రచయిత, సంపాదకుడు శ్రీరమణ యీ నెల 19న వెళ్లిపోయారు. అతి క్లిష్టమైన ప్యారడీ ప్రక్రియలో జరుక్ శాస్త్రి తర్వాత ఆయనంత పేరు తెచ్చుకున్నది యీయనే! ప్యారడీ చేయడానికి ఎంతో పఠనం, పాండిత్యం, రచనలో ఉన్న విశేషగుణాన్ని పట్టుకునే నేర్పు, దాన్ని ఉత్ప్రేక్షించి, వెక్కిరించగలిగిన వికటకవి లక్షణం అన్నీ ఉండాలి. శ్రీరమణకు అన్నీ ఉన్నాయి. ఆయనలాటి పత్రికా సంపాదకులు, చక్కటి సెంటిమెంటల్ కథలు రాసినవారు, పొలిటికిల్ కాలమిస్టులు, హాస్యకథలు రాసినవాళ్లూ ఉన్నారు కానీ ఆయనలా ప్యారడీ చేయగలిగినవారు ఎవరూ లేరు. ప్రాచీన కవుల నుంచి అత్యాధునిక రచయితల దాకా అందర్నీ ఆయన కాచి వడపోశాడు. వాళ్ల రచనల్లోని వికారాన్ని డేగలా కనిపెట్టాడు. అది మనందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పగలిగాడు. ఆ విభాగంలో ఆయన స్థానం భర్తీ చేయలేనిది!
ఆయన నాకు వ్యక్తిగతంగా తెలుసు. 1990లలో బాపు-రమణలతో పరిచయం ఏర్పడినప్పుడే వారి అంతేవాసిగా ఉన్న యీయనతోనూ ఏర్పడింది. 1995లో హైదరాబాదుకి తిరిగి వచ్చినపుడు ఆయనా హైదరాబాదుకి వచ్చారు. ఇక్కడే అనేక పత్రికల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. ఆయన ప్రస్థానం పత్రికల్లో ప్రారంభమైంది. బాపురమణలతో దాదాపు 20 ఏళ్లు తోడుగా ఉండి, అనేకమంది సినిమావాళ్లతో పరిచయాలు ఏర్పడినా, ఆయన ఆ రంగంలో పెద్దగా రాణించలేదు. ఏవో కొన్ని సినిమాలకు మాటలు రాశారు కానీ నిలదొక్కుకోలేదు. మళ్లీ పత్రికా రంగానికే వచ్చారు. ఆయన సంపాదకత్వంలో, గౌరవ సంపాదకత్వంలో నడిచిన పత్రికలు విజయవంతం కాలేదు కానీ శ్రీరమణ పాండిత్యం, విషయపరిజ్ఞానం నన్ను విస్మయ పరిచేవి. హాస్యం ఆయనకు అలవోకగా పలికేది. ఎప్పుడూ నవ్వుతూ, చెణుకులు విసురుతూ, ఎనెక్డోడ్లపై ఎనెక్టోడ్లు వల్లిస్తూ కబుర్లు చెప్పడం ఆయనకు సరదా. మాటల్లో వేళాకోళంతో పాటు కాస్త స్కెప్టిసిజం కూడా ధ్వనించేది. పెద్దా చిన్నా ఎవరినైనా సరే, ఆట పట్టించడంలో తెనాలి రామకృష్ణుడి కున్నంత తెగువ ఉంది.
ఆయన మరణించినప్పుడు వచ్చిన వ్యాసాల్లో ఆయన రాసిన ‘‘మిథునం’’ను హైలైట్ చేస్తూనే వివిధ పత్రికల్లో ఆయన నిర్వహించిన శీర్షికలెన్నిటినో చాలామంది పేర్కొన్నారు. తెలుగుభాషపై ఆయనకు మంచి పట్టు ఉంది. జాతీయాలను వాడడంలో, పదాన్ని విరవడంలో దిట్ట. ఆయన గురించి పరిచయం చేయడానికి నేను ‘న్యూనుడి’ అనే ప్రక్రియను, ‘‘ధనలక్ష్మి’’,‘‘అరటిపువ్వు స్వాములారు’’, ‘‘బంగారు మురుగు’’ కథలను రేఖామాత్రంగా పరిచయం చేస్తాను. ఆయన బహుముఖప్రజ్ఞ మీకు అర్థమౌతుంది.
