మూవీ రివ్యూ: ఏ-1 ఎక్స్ ప్రెస్

చిత్రం: ఏ-1 ఎక్స్ ప్రెస్  రేటింగ్: 2.5/5  నటీనటులు: సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, పోసాని, రావు రమేష్, మురళి శర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీరంజిని, మహేష్ విట్టా, సత్య, భూపాల్ రాజు,…

చిత్రం: ఏ-1 ఎక్స్ ప్రెస్ 
రేటింగ్: 2.5/5 
నటీనటులు: సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, పోసాని, రావు రమేష్, మురళి శర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీరంజిని, మహేష్ విట్టా, సత్య, భూపాల్ రాజు, అభిజీత్ తదితరులు
కెమెరా: కవిన్ రాజ్ 
సంగీతం: హిప్ హాప్ తమిళన్ 
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్ 
నిర్మాతలు: టీ జీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెన్ 
దర్శకత్వం: డెన్నిస్ జీవన్ 
విడుదల తేదీ: 5 మార్చ్ 2021

రకరకాల నేపథ్యాలతో సినిమాలు తీయడంలో తప్పు లేదు. ట్రెండుకు తగ్గట్టుగా క్రీడా నేపథ్యమున్న చిత్రం తెరకెక్కించడమూ తప్పు కాదు. కానీ, ఎంచుకున్న ఆట అధికశాతం జనానికి కొత్తదైనప్పుడు దాని గురించి కనీస అవగాహన కలిగించాలి. 

క్రికెట్ నేపథ్యంతో “లగాన్” వచ్చినా, కుస్తీ బ్యాక్డ్రాప్ తో “దంగల్” పలకరించినా ఆయా ఆటల గురించి సినిమా మొదటి నుంచి ప్రేక్షకులకి తెలయజేసే పని చేసారు. దాని వల్ల క్లైమాక్సులో చూపించే ఆటకి ఏమోషనల్ గా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే తెరమీదున్న నటులకి తప్ప చూసే ప్రేక్షకులకి ఎటువంటి ఫీలింగూ కలగదు. ఇక్కడ జరిగిన పొరపాటు అదే. రెండున్నర గంటల సినిమాలో హాకీ గురించి తెలుసుకున్నదేమీ లేదు. అలాగని కొత్త అనుభూతి ఏదైనా మిగిల్చిందా అంటే అదీ లేదు. గతంలో చూసేసిన స్పోర్ట్స్ సినిమాలన్నీ కలిపి ఒక చుట్టు చుట్టేసినట్టు ఉంది. 

యానాం చేరిన బస్సుని దిగుతున్న సీనులో హీరో సందీప్ ఇంట్రడ్యూస్ అవుతాడు. బస్సులో ఉన్న ఇద్దరమ్మాయిలు దిగుతున్న అతనికి ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ ఒకరు, ఫోన్ చేయమని సైగ చేస్తూ ఇంకొకరు సెండాఫ్ ఇస్తారు. ఈ సీన్ కి ఒక స్టార్ హీరో రేంజ్ కి ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా వినిపిస్తుంది. ఆ యానాంలో హాకీ ప్లేయర్ లావణ్యతో ప్రేమలో పడతాడు సందీప్. ఆ ట్రాక్ అలా నడుస్తూ ఉంటుంది. 

కాన్-ఫ్లిక్ట్ పాయింట్ ఏంటంటే ఆ ఊళ్లో ఒక చిన్న స్టేడియం ఉంటుంది. లంచగొండి మంత్రి రావు రమేష్ దానిని ఒక మెడికల్ కంపెనీకి అమ్మేసే పనిలో ఉంటాడు. ఆ స్టేడియంకి సంబంధించిన అకాడెమీ నుంచి వచ్చే ఆటగాళ్లు దేశానికి పనికొచ్చే విధంగా ఆడట్లేదని, కనుక స్టేడియం అమ్మేయొచ్చని పేపర్స్ ప్రిపేర్ చేస్తాడు. అయితే, మిలటరీ నుంచి వచ్చి హాకీ కోచ్ గా మారిన మురళి శర్మ ఆ రాజకీయన్ని తట్టుకుని, అంతర్జాతీయ స్థాయి ఆటగాడైన సందీప్ నాయుడు సాయంతో ఆ గ్రౌండ్ చేజారిపోకుండా ఎలా కాపాడుకుంటాడు అనేది మిగతా కథ. ఇదంతా చదువుతున్నప్పుడు “గోల్కండ హై స్కూల్” గుర్తొస్తే చేసేదేం లేదు. 

