చిరంజీవి తదుపరి సినిమాకి రంగం సిద్ధమయ్యింది. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమా అతి త్వరలో ప్రారంభంకాబోతోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, సినిమా ప్రారంభోత్సవం జరపాలన్నది నిర్మాత రామ్‌చరణ్ ఆలోచన. ఈలోగా అభిమానులు, తమ అభిమాన హీరోని ఇలా చూడాలనుకుంటున్నామంటూ కొన్ని స్టిల్స్‌ని డిజైన్ చేసేసి సోషల్ మీడియాలోకి విడుదల చేస్తున్నారు.
ఇంకోపక్క, ఏ సినిమాకి అయినా మార్కెటింగ్ ముఖ్యమిప్పుడు. 'ఖైదీ నెంబర్ 150' సినిమాకి ఆ మార్కెటింగ్ స్ట్రేటజీని పక్కాగా అమలు చేశాడు చరణ్. 'బాహుబలి' సినిమాకి పనిచేసిన మార్కెటింగ్ మంత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇండియన్ సినిమాగా 'బాహుబలి' సత్తా చాటిన దరిమిలా, 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'ని కూడా అదే స్థాయిలో మార్కెట్ చేయాలన్నది చరణ్ ఆలోచన.
ఇదిలా వుంటే, 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ కన్పించాలనుకున్నాడట. కొన్ని కారణాలతో అది కుదరలేదని, స్వయంగా వెంకటేష్ మొన్నీమధ్యనే సెలవిచ్చాడు. చరణ్‌కి, సల్మాన్‌ఖాన్‌తో మంచి స్నేహం వుంది. ఈ కారణంగానే, ఈసారి ఎలాగైనా చిరంజీవి సినిమాలో సల్మాన్‌ఖాన్‌తో నటింపజేయాలని అనుకుంటున్నాడట చరణ్. ఎటూ ఇండియన్ సినిమాగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'ని తెరకెక్కించనున్నారు గనుక, ఓ ముఖ్యపాత్రలో సల్మాన్‌ఖాన్‌ని చూపించడానికి స్కోప్ వుంటుందన్నది ఇన్సైడ్ సోర్సెస్ కథనం. తద్వారా బాలీవుడ్‌లోనూ 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'కి మంచి హైప్ క్రియేట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
బాలీవుడ్ మాత్రమే కాదు, విదేశీ నటులు, టెక్నీషియన్లు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'కి పనిచేస్తారని చిరంజీవి ఇప్పటికే సంకేతాలు పంపిన దరిమిలా, టాలీవుడ్ నుంచి మరో 'ఇండియన్ మూవీ' సంచలనాలకు కేంద్ర బిందువు కాబోతోందా.? వేచి చూడాల్సిందే.