‘‘హాస్యజ్యోతి’’ అనే సంకలనంలో ప్రముఖుల చమత్కార ఉదంతాలు, చిత్రోక్తుల పేర రెండు లైన్ల వ్యాఖ్యలు, యిలా అవీయివీ ఉన్నాయి. చిత్రోక్తులకు ఒక ఉదాహరణ – ‘మధ్య మార్క్సిస్టు రంగనాయకమ్మ గారితో సహా – శ్రీరాముని నమ్మి చెడిపోయిన వారు లేరహో!’ సందర్భం తెలియనివారి కోసం చెప్పాలంటే రంగనాయకమ్మ చాలాకాలం పాటు సెంటిమెంటల్ నవలలు రాసి పేరు తెచ్చుకున్నారు. మధ్యలో ఆవిణ్ని మార్క్సిజం ఆకర్షించింది. ఇక అప్పణ్నుంచి ఆ దృక్కోణంలో రాయసాగారు. రామాయణానికి ‘‘రామాయణ విషవృక్షం’’ పేర తన తరహా వ్యాఖ్యానం చేసి చాలా పేరు, డబ్బు తెచ్చుకున్నారు. ఈ చిత్రోక్తికి బాపు ఒక మహిళ కొడవలితో ఒ పెద్ద చెట్టును నరుకుతూన్న బొమ్మ వేశారు. చెట్లోంచి నోట్లు రాలుతూంటాయి.
కవి దాశరథి నిజాం పాలనలో ఆయన్ని ఎదిరిస్తూ పోరాటం చేశారు. విప్లవగీతాలు రాశారు. తర్వాతి రోజుల్ల కాంగ్రెసు ప్రభుత్వం వచ్చినపుడు అంజయ్య ఆయనను ఆస్థానకవిగా నియమించారు. ఎన్టీయార్ ముఖ్యమంత్రి అవుతూనే ‘ఆస్థాన’ పదవులన్నీ రద్దు చేశారు. తక్కినవారు ఊరుకున్నారు కానీ దాశరథి కోర్టు కెళ్లారు. దాన్ని గుర్తు చేస్తూ శ్రీరమణ రాసిన చిత్రోక్తి – ‘నవాబుపాలనలో ‘ప్రజాకవి’ – ప్రజారాజ్యంలో దాశరథి ‘ఆస్థానకవి’! ఆ పుస్తకంలోనే ‘న్యూనుడి’ (కొత్తగా యీయన కాయిన్ చేసిన నానుడులన్నమాట)కి ఉదాహరణలు- ‘ఇంజనీరు మనవాడైతే ఇసుకతో పని ఏమి?’, ‘ఉగ్గులనాడు బిడ్డలు గాని, పెగ్గులనాడు బిడ్డలా?’, ‘అభిమానులు ఆర్భాటమే కానీ హాల్లో పురుగు లేదు’, ‘అగ్నిసంస్కారం అయితే గాని సిగరెట్ పొగరెట్ కాదు’, ‘అవార్డు చిత్రనిర్మాతను ఆశీర్వదించమంటే నన్ను పోలి బతకమన్నాట్ట’, ‘ఆత్మకథ రాయనేల? అందర్నీ తిట్టనేల?’, ‘ఆడని సినిమాకి అన్నీ వంకలే!’, ‘ఆవలిస్తే పెగ్గులు లెఖ్ఖపెట్టగలడు’ !
