విదేశీ విధానంలో మోదీ నెంబర్ ఒన్. శ్రీలంక విషయంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చాలా బ్యాలెన్స్‌డ్‌గా వుంది. శ్రీలంకతో గతంలో మనకు చేదు అనుభవాలున్నాయి.
ఇందిరాగాంధీ హయాంలో శ్రీలంకతో (అప్పటి సిలోన్) మంచి సంబంధాలుండేవి. తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్) విషయంలో ఇందిరాగాంధీ యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పట్లో అది అనివార్య స్థితి. లేదంటే బంగ్లా కాందీశీకులతో దేశం నిండిపోయేది. పాక్ నరమేధంలో లక్షల మంది చనిపోయేవారు.
ఈ నేపథ్యంలో శ్రీలంకకి కొన్ని అనుమానాలుండేవి. అయితే లంక రాజకీయాల్లో ఇందిర జోక్యం చేసుకోలేదు (టైగర్‌లకి తమిళనాడులో శిక్షణ ఇచ్చారని ఆరోపణలు ఉన్నప్పటికీ). తర్వాత రాజీవ్‌గాంధీ వచ్చాడు. లంకలో సివిల్ వార్ ముదిరింది. తమిళుల కోసం విమానాల్లో ఆహారం, మందులు పంపారు. అక్కడితో ఆగకుండా ఒప్పందం కుదుర్చుకుని ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పంపారు.
వియత్నాంలో అమెరికా పోగొట్టుకున్నట్టు, వేల మంది మన సైనికులు శ్రీలంక రాజకీయాల్లో బలై పోయారు (1165 మంది మృతి, 3009 మందికి గాయాలు. ఇది అధికారిక లెక్క. కానీ ఇంతకు మించి మృతులు వుంటాయని అంచనా). ఆయుధం వదిలితే మరణమే అని టైగర్లకి తెలుసు. అందుకే ఒప్పందాన్ని అంగీకరించినట్టు నటించారు. రాజీవ్ మళ్లీ ప్రధాని అయితే ప్రమాదం అని చివరికి ఆయన్ని హత్య చేశారు.
గతాన్ని గుర్తు పెట్టుకున్న మోదీ సాయం అందించారు తప్ప ఆ గొడవలో తల దూర్చలేదు. లంకలోని తమిళులకి సాయం అందించాలని స్టాలిన్ చేసిన విజ్ఞప్తికి ఔను అనలేదు, కాదనలేదు. లంకలో ప్రజలంతా కష్టాల్లో వుంటే, కేవలం తమిళులకే సాయం చేయడం కరెక్ట్ కాదని కేంద్రానికి తెలుసు. స్టాలిన్‌కి కూడా తెలుసు కానీ, ఆయన రాజకీయాల ప్రకారం విజ్ఞప్తి కరెక్టే. అంతే కాకుండా లంక నుంచి పెద్ద ఎత్తున తమిళులు వలస రాకుండా తీరం వెంబడి అలర్ట్‌గా వున్నారు.
ఇది మాత్రమే కాదు, ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో కూడా బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరించారు. రష్యాని దూరం చేసుకుంటే జరిగే నష్టం మోదీకి తెలుసు. అలాగని యుద్ధాన్ని సమర్థించలేదు. యూరప్ దేశాల పర్యటనలో కూడా వ్యాపార ప్రయోజనాలే లక్ష్యంగా ఉన్నారు.
గుజరాత్ వాళ్లు అధికారంలో వుంటే ఇదే లాభం. వాళ్లకి ఎమోషన్స్ వుండవు. విదేశీ వ్యవహారాలు ఎమోషన్స్‌తో నడవవు. వ్యూహాలతో నడుస్తాయి. మోదీ మంచి వ్యూహకర్త!
జీఆర్ మహర్షి