మొత్తానికి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటోంది శ్రుతి హాసన్. పెళ్లికి ముందే పిల్లల్ని కనేస్తా.. పెళ్లితో అవసరం లేకుండా పిల్లలను కనేస్తా.. అంటూ ఈమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు శ్రుతి హాసన్ వ్యాఖ్యలు.. ఈమె విషయంలో ఆశ్చర్యాన్ని కలిగించడమే కాదు, కమల్ వైవాహిక జీవితాన్ని కూడా గుర్తు చేస్తున్నాయి. పెళ్లి చేసుకునే ఆలోచన లేదు.. మంచి అబ్బాయి తగిలితే అతడిని ప్రేమించి, అతడితో పిల్లల్ని కనేస్తా.. అంటూ మురిపెంగా చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్.
మరి సమజానికి భిన్నంగా వెళ్లడానికి ఏ మాత్రం మొహమాటం లేదు.. వెళ్లడం సంగతెలా ఉన్నా, ముందుగానే అలాంటి ప్రకటనలు చేసి.. హడావుడి చేయడానికి శ్రుతి హాసన్ ఇష్టపడుతున్నట్టుగా ఉంది. పెళ్లికి ముందే పిల్లలు.. ఇప్పుడు శ్రుతి హాసన్ ఈ కాన్సెప్ట్ పై తన ఇష్టాన్ని ప్రకటించుకుంది. శ్రుతి పుట్టింది కూడా తన తల్లిదండ్రుల వివాహానికి ముందే. వాణీగణపతిలో విడాకుల అనంతరం.. సారికతో సహజీవనాన్ని మొదలుపెట్టారు కమల్.
ఆ సమయంలోనే వీరికి శ్రుతి పుట్టింది. ఆమెకు మూడునాలుగేళ్ల వయసు వచ్చాకా.. సారిక, కమల్ లు వివాహం చేసుకున్నట్టుగా ఉన్నారు. ఆ తర్వాత కొంత కాలానికి విడిపోయారనుకోండి. ఇప్పుడు సేమ్ తండ్రి రూటులోనే పయనించడానికి శ్రుతి ఉత్సాహం చూపుతోంది. పెళ్లికి ముందే పిల్లలను పుట్టించుకోవడానికి రెడీ అంటోంది. అయితే సరైన బాయ్ ఫ్రెండ్ దొరకాలనేది మాత్రమే ఈమె షరతు. పిల్లల తర్వాత పెళ్లి సంగతి దేవుడు ఎరుగు. ఇదంతా చూస్తుంటే.. కమల్ ఫ్యామిలీకి పెళ్లితో పని లేకుండా పోయినట్టుంది.
కమల్ రెండు సార్లు పెళ్లి చేసుకున్నాడు.. తర్వాత ఆ బంధాల నుంచి బయటకు వచ్చాడు. పెళ్లి చేసుకోకుండానే గౌతమితో కొన్నాళ్ల పాటు సహజీవనం చేశాడు. కమల్ బంధాల కథ ముగుస్తున్న దశలో ఆయన తనయ తండ్రి తీరుకు కొనసాగింపునని అంటోంది. ఆ మధ్య కమల్ కూడా కూతురి విషయంలో ఇలాంటి ప్రకటనే చేశాడు. ఆమె పెళ్లి చేసుకోనీ, చేసుకోకపోనీ.. పిల్లలను కనాలని మాత్రం కమల్ ఆకాంక్షించాడు. శ్రుతి కూడా అదే పని చేస్తానని అంటోంది.