ప్రాంక్ వీడియోల చిత్రీకరణ చినికి చినికి గాలివానగా మారిన చందంగా వ్యవహారం తయారైంది. యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి, నటి కరాటే కల్యాణి పరస్పరం దాడులు చేసుకున్నారు. చివరికి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుల వరకూ వ్యవహారం వెళ్లింది.
ప్రాంక్ వీడియోలంటూ అశ్లీల కార్యక్రమాలకు తెరలేపి, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడని శ్రీకాంత్‌రెడ్డిపై కరాటే కల్యాణి విరుచుకు పడుతున్నారు. మరోవైపు తాను ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు మాత్రమే ప్రాంక్ వీడియోలను చిత్రీకరిస్తున్నట్టు శ్రీకాంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
ముగ్గురు అబ్బాయిలను కరాటే కల్యాణి వెంట తీసుకుని తన ఇంటికొచ్చి భౌతిక దాడికి పాల్పడడంపై యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రాంక్ వీడియోలు చేయడం తన వృత్తిగా అతను చెప్పాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
తనకు అందరి మద్దతు కావాలని కోరాడు. తాను ఏ తప్పు చేయలేదన్నాడు. ఒకవేళ చేసి వుంటే క్షమించాలని కోరాడు. శ్రీకాంత్‌రెడ్డి విడుదల చేసిన వీడియోలో ఏమున్నదో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
‘ఎంటర్‌టైన్‌మెంట్ కోసం నేను వీడియోలు చేసే విషయం మీకు తెలుసు. కరాటే కల్యాణితో జరిగిన గొడవ మీకు తెలిసిందే. నిన్న రాత్రి డిన్నర్ చేసే సమయంలో కరాటే కల్యాణి మా ఇంటికి వచ్చారు. మా ఇల్లు డీసెంట్‌గా వుంటుంది. శ్రీకాంత్ బయటికి రా అంటూ గట్టిగా అరిచారు.
ఏంటి విషయమని నేను బయటికి వచ్చాను. వచ్చీ రాగానే సమాజం చెడిపోయే వీడియోలు చేస్తున్నావంటూ తిట్టింది. దీనికి నేను నువ్వు కృష్ణా సినిమాలో బాబీ అంటూ సినిమాలు చేస్తావు కదా? అవేం తక్కువా? అలాంటప్పుడు నేను వీడియోలు చేసుకోవడంలో తప్పు ఏంటి? అని ప్రశ్నించాను.
నా వీడియోల్లో చేసే ఆడవాళ్లు ఆర్టిస్టులు, వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తారని చెప్పాను. అమ్మాయిలు ఫేం కావాలని అలా చేస్తారన్నాను. దీంతో కల్యాణి నన్ను లక్ష రూపాయలు అడిగింది. నేను తలచుకుంటే ఏమైనా చేస్తానని హెచ్చరించింది. ఇవ్వకపోతే పోలీసులకి కంప్లైంట్ చేస్తానని బెదిరించింది. నన్ను దూషించింది. నేను వింటూనే ఉన్నాను. పక్కన ఉన్న అబ్బాయి నన్ను పక్కకు తీసుకుపోయి భుజంపై చేయి వేసి గొడవ ఎందుకు 70 వేలకి సెట్ చేసుకో అన్నాడు.
నేను మీకు ఎందుకు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వను, ఏం చేస్తారో చేసుకోండి అనడంతో నా చెంపపై రెండు దెబ్బలు కొట్టింది. తిరిగి కొడితే చచ్చిపోతావని నన్ను హెచ్చరించింది. మా ఇంట్లో మహిళగా భావించి వదిలేశాను. మూడోసారి కొట్టింది. అప్పుడు ఆమెతో పాటు వచ్చిన వాళ్లు కట్టెలు తీసుకుని కొట్టడానికి వచ్చారు. నేను కూడా వాళ్లపై చెయ్యెత్తాను. కరాటే కల్యాణి కొన్ని సినిమాల్లో అడల్ట్ టైప్ వాటిల్లో నటించింది. నేను చేశాను. అందులో తప్పేం ఉంది. నేను ఆర్టిస్ట్‌ను. ఇది బతుకుదెరువు. అమ్మాయిలను పిలిపించి నాపై రేప్ కేసులు పెడతానని హెచ్చరించింది. కల్యాణి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తోంది. మీరంతా నాకు సపోర్ట్ ఇవ్వండి’ అంటూ చెప్పుకొచ్చాడు.
శృతిమించి తానేమీ చేయలేదని, ఇది తన బతుకుదెరువు అనేది శ్రీకాంత్‌రెడ్డి మాటల సారాంశం. చాలా మందికి తాను ఉపాధి కల్పిస్తున్నట్టు అతను తెలిపాడు. చిన్న విషయాన్ని పెద్ద రాద్ధాంతం చేసిందన్నాడు. తన వీడియోలపై అభ్యంతరం వుంటే చట్ట ప్రకారం ఫిర్యాదు చేసుకోవాలన్నాడు. ఆ పని చేయకుండా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం ఏంటని అతను ప్రశ్నించాడు. కరాటే కల్యాణిపై ఎస్‌ఆర్ నగర్ పోలీసుల స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశానన్నాడు.