వెయ్యి కోట్ల బడ్జెట్‌.. పెట్టేయొచ్చుగానీ..

'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమా వెయ్యి కోట్ల వసూళ్ళను దాటేసింది. 'దంగల్‌' సినిమా చైనాలో తాజాగా విడుదలై భారీ వసూళ్ళు సాధించడంతో, ఆ సినిమా కూడా వెయ్యి కోట్ల మార్క్‌ని అందుకోవడం లాంఛనమే అయ్యింది.…

'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమా వెయ్యి కోట్ల వసూళ్ళను దాటేసింది. 'దంగల్‌' సినిమా చైనాలో తాజాగా విడుదలై భారీ వసూళ్ళు సాధించడంతో, ఆ సినిమా కూడా వెయ్యి కోట్ల మార్క్‌ని అందుకోవడం లాంఛనమే అయ్యింది. ఈ రెండు సినిమాలు సాధించిన విజయాలతో, ఇండియన్‌ సినిమా మార్కెట్‌ 'వెయ్యి కోట్లకు' చేరుకుందన్న మాట వాస్తవమే అయినా, ప్రతి సినిమా ఈ స్థాయిలో వసూళ్ళు సాధించడం అసాధ్యం. దానికి చాలా చాలా చాలా 'కమిట్‌మెంట్‌' వుండాలి. అంతకన్నా మించి, 'మార్కెటింగ్‌ వ్యూహాలు' పక్కాగా వుండి తీరాల్సిందే. దాంతోపాటు, టైమింగ్‌ కూడా ఇంపార్టెంట్‌ ఇక్కడ. 

వెయ్యి కోట్ల మార్కెట్‌ని టచ్‌ చేయడానికి లైన్‌లో వున్న సినిమాలు ఏంటి.? అని ఆలోచిస్తే, 'రోబో 2.0' సినిమా పేరు ప్రముఖంగా విన్పిస్తుంది. మామూలుగా అయితే, ఈ సినిమాపై అంచనాలు 500 కోట్లకు అటూ ఇటూగా మాత్రమే వున్నాయి నిన్న మొన్నటిదాకా. అయితే, ఆ అంచనాలిప్పుడు పెరిగాయి. 'బాహుబలి ది కంక్లూజన్‌' సాధించిన విజయంతో, 'రోబో 2.0' చిత్ర నిర్మాతలు కూడా మరింత మెరుగైన మార్కెటింగ్‌ వ్యూహాలతో తమ సినిమాని విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. 

ఇంకోపక్క, 'మహాభారతం' సినిమా వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రూపొందడానికి రంగం సిద్ధమయ్యింది. అదొక్కటే కాదు, 500 కోట్ల పై బడిన బడ్జెట్‌తో 'రామాయణం' సినిమాని తెరకెక్కించడానికీ సన్నద్ధమవుతున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు తమిళ దర్శకుడు సుందర్‌, తన కొత్త సినిమా 'సంఘమిత్ర' బడ్జెట్‌ని 125 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయలకు పెంచేస్తున్నాడట. ఇవన్నీ దేనికి సంకేతాలు.? అంటే, మార్కెట్‌ పెరిగింది కాబట్టి, 'ధైర్యంగా నిర్మాతలు ముందుకొస్తున్నారు..' అనడానికి సంకేతాలుగా చెప్పవచ్చు. 

అయితే, ముందే చెప్పుకున్నట్టు, వెయ్యి కోట్ల వసూళ్ళను టచ్‌ చేయడం చిన్న విషయం కాదు. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించడమే ఓ పెద్ద సాహసం. దాన్ని ఆ స్థాయిలో మార్కెటింగ్‌ చేయడమంటే, అది ఇంకా పెద్ద సాహసం అయిపోతుంది. అన్ని సినిమాలూ 'బాహుబలి' కాలేవు. కానీ, ఇండియన్‌ సినిమా మార్కెట్‌ పెరగాలి. తమిళ, తెలుగు, హిందీ సినిమాలనే 'విభజన' ఇప్పుడెక్కడా కన్పించకూడదు. ఇండియన్‌ సినిమాగానే ఏ సినిమా అయినా ప్రొజెక్ట్‌ అయితే, దానికి అన్ని భాషల నుంచీ డిమాండ్‌ వస్తే.. అప్పుడు మిగతా నిర్మాతల్లోనూ ధైర్యం మరింతగా పెరుగుతుంది.