బల్లి శకునాలు, చిలక జ్యోతిష్యాలతోనే ప్రపంచ యుద్ధాలు వచ్చేస్తాయా..ఆయనెవరో శకునం చెప్పాడంట..మరి కొద్ది గంటల్లోనే యుద్దం తప్పదంట..భూగోళం అంతం తథ్యమంట…ఆ వాదనకు బలపరిచేలా ఆయన ఇంతకు ముందు విజయవంతంగా చెప్పిన కొన్ని జ్యోతిష్యాలను చూపిస్తున్నారు కొందరు. ఇంకేం లేదు నేడో రేపో యుద్ధం తథ్యం..ప్రపంచ అంతం ఖాయం అన్న రేంజిలో కొన్ని ప్రచార మాధ్యమాలు, సోషల్ మీడియాలో ప్రచారాలు.. ఎవరో ఏదో శకునం చెప్పారనో.. ఇంకెవరో అంజనం వేసి చూశారనో యుద్ధాలు, ప్రళయాలు వచ్చేపనైతే ఈ పాటికి ఎప్పుడో ఈ భూగోళం అంతరించేపోయేదే. అప్పుడెప్పుడో 2012 డిసెంబర్లో మయన్ల క్యాలెండర్ ప్రకారమనో..లేక నోస్ట్రాడమస్ చెప్పాడనో ప్రపంచం అంతరించిపోతోందని పుకార్లు పుట్టించారు. అంతర్జాతీయ స్థాయిలో దీనిపై అప్పట్లో చాలా చర్చ జరిగింది. ఔత్సాహిక డైరెక్టర్లు హాలీవుడ్లో సినిమా కూడా తీశారు. తీరా చూస్తే.. అంతా తూచ్..ప్రళయం లేదు..గిలియం లేదు..
ఇప్పుడు మళ్లీ ఐదేళ్ల తరవాత ఉత్తరప్రదేశ్‌లో ప్రమోద్ అనే ప్రబుద్ధుడు బయలుదేరాడు.. ఈ ప్రపంచం అంతాన్ని నిర్ణయించేందుకు. అమెరికా, ఉత్తరప్రదేశ్ మధ్య ఉన్న ఉద్రిక్తలను బేస్ చేసుకుని అదుగో యుద్ధం వచ్చేస్తోంది. ఇంకేముంది అంతా సర్వనాశనం… వినాశనం.. దాన్ని అపేందుకు యాగాలు.. యగ్నాలు అంటూ తలతిక్క పనులు చేస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్‌కు కుజ గ్రహం వల్ల పీడించబడుతున్నాడట.. ఆ ఎఫెక్ట్ వల్ల తీవ్ర చర్యలకు దిగుతాడట…దాని వల్ల ప్రపంచం మొత్తం పశ్చిమం నుంచి తూర్పు దాకా ప్రపంచం అంతరించిపోతుందట.. ఈ ప్రళయాన్ని ఆపే బాధ్యతను భుజాన వేసుకున్న ఈ దార్శనికుడు తన తొట్టిగ్యాంగ్.. అదే తన శిష్యులతో కలిసి మహాయాగాలు చేశాడట.. దీన్ని పట్టుకుని మీడియా చిలువలు పలువలు చేస్తూ జనాన్ని లేనిపోని భయాలకు గురిచేయడం..
ఉత్తరకొరియా, అమెరికాల మధ్య వైరం ఈ నాటిది కాదు. దానికి ఆరు దశాబ్ధాలకు పైగా చరిత్ర ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా వేసిన అణుబాంబులతో లొంగిపోయిన జపాన్ తన ఆధీనంలోని కొరియాను వదులుకుంది. దాంతో కొరియాను రెండు ముక్కలుగా విభజించి అమెరికా, రష్యా చెరో ముక్కను పంచుకున్నాయి. అమెరికా దక్షిణకొరియాకు కొమ్ముకాయగా, రష్యా, చైనా లాంటి దేశాలు ఉత్తరకొరియాకు మద్ధతిచ్చాయి. అప్పటి నుంచి ఈ రెండు గ్రూపులకు ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ యున్ బుద్ధి మరీ వెర్రితలలు వేస్తుండడంతో కాస్త ఝలక్ ఇద్దామని తమ యుద్ధ నౌకలను కాస్త అటు మళ్లించాడు ఈ ట్రంప్ మహాశయుడు. అమెరికా ఇలాంటి పనులు గతంలో కూడా అనేక సందర్భల్లో చేసింది. దక్షిణ చైనా సముద్ర వివాదంలో కూడా ఇలాగే తమ సైనిక నౌకలను చైనా చుట్టూ మోహరించింది. తరవాత వెనక్కి మళ్లించింది.
మరి అంతమాత్రం దానికే యుద్ధం వచ్చిందా… ఇప్పటికే ఇరాక్, ఆఫ్గనిస్థాన్లపై యుద్ధం చేసి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి ఈ యుద్ధాలు, పోరాటాలు మన కొద్దురా బాబూ మన బతుకేదో మనం బతుకుదాం.. అనే నినాదంతోనే ట్రంప్ ఎన్నికల్లో గెలిచాడు. అందుకే సిరియాలో ఇసిస్ అంతగా రెచ్చిపోయి ప్రపంచానికి సవాలు విసిరినా మా జాగ్రత్తలో మేముంటాం తప్ప.. వారి జోలికి మేం వెళ్లం అని కూర్చుని.. మిగతా దేశాల ఒత్తిడికి కాస్త తలొగ్గి అడపా దడపా ఐసిస్ స్థావరాలపై ఆ నాలుగు డ్రోన్లు వేసి చేతులు దులుపుకుంటోందే తప్ప రష్యా, ఇతర యూరోప్ దేశాలంత ఉత్సాహంగా ఐసిస్‌పై యుద్ధం చేయడం లేదు. అలాంటిది ఈ కొరియా వెర్రి వెంగళప్ప మాటలకు భయపడి ఆయనపై యుద్ధం చేస్తుందా… అంతా భ్రమకాకపోతే..ప్రస్తుతం అమెరికాకు యుద్ధం చేసే ఓపిక, దూల రెండూ లేవు… అసలు కుజదోషం ఉన్నది ట్రంప్‌కు కాదు.. ఇలాంటి ప్రచారాలు చేసే వారికి… వాటిని నమ్మేవారికి…