ఆయన ఆంధ్రప్రభలో సహాయసంపాదకులుగా పని చేసే రోజుల్లో ‘శ్రీ ఛానెల్’ అనే శీర్షిక నడిపారు. చాలా పాప్యులర్ అయింది. దానిలో ఒక వ్యాసం పాతికేళ్ల క్రితం రాసినా, యిప్పటికీ గుర్తుండిపోయింది. ఆ పేపరు కటింగ్ చేతిలో లేదు కాబట్టి ఆయన వాడిన పదాలను యథాతథంగా చెప్పలేక పోతున్నాను కానీ థీమ్ చెప్తాను. ఆ మధ్య వ్యక్తిత్వవికాసం సబ్జక్ట్‌పై చాలా పుస్తకాలు, వ్యాసాలు వచ్చిపడ్డాయి. ప్రతీదానిపై కూలంకషంగా ఆలోచించి, ప్రణాళికాబద్ధంగా చేయాలంటూ సహజంగా, సింపుల్‌గా చేసే పనులకు కూడా సూత్రీకరణలు వచ్చేశాయి. అవి మితిమీరాయి కూడా. దాన్ని శ్రీరమణ పట్టుకుని హేళన చేశారు. ‘మీ యింట్లో ఎలక్ట్రిక్ బల్బు వెలగలేదనుకోండి. ఆచరణలో దిగే ముందు మీరు ఒక కాగితం తీసుకుని కారణాలు, పరిష్కారాలు, మీ వద్ద ఉన్న ఆప్షన్లు రాసుకుంటూ పోవాలి. వెలగకపోవడానికి రెండు కారణాలు ఉండవచ్చు. కరంటు పోయి ఉండవచ్చు లేదా బల్బు పోయివుండవచ్చు. పక్కగదిలో లైటు వెలుగుతోంది కాబట్టి మొదటిది కాదు. ఇక రెండో ఆప్షనే ఏకైక ఆప్షన్ అవుతుంది.
ఇక బల్బు పోవడమంటూ జరిగితే రెండు ఆప్షన్లు ఉన్నాయి. బల్బు లేకుండానే కాలక్షేపం చేయడం, బల్బు మార్చడం. మార్చేటప్పుడు కూడా మూడు ఆప్షన్లు, దీనికంటె తక్కువ వాటేజిది తేవడం, లేకపోతే
అంతే వాటేజి, లేదా ఎక్కువ వాటేజిది. ఏదో ఒకటి నిశ్చయించుకున్నాక, యింట్లో పాతది ఉందేమో చూడడం, లేదా బజారు కెళ్లి తేవడం.. యిలా ఆప్షన్ల పరంపర కొనసాగుతుంది. బల్బు మార్చడానికై స్టూలు మీద కుర్చీ పెట్టాలా? కుర్చీ మీద స్టూలు పెట్టాలా? భార్యాభర్తల్లో ఎవరు స్టూలు పట్టుకోవాలి, ఎవరు ఎక్కాలి? తొందరపడి ఎవరూ త్యాగాలు చేయకూడదు, యిద్దరూ ప్రశాంతంగా కూర్చుని చర్చించి, నిర్ణయించి, నిశ్చయం చేసుకుని… యిలా సాగిపోతుంది. స్టాండర్డయిజేషన్, సూత్రీకరణ పేర చిన్న విషయానికి పెద్ద బిల్డప్ ఎవరు చేసినా నాకిదే గుర్తుకు వస్తుంది.
