవర్గాన్ని కూడా ఎంచుకోకపోవడం గమనార్హం. భారత రాజకీయాల్లో మమతా బెనర్జీది విలక్షణ శైలి. అతి సాధారణ జీవితం గడుపుతూ, పోరాటమే శ్వాసగా అంచె లంచెలుగా రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చారు.
కాంగ్రెస్‌తో విభేదించి సొంత పార్టీ పెట్టుకుని దశాబ్దాల తరబడి తిష్ట వేసుకున్న కమ్యూనిస్టు కంచుకోటను బద్దలు కొట్టారామె. వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చి పశ్చిమబెంగాల్‌పై చెరగని ముద్ర వేసుకున్నారామె. రోజురోజుకూ వామపక్షాలు బలహీనపడడంతో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో తాజా అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొడతారా? లేక బీజేపీకి అధికారాన్ని అప్పగిస్తారా? అనేది భవిష్యత్ తేల్చనుంది. కానీ నందిగ్రామ్ బరిలో నిలుస్తున్న మమతాబెనర్జీ …గెలుపోటములను పక్కన పెడితే, చరిత్రలో ఆమె శాశ్వతంగా నిలిచిపోయే నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.