జనసేనాని పవన్‌కల్యాణ్ మాటలు ఫుల్, చేతలు నిల్ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014లో పార్టీ ఆవిర్భావ సభలో జనసేనాని ఉర్రూతలూగించే ఉపన్యాసం ఇచ్చారు. తాను ప్రశ్నించడానికే వస్తున్నానని, జనం గొంతుకగా ఉంటానని పెద్దపెద్ద మాటలు చెప్పారు. పవన్‌కల్యాణ్ ఏం చెబుతారో, వాటికి రివర్స్‌గా అన్వయించుకుంటే ఆయన అర్థమవుతారు. అంతే తప్ప, ఆయన మాటలు విని , అవి నిజమని నమ్మితే మాత్రం గోవిందా అనే అభిప్రాయాలు చాలా త్వరగానే వ్యాప్తి చెందాయి.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బీజేపీతో పాటు దాని మిత్ర పక్షమైన జనసేన కూడా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బీజేపీతో జనసేన పొత్తు కుదుర్చుకోవడం వల్ల కలిగిన ప్రయోజనాల సంగతేమో గానీ, అడుగడుగునా జనసేన జనంలో అభాసుపాలు అవుతోందని చెప్పక తప్పదు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమబాట పట్టింది. ఢిల్లీ వేదికగా కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. కానీ రైతాంగ వ్యతిరేక చట్టాల గురించి నోరెత్తలేని దయనీయ స్థితిలో జనసేన ఉండడం గమనార్హం. బీజేపీతో పొత్తు వల్ల జనసేన తనకు తానుగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టైందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
తాజాగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపు మేరకు ఏపీలో శుక్రవారం బంద్ చేపట్టారు. ఈ బంద్‌కు అధికార పార్టీ వైసీపీ సంఘీభావం తెలపడంతో ఆర్టీసీ బస్సులు నడవలేదు. మరోవైపు వైసీపీ, టీడీపీ, వామపక్షాలు, అనేక కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొని జయప్రదం చేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన మినహా మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు బంద్‌లో పాల్గొన్నట్టైంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల సెంటిమెంట్‌కి సంబంధించిన వ్యవహారం. ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో చేపట్టిన రాష్ట్ర బంద్‌లో పాల్గొనని బీజేపీ, జనసేనలపై సహజంగానే రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. ఒక వైపు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు తాము వ్యతిరేకమని మీడియాలో చెప్పడం తప్ప, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమంలో పాల్గొనక పోవడం వల్ల ముఖ్యంగా జనసేనను ఏ విధంగా నమ్మాలనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. జనసేనానికి ఇప్పుడు గళమెత్తే దారి కావాలి? అది ఏ రూపంలో అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది.
కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోందనే ఆవేదన, ఆగ్రహం ఏపీ ప్రజల్లో గూడు కట్టుకున్నది. అలాంటి పార్టీతో అంటకాగుతున్న జనసేనపై సహజంగానే ఆ వ్యతిరేకత ప్రభావం పడుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది.
బీజేపీతో కలిసి ఉన్నంత కాలం జనసేనకు పుట్టగతులుండవన్నది పచ్చి నిజం. రానున్న రోజుల్లో అధికారం గురించి కలలు కంటున్న బీజేపీ -జనసేన కూటమికి అసలు శత్రువు కేంద్ర ప్రభుత్వమే అని చెప్పక తప్పదు. ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినంత కాలం ఏపీలో ఆ పార్టీని ఎప్పటికీ ఆదరించరని మరీ ముఖ్యంగా పవన్ గుర్తిస్తే మంచిది.