అలాగే ప్రతీ చిన్నదానికీ ఆధ్యాత్మిక కలరింగు యివ్వడం కూడా చికాకు తెప్పిస్తుంది. దాన్ని ‘‘అరిటిపువ్వు సాములారు’’ కథలో ఉతికి ఆరేశారు శ్రీరమణ. స్వాములారికి అరటిపువ్వు వడలు యిష్టం. అందుచేత దానిలో సమస్త వేదాంతసారం ఉన్నట్లు ప్రవచనాలు యిస్తూంటాడు. అరటిపువ్వు రేకు మాయ, దాన్ని తొలగిస్తే కనబడే పూత మన కర్మశేషం. అత్తంగా పెనవేసుకున్న భవబంధాలనే పూతను విడగొట్టి ప్రతీ పూతలో ఉన్న దొంగ, బూచాడు అనే రాగద్వేషాలను త్యజిస్తే చివర్లో తేలే బుడిపెయే ఆత్మలింగం! -యిలా చెప్తాడు. మరో ఊళ్లో ‘ఇది విష్ణుమూర్తి శంఖం. దీని అసలు వర్ణం తెలుపు. నీలమేఘశ్యాముని వెన్నంటి ఉండి నీలవర్ణానికి మారింది. అమ్మవారి సాంగత్యంలో కుంకుమలు అద్దుకుని రవ్వంత ఎరుపు కలిసింది. ఒలిస్తే వచ్చే పూతలు శంఖంలో నాదాలు, ఒలుచుకుంటూ వెళితే ఓంకారం నుంచి ఘీంకారం దాకా స్వరాలు వినిపిస్తాయి. దొంగ, బూచాడు అపశ్రుతులు… యిలా.
ఇంకోచోట అధర్వణ వేదం అరవై ఒకటో పనసలో అరటిపువ్వు నుంచి విద్యుత్తు పుట్టించే సూత్రం ఉంది. అది నాకు తెలుసు. ఆంజనేయస్వామికి తెలుసు. వారు లంకలో మొదట అరటిచెట్లను ధ్వంసం చేసి, ఆ పువ్వుని తోక చివర తగిలించుకుని, తద్వారా విద్యుత్కణాలు సృష్టించి లంకాదహనం చేశారు – అంటాడు. ‘ఒలిచిన పూతలు అరిషడ్వార్గాలకూ లోబడే జీవిలా కనరెక్కుతాయి. అందుకని మజ్జిగ అనే పరిజ్ఞానంతో శుద్ధి చేయాలి. మరో పక్క నానబెట్టిన శెనగపప్పు అనే పూర్వజన్మ సుకృతంతో పాటు చిటికెడు అనుభవక్షారాన్ని, పట్టినంత మమ-కారాన్ని వేసి మొత్తాన్ని మధించి ముద్ద చేయండి. అగ్నిదేవునికి ఆవాహన చేసి మనసనే బాణలిలో మానవత్వమనే నూనె పోయండి. ఆ ముద్దని చిట్టిగారెలుగా హరి సంకీర్తన చేస్తూ చేతుల్తో తట్టి, పరిపక్వమయ్యాక అంటే బాగా వేగాక ప్రసాదంగా స్వీకరించి, ఆహారమయకోశం నింపండి’ అని ఉద్బోధిస్తాడు. ఇది 1996 నాటి కథ.
ఈ కథకు ముగింపు ఏమిటంటే యీ స్వామి దగ్గరకు ఓ భక్తురాలు వచ్చి ‘తమరు అనుగ్రహిస్తే మీ అరిటిపువ్వు సిద్ధాంతాలూ, మీ జీవితచరిత్రనూ గ్రంథస్తం చేయాలని ఉంది. మీ పాదాల వద్ద అరటిపువ్వంత చోటు యిస్తే…’ అంది. దాంతో సాములారు అమ్మో, అది మాత్రం వద్దు అంటూ పాంకోళ్లు చేత పట్టుకుని పరుగు లంకించుకున్నాడు.
