తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా దిల్ రాజు ఎంపికయ్యారు. హోరాహోరీగా సాగిన ఫిలింఛాంబర్ ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో దిల్ రాజు గెలుపు ఖాయమైంది. 48 ఓట్లలో 31 ఓట్లు దక్కించుకొని, అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు రాజు.
తెలుగు ఫిలింఛాంబర్ లో 48 సీట్లు ఉంటాయి. వీటిలో మెజారిటీ మార్కు 25. అంటే.. 25 పోస్టుల్లో ఒకే ప్యానెల్ కు సంబంధించిన వ్యక్తులు ఉండాలి. దిల్ రాజుకు 31 ఓట్లు వచ్చాయి. అంటే స్పష్టమైన మెజారిటీతో దిల్ రాజు గెలిచారన్నమాట.
ఫిలింఛాంబర్ లో నాలుగు ఎగ్జిక్యూటివ్ కమిటీలు ఉంటాయి. స్టుడియో ఎగ్జిక్యూటివ్ కమిటీ, ప్రొడ్యూసర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఎగ్జిబిటర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి ఛాంబర్ లో మొత్తం 1567 మంది ఉన్నారు. ఈరోజు 891 ఓట్లు పోలయ్యాయి. అంటే దీనర్థం 891 మంది ఓటింగ్ లో పాల్గొన్నట్టు కాదు.
ఫిలింఛాంబర్ లో ఒక నిర్మాతకు ఒక ఓటు అనే పద్ధతి లేదు. ఒక నిర్మాతకు ఎన్ని బ్యానర్లు ఉంటే అన్ని ఓట్లు ఇస్తారు. అలా ఛాంబర్ లో కొంతమంది నిర్మాతలకు 15 ఓట్లు కూడా ఉన్నాయి.
పైన చెప్పుకున్న 4 కమిటీల నుంచి 48 మంది ఎన్నికయ్యారు. వాళ్లు తమ కమిటీలకు ఛైర్మన్లను ఎన్నుకోవడంతో పాటు.. మొత్తంగా ఛాంబర్ అధ్యక్షుడ్ని కూడా ఎన్నుకున్నారు. ఈ 48 మందిలో 31 మంది దిల్ రాజుకు ఓటేశారు. వీళ్లలో స్వతంత్రులు కూడా ఉండడం, వాళ్లు దిల్ రాజుకే మద్దతు ఇవ్వడంతో ఆయన మెజారిటీ పెరిగింది.
ఓవరాల్ గా చూసుకుంటే.. 891 ఓట్లలో దిల్ రాజుకు 563 ఓట్లు పోలవ్వగా.. ప్రత్యర్థి సి.కల్యాణ్ కు 497 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా ముత్యాల రాందాస్, జాయింట్ సెక్రటరీగా దామోదర్ ప్రసాద్, ట్రెజరర్ గా ప్రసన్న కుమార్ ఎన్నికయ్యారు.
తన చేతికి ఛాంబర్ పగ్గాలొస్తే ఏం చేస్తాననే విషయాన్ని దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. మరీ ముఖ్యంగా దశాబ్దాల కిందట ఏర్పాటుచేసుకున్న బై-లాస్ ను మార్చాలని దిల్ రాజు మనసులో బాగా ఉంది. ఒక నిర్మాతకు ఒకే ఓటు విధానాన్ని తీసుకురావాలనేది ఆయన ఆలోచన.
ఈ రెండేళ్ల పదవీకాలంలో కీలకమైన బై-లాస్ లో దిల్ రాజు ఎలాంటి మార్పుచేర్పులు తీసుకొస్తారో చూడాలి. దీంతో పాటు, ఛాంబర్ అధ్యక్షుడిగా ఆయన తనదైన ముద్ర వేయాలనుకుంటున్నారు.