కేశినేని ఫిక్సయిపోయినట్లేనా?

విజయవాడ లోక్ సభ నియోజక వర్గం నుంచి ఎన్నికయిన కేశినేని నాని ది కాస్త రెబల్ వ్యవహారం. మొండితనం పాలు కాస్త ఎక్కువే. 2014 ఎన్నికల్లో చంద్రబాబును కిందా మీదా పెట్టి, కార్నర్ చేసి,…

విజయవాడ లోక్ సభ నియోజక వర్గం నుంచి ఎన్నికయిన కేశినేని నాని ది కాస్త రెబల్ వ్యవహారం. మొండితనం పాలు కాస్త ఎక్కువే. 2014 ఎన్నికల్లో చంద్రబాబును కిందా మీదా పెట్టి, కార్నర్ చేసి, ఆఖరికి టికెట్ తెచ్చుకున్నారు.

అప్పటి నుంచి ప్రతి సారీ ఏదో ఒక తలనొప్పి తెస్తూనే వున్నారు. ఆయన నియోజకవర్గ ఆఫీసు విషయంలో గడబిడ అయింది. రవాణా అధికారులతో యాగీ అయిపోయింది. తన సిబ్బందికి జీతాలు, బకాయిల చెల్లింపు గొడవ అయిపోయింది.

బాబు వెనకేసుకు రావడం లేదు, రవాణా శాఖలో అధికారులను మార్చలేదు. ఆఖరికి తన ట్రావెల్స్ దుకాణం మూసుకున్నారు. ఇలాంటి టైమ్ లో లగడపాటి తేదేపాలోకి వస్తారని, ఆయనకు టికెట్ హామీ దొరికిందని రాజకీయ వర్గాల్లో గుసగుస వినిపించడం ప్రారంభమైంది.

మరోపక్క పురంధ్రీశ్వరి విజయవాడ మీద కన్నేసారని వార్తలు వినవస్తున్నాయి. ఇలా అన్నీ కలిసి కేశినేని నానికి విజయవాడ లొక్ సభ టికెట్ ను దూరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీంతో కేశినేని నాని, ఇప్పటి నుంచే పోరు బాటలోకి అడుగు పెట్టేసినట్లు కనిపిస్తోంది. టికెట్ ఇవ్వని తరువాత గొంతు ఎత్తితే, అది టికెట్ ఇవ్వలేదని అనే కారణంతో చేస్తున్న యాగీగా అనుకుంటారు. కానీ ఇప్పుడే స్టార్ట్ చేస్తే, పోరాటం అనుకుంటారు.

కానీ ఎటొచ్చీ ఇలా ప్రభుత్వాన్ని ఇరుకున పెడితే టికెట్ ఇస్తారా? చంద్రబాబు అన్నది అనుమానం. ఈ సంగతి కేశినేని నానికి తెలియని సంగతి ఏమీ కాదు. అందుకే ఆయన తన రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో వుంచుకుని ఈ కార్యాచరణకు దిగుతున్నట్లు కనిపిస్తోంది.

భవిష్యత్ తో పార్టీ టికెట్ ఇచ్చినా ఓకె. ఇవ్వకున్నా, ఈ ట్రాక్ రికార్డు అప్పుడు జనాల ముందుకు తీసుకు వెళ్లి, తన ప్రయత్నం తాను చేసుకోవచ్చు. బహుశా ఇదే వ్యూహంతో కేశినాని ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. కానీ చంద్రబాబు కూడా తక్కువ తిన్నవారు కాదు.

కేశినేని నాని కన్నా మొండి. జగమొండి. వన్స్, దూరం పెట్టడం ప్రారంభిస్తే, అది పెరుగుతూనే వుంటుంది కానీ తరగడం కష్టం. మొత్తానికి ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ రవాణా రాజధానిగా పేరు పొందిన విజయవాడలో రవాణా రాజకీయాలు రంజుగా మారుతున్నాయి.