ఆహా మనమెంత అదృష్టవంతులం…. పుణ్యాలు, యాగాలు, పవిత్ర కార్యాలు చేసినా దక్కుతుందో లేదో తెలియని స్వర్గం… అవేమీ చెయ్యకుండానే ప్రాప్తిస్తుందంటే మనమెంత ధన్యజీవులం… గద్దెనెక్కాక ప్రజలను పురుగుల్లా చూసే పాలకులున్న ఈ రోజుల్లో తననెన్నుకున్న ప్రజల కోసం ఏకంగా స్వర్గాన్నే నిర్మించి ఇచ్చే ప్రభువులు వారు దొరకడం ఎంత భాగ్యం… ఏ జన్మలో చేసుకున్న పుణ్య ఫలమో.. లేకపోతే ఈ జన్మలో ఇలాంటి ప్రభువుల ఏలుబడిలో స్వర్గసుఖాలు అనుభవించగలిగే సదావకాశం మనకు దక్కేదా… ఊహల్లో, కలల్లో మాత్రమే చూడగలిగే స్వర్గసుఖాలను కళ్లముందుకు తెస్తున్న మన ప్రభువులు ఎంత పుణ్యాత్ములు.
ఇలాంటి పాలకుడు లేక కానీ.. లేకపోతే స్వర్గ ప్రాప్తి కోసం పుణ్యాలు, దైవకార్యాలు చేయాల్సిన అగత్యం మన పూర్వికులకు ఎందుకు పట్టేది… అసలు వేరే దైవమెందుకండి అంతటి పాలకుడు ఉండగా… వేరెవరికో పూజలు ఎందుకు కళ్ల ముందు దైవ స్వరూపం కనబడతుండగా…. తనకెంతో ప్రీతికరమైన ప్రజల క్షేమం కోసం ఇంతలా పరితపిస్తున్న ప్రభువుల పెద్ద మనసు అర్థం కాక గానీ లేకపోతే పంటకు గిట్టుబాటు ధర, పైరుకు బీమా అంటూ చిన్న చిన్న కోర్కెలతో ఏలిక వారి స్వర్గ నిర్మాణ బృహత్ యగ్నానికి విఘ్నాలు కలిగిస్తామా చెప్పండి.
మనల్ని స్వరలోకంలో ఓలలాడించాలన్న నిస్వార్థ పాలకుడు చేస్తున్న అవిరళ కృషికి ఆటంకం కలిగిస్తామా ఆలోచించండి… పండించిన పంటకు పెట్టుబడి కూడా రాలేదనో, తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక తరతరాలుగా నమ్ముకున్న జానెడు పంటభూమిని తెగనమ్ముకున్నామన్న మనోవ్యథతోనో, మార్వాడి దగ్గర తాకట్టు పెట్టిన పుస్తెలతాడు గడువు తీరిపోయి కరిగించారన్న బాధ తట్టుకోలేకో… ఇంకేవో.. ఇంకేవో.. అల్పమైన కారణాలకే అర్థాంతరంగా తనువు చాలించి ప్రభువులు వారు సృష్టించబోయే ఇలలోక స్వర్గభోగాలను చేజేతులా దూరం చేసుకుంటున్న మన రైతన్నలది తొందరపాటు కాక మరేంటి… స్వర్గపు అంచుల్లో అందమైన అప్ససర సాంగత్యంలో సేదతీరే అరుదైన అవకాశాన్ని కాలదన్నుకోవడం ఖర్మ కాక ఇంకేంటి…