ఈ మెయిన్ ప్లాట్ కి రకరకాల సబ్ ప్లాట్లు ఉన్నాయి. సందీప్ నాయుడు గతం..ఆ గతంలో అతనికి ఇద్దరు మిత్రులు..వాళ్ల ఎమోషన్లు, స్టేడియం లో ఒక ముసలి తాత..అతని హాకీ భక్తి ఇలా మొదలైనవి స్క్రీన్ ప్లే నిడివిని పెంచడానికి తోడ్పడ్డాయి. సందీప్ కిషన్ ఒక స్పోర్ట్స్ పర్సన్ కి తగ్గట్టుగా ఫిజిక్ ని మలచుకోవడంలో పడిన కష్టం కనపడింది. హాకీ పిచ్ మీద ఆట ఆడే నేర్పు కూడా బాగుంది. లావణ్య త్రిపాఠికి పెద్దగా ఎమోషన్స్ ని గానీ, రొమాన్స్ ని పండించే అవకాశం లేదు. మురళి శర్మ తన మార్కు చూపించాడు. రావు రమేష్ డయాలగ్స్ కొన్ని బాగున్నాయి. ఉన్నంతలో కాస్త రిలీఫ్ ఈ పాత్రే.  

సంగీతం కొంత బాగుండి కొంత గందరగోళంగా ఉంది. అన్నీ మూసగా కాకుండా ర్యాప్ వంటివి సందర్భోచితంగా పెట్టే ప్రయోగమైతే చేసారు. అయితే అసలు కథలో ఎమోషన్ లేకపోవడం వల్ల అదేమీ అంతగా కనెక్ట్ అవ్వలేదు. కెమెరా వర్క్, ఎడిటింగ్ పర్వాలేదు. స్క్రిప్ట్ రాసుకోవడంలోనే చాలా లోపాలున్నాయి. కొన్ని చోట్ల రైటరు ఏం రాయాలో తెలియక ఆగిపోతే, ఆర్టిస్టులు కూడా పర్ఫాం చేస్తూ ఆగిపోయారేమో అనిపిస్తుంది. ముఖ్యంగా మురళిశర్మకి రావు రమేష్ కి మధ్య తుపాకి సీన్ ఒకటుంటుంది. అప్పటి దాకా ఏదో ఒకటి మాట్లాడుతున్న మురళీశర్మ సడెన్ గా సీరియస్ గా చూస్తూ కూర్చుంటాడు…ఏ డయలాగో కొడతాడనుకుంటే సీన్లోంచి లేచెళ్లిపోతాడు. 

చివర్లో హాకీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు యాంకర్ సుమ వాయిస్ లో కామెంట్రీ వినిపిస్తూ ఉంటుంది. కమెంట్రీ చెబుతూ “ఆడియన్స్ అందరూ కంఫ్యూజన్ లో ఉన్నట్టున్నారు” అంటుంది.  ఆ లైన్ వినగానే సుమ ఒక్కత్తే ఈ సినిమా చూస్తున్న ఆడియన్స్ ని అర్థం చేసుకుందన్న ఫీలింగ్ కలుగుతుంది. 

శుభం కార్డు పడే ముందు రావు రమేష్ చెప్పే పొలిటికల్ డయలాగులు ఎందుకో అర్థం కాదు. పాలిటిక్స్ వల్ల హాకీ లాంటి ఆటలకి భవిష్యత్తు లేకుండా పోతోందా లేక జనానికి ఆసక్తి లేకనా అంటే కామన్ సెన్స్ ఉన్నవాడెవడైనా రెండోదే కరెక్టంటాడు. కానీ నేల వదిలి గారడీ చేసినట్టు సెన్స్ వదిలేసి ఎమోషన్ పండించాలనుకున్నారు. అది పండలేదు. జబ్బ కష్టం, జేబు కష్టం ఐతే కనపడ్డాయి కానీ మెదడుతో పడ్డ కష్టం కనపడలేదు. 

బాటం లైన్: గమ్యం చేరని ఎక్స్ ప్రెస్