ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ కొనసాగుతోంది. ఈ నెలాఖరు వరకు ఇది ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సినిమాకు సంబంధించి సుకుమార్ కు చరణ్ డెడ్ లైన్ విధించాడట. ఎట్టిపరిస్థితుల్లో ఆగస్ట్ ఎండింగ్ నాటికి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని కోరాడట.
చరణ్ ఇలా డెడ్ లైన్ విధించడానికి ఓ కారణం ఉంది. చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా ఆగస్ట్ లో ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఆ మూవీకి నిర్మాత రామ్ చరణే. అందుకే ఆ సినిమా సెట్స్ పైకి వచ్చే టైమ్ కు తన సినిమాను కంప్లీట్ చేయాలని సుకుమార్ కు చెప్పాడట.
మైత్రీ మూవీ మేకర్స్ చెబుతున్నదాని ప్రకారం చరణ్-సుకుమార్ సినిమా కంప్లీట్ అవ్వడానికి కనీసం ఇంకో 4 నెలలైనా పడుతుంది. సో.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ చివరినాటికి సినిమా కంప్లీట్ అవ్వాలి. మధ్యలో ఏమైనా లాజికల్-టెక్నికల్ ఇబ్బందులు ఎదురైతే మాత్రం సినిమా సెప్టెంబర్ లోకి ఎంటర్ అవుతుంది.
సినిమాల్ని నెమ్మదిగా తీయడం సుకుమార్ కు అలవాటు. తన మూవీస్ కు సంబంధించి ప్రతి ఫ్రేమ్ పక్కాగా ఉండాలనుకుంటాడు. అవసరమైతే తీసిన సన్నివేశాల్నే మళ్లీ తీస్తాడు. ఇప్పటివరకు తను చేసిన ప్రతి సినిమాకు లాంగ్ టైమ్ తీసుకున్నాడు. మరి చెర్రీ విధించిన డెడ్ లైన్ లోపు సుక్కూ సినిమా పూర్తిచేస్తాడా..?