మాజీ మంత్రి, ప్రముఖ విద్యావ్యాపారవేత్త నారాయణపై ఏపీ సర్కార్ పోరాటాన్ని కొనసాగిస్తోంది. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీలకు నారాయణ పాల్పడ్డారనేది అభియోగం. ఈ మేరకు నారాయణ విద్యాసంస్థల వైస్ ప్రిన్సిపాల్ పోలీసుల విచారణలో తగిన ఆధారాలు చెప్పారు.
సదరు ఉద్యోగి వెల్లడించిన వివరాల ఆధారంగా మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి, చిత్తూరుకు తరలించారు. లీకేజీ వ్యవహారంపై చిత్తూరు డీఈవో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
11వ తేదీ తెల్లవారుజామున నారాయణకు చిత్తూరు నాల్గో అదనపు జడ్జి బెయిల్ మంజూరు చేశారు. దీంతో కనీసం ఒక్కరోజు కూడా జైల్లో ఉండకుండానే నారాయణ ఉపశమనం పొందినట్టైంది. ఈ నేపథ్యంలో టెన్త్ ప్రశ్న పత్రాల లీకేజీలో నారాయణ ప్రమేయం ఉందని పక్కా ఆధారాలతో అరెస్ట్ చేశామని పోలీసులు, ప్రభుత్వం చెబుతోంది. దీంతో నారాయణ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ సర్కార్ మరో న్యాయపోరాటానికి దిగింది.
ఈ మేరకు మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి దాఖలు చేశారు.
పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరుపై జిల్లా కోర్టులో రివిజన్ ఫైల్ దాఖలు చేశామన్నారు. బెయిల్ పిటిషన్ వేయకుండా బెయిల్ మంజూరు అయ్యిందని చెప్పడం విశేషం.