ఉన్నత వర్గాల్లోని మహిళా ఎంట్రప్రెనార్స్ గురించి మనం పత్రికల్లో కథనాలు చదువుతూ ఉంటాం. ఓ చదువుకోని పల్లెటూరి అమ్మాయి లోకజ్ఞానంతో, లౌక్యంతో వ్యాపారంలో ఎలా నెగ్గుకు వచ్చిందో చెప్తుంది, ‘‘ధనలక్ష్మి’’ కథ. సీతారామాంజనేలు అనే ఓ పిల్లాడు ఏడో క్లాసు చదువుతుండగానే ఇప్పుడో కాసేపో అనే స్థితిలో ఉన్న డబ్బున్న దూరపు బంధువుకి దత్తత వెళ్లాడు. నేను బతికుండగానే వీడి పెళ్లి చూడాలంటూ ఆయన రెండో క్లాసు చదివే అమ్మాయి భాగ్యలక్ష్మినిచ్చి పెళ్లి చేసేశాడు. తీరా చూస్తే ఆయన కోలుకున్నాడు. తన వ్యాపారం తను చూసుకోసాగాడు. ఈ కుర్రాడు ఎనిమిదవ క్లాసు, అతని భార్య అదే స్కూలులో మూడో క్లాసు. దాంతో యితనికి చచ్చేటంత సిగ్గుగా, న్యూనతగా ఉండేది. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాడు. తెలివైనవాడూ కాదు.
ఓ రోజు అతన్ని మేస్టారు బెంచి ఎక్కించిన సమయంలో భార్య వచ్చి గుమ్మంలో నిలబడి ‘ఇదిగో రామాంజనేలూ, నాకు పెన్సిలు కావాలి…’ అని అరిచింది. క్లాసంతా గొల్లుమంది. పరువు పోయిందన్న బాధతో అతను స్కూలు మానేసి యింటికి వచ్చేశాడు. పెళ్లం కూడా చదవకూడదని మారాం చేశాడు. పెంపుడు తండ్రి ‘ఏం ఫర్వాలే, వచ్చి కొట్లో కూర్చో’ అన్నాడు. ఆంజనేయులికి 20 ఏళ్లు, ధనలక్ష్మికి 17 ఏళ్లు ఉండగా పెంపుడు తండ్రి కాలం చేశాడు. దుకాణంలోని గుమాస్తాలు మోసం చేసి దోచేశారని బయటపడింది. బాకీలు తీర్చేసరికి ఏమీ మిగల్లేదు. ఏ కొట్లోనో పనివాడిగా చేరతానని భర్త అంటే ధనలక్ష్మి అతన్ని వారించి, నగా నట్రా అమ్మి, పిండిమర పెడదామని సలహా యిచ్చింది. భర్త తటపటాయిస్తూ ఉంటే కథకుణ్ని పిల్చుకుని రమ్మనమంది.
మనకు వీళ్ల కథ చెప్తున్న కథకుడు ఆంజనేయులికి క్లాసుమేట్. డిగ్రీ చదువుతున్నాడు. వేరే ఊళ్లో ఉన్న పిండిమర కంపెనీకి వెళ్లి కొంత సొమ్ము వాయిదాల్లో కట్టించుకోవడానికి ఒప్పించమని ధనలక్ష్మి కోరింది. మాటచాతుర్యం లేని భర్తకు తోడుగా ఉండి, సాయం చేయమంది. ఇతనా సాయం చేశాడు. పిండిమర వెలిసింది. ఆమె అక్కడే ఉండి చిన్న మరమ్మత్తులతో సహా అన్నీ నేర్చుకుంది. ఊళ్లో ఉన్న ఏకైక మర కావడంతో రోజుకి పన్నెండు గంటలు తిరిగేది. ఈమె బియ్యం, అపరాలు బస్తాలతో తెచ్చి అక్కడ పెట్టింది. అక్కడే కొనడం, అక్కడే పిండి ఆడించుకుని వెళ్లడంతో జనాలకు సౌకర్యంగా ఉంది. అప్పు తీరిపోవడంతో కంపెనీ వాళ్లు పసుపు ఆడే మిషన్ కూడా వాయిదాల్లో అమర్చారు. పొద్దున్నే పిండిమర ఆవరణ తుడిపించి, వచ్చిన అన్ని రకాల పిండిని పోగేసి పొట్లాలుగా చేసి ‘వనమూలికలతో చేసిన సున్నిపిండి’ పేర అమ్మించింది. పిండిమర మెలకువలన్నీ ఆమెకు కొట్టిన పిండి అయ్యాయి.
