హీరోయిన్ భావన కిడ్నాప్, ఆపై లైంగిక దాడి యత్నం ఘటన అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్న తేడాల్లేకుండా ఆయా సినీ రంగాల్లోని ప్రముఖులు స్పందించారు. దోషులకు కఠిన శిక్ష పడాలని నినదించారు. సినీ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న అవమానాలపై గళం విప్పారు. ఆ సెగలు ఇప్పటికీ భగ్గుమంటున్నాయి. సినీ పరిశ్రమలో హీరోయిన్లకు ఎదురయ్యే సమస్యలపై సినీ రంగానికి చెందిన ప్రముఖులు స్పందిస్తూనే వున్నా, 'కొందరి' పైత్యం మాత్రం పీక్స్‌లో కొనసాగుతూనే వుండడం గమనార్హం.
సీనియర్ నటుడు చలపతిరావు తన స్థాయిని మర్చిపోయి, 'అమ్మాయిలు పక్కలో పడుకోవడానికి పనికొస్తారు..' అనేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. 'సీనియారిటీ మీకు నేర్పిన సంస్కారం ఇదేనా.?' అంటూ సోషల్ మీడియాలో చలపతిరావుని కడిగి పారేస్తున్నారు. అంతకు ముందు, దాదాపు ఇలాంటి నిర్లక్ష్యపూరితమైన వెకిలి వ్యాఖ్యలు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నోట వచ్చాయి. 'కన్పిస్తే కడుపు చేసెయ్యడమే..' అని ఓ సినీ వేడుకలో నోరు పారేసుకున్నారు బాలయ్య. ఆ ఉదంతాన్ని ఉదహరిస్తూ, బాలయ్యకు శిష్యుడు చలపతిరావు.. అంటున్నారు కొందరు.
ఇంకొంచెం వెనక్కి వెళితే, కమెడియన్ అలీ, హీరోయిన్ అనుష్క మీద దారుణమైన కామెంట్స్ చేసేశాడు. ఆ మాటకొస్తే, సినీ పరిశ్రమలో ఇలాంటివి సర్వసాధారణమే. అయితే అప్పటికీ ఇప్పటికీ ఓ చిన్న తేడా వుంది. అప్పట్లో ఇంతలా మీడియా కవరేజ్ వుండేది కాదు. దాంతో, చాలా విషయాలు మరుగునపడిపోయేవి. ఇప్పుడలా కాదు. నోరు జారితే అంతే సంగతులు. సోషల్ మీడియా కడిగి పారేస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే.
అయినా, మరీ ఇంత దారుణంగా హీరోయిన్ల మీద సినీ ప్రముఖులే చెలరేగిపోతోంటే.. టాలీవుడ్లో హీరోయిన్లు, ఇతర సినీ ప్రముఖులు ఎందుకు నోరు మెదపరు.? అంటే, ఆ నెగెటివ్ కామెంట్స్‌కి తెలుగు సినీ పరిశ్రమ నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందా.? హీరోయిన్లందరినీ సినీ పరిశ్రమ అలాగే చూస్తోందా.? ఎవరూ నోరు మెదకపోవడం చూస్తోంటే, అవుననే అనుమానాలు కలగకమానవు.