అయినా స్వర్గ, నరకాలు ఒక భావన.. ఉన్నయో లేవో చూసినోడు లేడు.. చేసినోడు లేడు… అనే ప్రశ్నే అనవసరం…. మన పురాణాలు, కథల్లో ఎన్ని చోట్ల స్వర్గాల ప్రస్తావన లేదు… స్వర్గపురి వైభోగాలు, విలాసాలను ఎంతమంది కవులు మన కళ్లకు కట్టలేదు… ఇంద్ర భవనాలు, ఐరావతాలు, పారిజాత వనాలు, పచ్చటి తోటలు.. అందులో విహరించే నెమళ్లు, లేళ్లు… తమ అందచందాలు, నాట్య భంగిమలతో అలరించే రంభ, ఊర్వశి, మేనక వంటి అప్సరసలు… ఆహా తలచుకుంటేనే మనసెంత ఆనంద డోలికల్లో తేలియాడుతుందో కదా… అంతటి అదృష్టాన్ని బతికుండగానే మనకు కలగించనున్న ప్రభువుల వారి రుణం ఎలా తీర్చుకోవాలా అని ఆలోచించాల్సింది పోయి… తిరిగి ఆయన్నే రుణమాఫీ చేయమని అడగడమేమిటి అజ్ఞానం కాకపోతే…
స్వర్గాలు, లోకాలు, గ్రహాలు..ఇవన్నీ దైవసృష్టి కదా…మానవ మాత్రులకు అదెలా సాధ్యం అని మరోసారి మూర్ఖత్వాన్ని బయటపెట్టుకునే ప్రయత్నం చేయకండి… ఏ త్రిశంకుడిని బతికుండగానే స్వర్గానికి పంపిస్తానని చెప్పి పైకి పంపాక.. తీరా అక్కడ స్వర్గ ద్వారాలు తెరుచుకోక భూలోకానికి తిరిగి వస్తున్న ఆయన కోసం విశ్వామిత్రుడు ఏకంగా ఒక స్వర్గాన్ని సృష్టించలేదా… ఆ త్రిశంకు స్వర్గాన్ని చూసి దేవతలు సైతం ఈర్శ్యపడలేదా… అది రుషి పుంగవుల మహా తపో ఫలం ద్వారా పొందిన శక్తుల వల్ల సాధ్యపడిందని అర్థం పర్థం లేని ప్రస్తావన తేకండి… ఆ మునివర్యుల కంటే మన ప్రభువుల వారు ఎందులో తక్కువ… రాజ్య ప్రజల కోసం మన రాజుగారు చేస్తున్న తపస్సు, యగ్నాలతో పోల్చుకుంటే విశ్వామిత్రుల వారు ఏపాటి…లోకకళ్యాణం కోసం విశ్వామిత్రుడు తలపెట్టిన యగ్నానికి మారీచ, సుబాహులనే ఇద్దరు రాక్షసులలే ఆటంకం కలిగించారు.
కానీ ఇక్కడ మన ప్రభువులు గారి స్వర్గసృష్టి తపస్సు కు ఆటంకం కలిగిస్తున్న ప్రతిపక్ష రాక్షసులెందరు… ఏ అంతటి మహోన్నతమైన స్వర్గం నిర్మించాలంటే కనీసం ఓ 50 వేల ఎకరాలు అవసరపడదా.. మరీ చిన్న స్వర్గమైతే రాజ్యప్రజలందరికీ సరిపోతుందా…. అవి మూడు పంటలు, నాలుగు పంటలు పండే పచ్చని పొలాలని ప్రతిపక్ష రాక్షసులు నానా యాగీ చేయలేదూ… ఏ స్వర్గం కంటే ఆ పంటలు ఎక్కువా… అది తెలిసే ప్రభువుల వారు ఎక్కడా వెనక్కి తగ్గలేదు కదా.. మరి ఇంతటి నిష్టాగరిష్టులైన మన ప్రభువుల పట్టుదల శక్తి తో సరితూగగలదా ఆ విశ్వామిత్రుల వారి తపోఫల శక్తి …
ఇప్పటికైనా ఇలాంటి వ్యర్థ ప్రేలాపనలు, అనవసర అనుమానాలు మాని బాధ్యతాయుత పౌరులుగా మనం చేయవలసింది ప్రభువులు స్వర్గసృష్టి యాగంలో మనవంతు సాయపడడం… అదీ చేతకాకపోతే వరించబోయే ఇలలోక స్వర్గ విహారాన్ని తలుచుకుంటూ కలలు కనడం…. ఆహా… ఉందిలే స్వర్గ ప్రాప్తి ముందు ముందున… అందరూ స్వర్గంలోనే నందనందనా….