పోనుపోను నగానట్రా అమిరాయి. కొడుకు పుట్టాడు. ఆమెను అంతా ధనమ్మ అని పిలవసాగారు. భర్త చేత కిరాణా వ్యాపారం పెట్టించింది. భార్య కొస్తున్న ప్రాధాన్యత చూసి రోషపడుతున్న భర్తకు తనకంటూ ఓ దుకాణం ఏర్పడడం తృప్తినిచ్చింది. వాళ్లు ఎదుగుతున్నారు. ఈ లోగా కథకుడు బిఇడి పూర్తి చేసి, ఉన్న ఊళ్లో వెయ్యి రూపాయల జీతానికి టీచరుగా కుదురుకున్నాడు. ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాడు. సాయంత్రం వేళ ధనమ్మ దంపతుల వ్యాపారం లెక్కాడొక్కా చూసేవాడు. బదులుగా అతనింటికి కావలసిన పచారీ అంతా కొట్టు నుంచి వెళ్లేది. ఆ తర్వాత ధనమ్మ యాత్రలు నడిపింది. పెద్ద బజార్లో పెద్ద షాపు అమ్మకానికి వస్తే కొని ఎరువుల ఏజన్సీ పెట్టించింది. రాజీవ్ హత్య సందర్భంగా అల్లర్లు వచ్చినపుడు రైల్వే అధికారికి లంచం పెట్టి, యిక్కడకు రావలసిన యూరియా బస్తాలు వేరే చోటకి పంపించి, ధర పెరిగిన తర్వాత యిక్కడికి రప్పించి ఆర్జించింది.
ఇవి మాత్రమే రాస్తే ఓ ఎంటర్‌ప్రెనార్ కథగా ముగిసిపోయేది. కానీ చురుకైన, తెలివైన ఒక మహిళకు వచ్చే అదనపు సమస్యేమిటో శ్రీరమణ చెప్పారు. బాగా పల్లంగా ఉన్న ఆరెకరాల స్థలం లక్షకు కొందామంటే, భర్త ఈగో ప్రాబ్లెమ్‌తో అడ్డుపడ్డాడు. 70 వేలకి మించి వద్దన్నాడు. అతని మాట చెల్లించాలని ఆమె పైకి అంతే యిచ్చి, లోపాయికారీగా తక్కిన డబ్బు అమర్చి, బేరం సెటిల్ చేయించింది. అక్కడ పిల్లర్లు వేయించి గోడౌన్ కట్టించింది. అదంతా తన ప్రజ్ఞే అని భర్త అనుకునేట్లు ‘మా ఆయన గడుసువాడు’ అంటూ అతన్ని ఉబ్బేసింది. అలాగే కొడుకుని గారాబం చేసి భర్త చెడగొడుతూంటే, వాణ్ని పక్కూళ్లో హాస్టల్లో వేయిద్దామనుకుని, వక్రంగా మాట్లాడి భర్త చేతే ఆ మాట అనిపించి, అతని అహాన్ని కాపాడింది, తను అనుకున్నది సాధించింది.
