ఇటీవల కాలంలో ప్రాంక్ వీడియోలు వరుస వివాదాలకు దారి తీస్తున్నాయి. యువ హీరో విష్వక్‌సేన్ తన సినిమా ప్రమోషన్ కోసం ప్రాంక్ వీడియో చిత్రీకరించడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ప్రాంక్ వీడియో చిత్రీకరణపై టీవీ9, విష్వక్‌సేన్ మధ్య వివాదం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తాజాగా మరో ప్రాంక్ యూట్యూబర్‌పై దాడి వరకూ వెళ్లింది.
యూసఫ్‌గూడలో యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిపై కరాటే కల్యాణి చేయి చేసుకున్నారు. ప్రాంక్ వీడియో వివాదం కావడంతో, చిన్నసైజు సెలబ్రిటీలు గొడవ పడడంతో ఈ గొడవ మీడియాకెక్కింది. ఈ నేపథ్యంలో అసలేం జరిగిందో కరాటే కల్యాణి పలు చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో వివరించారు.
శ్రీకాంత్‌రెడ్డి పలువురు అమ్మాయిలను ప్రలోభపెట్టి అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నట్టు ఆరోపించారు. వీటి వల్ల సమాజం చెడు మార్గంలో ప్రయాణిస్తోందని వాపోయారు. తన ఊరికి చెందిన ఓ అమ్మాయి ఫోన్ చేసి శ్రీకాంత్‌రెడ్డి దురాగతాలపై ఫిర్యాదు చేసిందన్నారు. అలాగే పలువురు తల్లిదండ్రులు తనకు ఫోన్ చేసి సామాజిక సేవ చేసే మీరు, ప్రాంక్ వీడియోల పేరుతో యువతను చెడు మార్గంలో నడిపిస్తున్న శ్రీకాంత్‌రెడ్డిపై తగిన చర్య తీసుకోవాలని కోరారన్నారు.
ఈ నేపథ్యంలో శ్రీకాంత్‌రెడ్డితో మాట్లాడేందుకు ఇంటి వద్దకు వెళ్లానన్నారు. ప్రాంక్ వీడియోలపై మాట్లాడేందుకు వచ్చానని, ఒక్కసారి ఇంటి పైనుంచి కిందికి రావాలని కోరానన్నారు. అతను మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఇతరమ్మాయిలకైతే రూ.10 వేలు, రూ.20 వేలు మాత్రమే ఇస్తానని, నీకైతే రూ.లక్ష, రూ.2 లక్షలు ఇస్తానని మాట్లాడినట్టు చెప్పారు.
పరోక్షంగా తన వద్ద పడుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడడంతో కోపం వచ్చిందన్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దేహశుద్ధి చేయాల్సి వచ్చిందని కరాటే కల్యాణి చెప్పారు.