జగన్ పాలనలో రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని కుప్పంలో చంద్రబాబు అన్నాడు. రాష్ట్రానికి, దేశానికి తేడా తెలియని అమాయకుడు కాదు చంద్రబాబు. అయితే శ్రీలంక హాట్ టాపిక్ కాబట్టి జనాల్ని ఆ పేరుతో భయపెట్టాలని ఆయన కోరిక.
శ్రీలంక సంక్షోభానికి ప్రధాన కారణం డాలర్ నిల్వలు లేక చమురుని దిగుమతి చేసుకోలేకపోవడం. ఈ రోజు మన జీవితాల్ని శాసించేది ఆయిల్ అనే 3 అక్షరాలే. తెల్లారి ఇంట్లోకి పాల ప్యాకెట్ రావాలన్నా, మార్కెట్‌లో కూరగాయలు కొనాలన్నా, ఆఫీస్‌కి వెళ్లాలన్నా, అన్నం వండుకు తినాలన్నా అన్నింటికి పెట్రో ఉత్పత్తులు అవసరం. అవి దొరక్కపోయే సరికి జనం రోడ్ల మీదకి వచ్చారు.
మన దేశంలో రాష్ట్రాలకి ఆయిల్‌తో సంబంధం లేదు. అదంతా కేంద్రం ఆధీనం. మహా అయితే స్థానిక పన్నుల్లో కొంచెం తేడా ఉండొచ్చు. అంటే ఇతర రాష్ట్రాల కంటే రూపాయి ఎక్కువ ధరకు అమ్మచ్చు. అంతే తప్ప రాష్ట్రాలకు ఎన్నటికీ ఆయిల్ సంక్షోభం రాదు. వస్తే దేశం మొత్తానికి వస్తుంది.
శ్రీలంకను పీడించిన రెండో సమస్య పవర్‌కట్. 13 గంటలు పవర్‌కట్‌ని భరించలేకపోయారు. మన రాష్ట్రానికి అంత సమస్య రానేరాదు. సహజంగానే ఎండా కాలంలో డిమాండ్ ఎక్కువ వుంటుంది. అందుకే పవర్‌కట్‌లు. మన రాష్ట్రంలోనే కాదు, చాలా రాష్ట్రాల్లో వుంది. జనం అసహనం గుర్తించి వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు.
అయితే అప్పులు సమర్థనీయమా అంటే కానేకాదు. కానీ చంద్రబాబు కూడా తలకి మించిన అప్పుల్ని మోపే వెళ్లారు. జీఎస్టీ ఆదాయాన్ని చూస్తే పేపర్లు, ప్రతిపక్షాలు చెబుతున్నంత అధ్వాన్న స్థితి ఏమీ లేదు. సమస్య ఎక్కడుందంటే ఆదాయానికి మించిన పథకాల ఖర్చుని మోసుకోవడంతో మౌలిక వసతుల అభివృద్ధి కుంటుపడుతోంది. అంతే కాకుండా జీతాల్ని సరైన తేదీకి ఇవ్వలేని స్థితి వచ్చింది. శ్రీలంకలా జనం రోడ్ల మీదకి వస్తారనుకోవడం బాబు అత్యాశ.
అయితే అప్పులు ప్రమాదంలోకి నెడుతాయి. దీనికి పెద్ద ఆర్థిక పరిజ్ఞానం అక్కర్లేదు. కామన్‌సెన్స్ చాలు.
జీఆర్ మహర్షి