ఇక ‘‘బంగారు మురుగు’’ కథ ఒక మనవడికి, అతని బామ్మకు మధ్య ఉన్న అనుబంధం గురించి. అతనికి ఆరేళ్లు. తల్లీతండ్రీ ఎంతసేపూ పూజలు, పునస్కారాలు, తడీమడీ అంటూ యితన్ని దగ్గరకు తీయరు. ఇతను పెరట్లో బాదం చెట్టు నీడలో బామ్మ ఒడిలోనే ఉంటూంటాడు. బామ్మకు యీ హంగామా, స్వాములకు మొక్కడాలూ నచ్చవు. చెట్టుకి చెంబెడు నీళ్లు, పక్షికి గుప్పెడు గింజలు, పశువుకి నాలుగు పరకలు, ఆకొన్నవాడికి పట్టెడు మెతుకులు పెట్టడం చేస్తే చాలు అనే ఫిలాసఫీ ఆవిడది. పిల్లాడు బజారు తిళ్లు తింటే కుటుంబం పరువు పోతుందని యింట్లో వాళ్ల కట్టడి చేశారు. తమకు తెలియకుండా మనవడికి కొనిపెడుతోందని బామ్మ చేతికి డబ్బు అందకుండా చేస్తే దేవతార్చనలో బుల్లి కంచుగంట ఎత్తుకెళ్లి పీచుమిఠాయి కొనిపెట్టింది. దొంగతనం బయటపడి, కోడలు భయంభక్తీ లేవని వెక్కిరిస్తే ‘దేవుడు గంటలో ఉంటాడేమిటి, పసివాళ్ల బొజ్జలో ఉంటాడు కానీ..’ అని సాయకారం తీసింది.
‘ఈ మెట్ట వేదాంతాలకేం లెండి. ఇట్లాగే వదిలేస్తే అవ్వా మనవడూ కలిసి ఆ చేతి మురుగు కూడా కరిగించేసుకుని తింటారు’ అంది కోడలు. విషయమేమిటంటే యీవిడకో బంగారు మురుగు ఉంది. దాన్ని చెరిపించి జత గాజులు చేయించుకుందామని కోడలు ఆశ. తనకివ్వాలని కూతురు ఆశ. ఎవరికీ యివ్వను అని బామ్మ ఘంటాపథంగా చెప్పింది. దసరా రోజుల్లో వీళ్లింటికి స్వాములారు, శిష్యగణం, గున్న ఏనుగు, నాలుగు ఆవులూ, జింకపిల్ల, రెండు పల్లకీలు వగైరా వచ్చి విడిది చేశారు. ఇల్లంతా వచ్చేపోయే భక్తులు, భోజనాలు, ప్రసాదాలు … ఈ హడావుడిలో పిల్లాణ్ని పట్టించుకునే వారు లేరు, బామ్మ తప్ప. బామ్మకు స్వాములారంటే ఖాతరు లేదు. ‘ఇదంతా సర్కస్ డేరారా, వాళ్లు చెప్పే పూర్ణదీక్షాపరులు, శిష్యపరమాణువులూ యిలాటి వాళ్లు ఎవరూ లేర్రా, అంతా ఆడంబరం, మామూలు మనుషులేరా అబ్బీ’ అనేసింది.
ఓసారి మనవడు చొక్కా వేసుకుని తీర్థమడిగితే అపచారం జరిగిందంటూ స్వాములారు పెద్ద హంగామా చేసేశాడు. అందరికీ తీర్థాలు ఆపేశాడు. దాంతో యీ అబ్బాయి తండ్రి శివాలెత్తిపోయి కొడుకుని చితకబాదేశాడు. బామ్మకు వెర్రి కోపం వచ్చింది. మర్నాడు స్వాములారి ప్రధాన శిష్యుణ్ని పిల్చి ‘ఏం సాములారయ్యా, బోడి సాములారు. అరిసెల్నీ, అప్పాల్నీ వదల్లేనివాడు అరిషడ్వర్గాల్నేం వదుల్తాడు. ఇలా అన్నాననని మీ పీఠాయ్కి చెప్పు ఫో’ అని దులిపేసింది. మర్నాడు మహానైవేద్యం కాకుండానే మనవడికి చిట్టిగారెలు పెట్టి, ఆ శిష్యుణ్ని పిలిచి ‘యిదిగో పిల్లాడికి పెట్టా, ఇప్పుడేం చేస్తారో చేసుకోండి’ అని ఛాలెంజ్ చేసింది. స్వాములారికి దడ పుట్టింది. మనవణ్ని మర్నాడు ముద్దు చేసి ‘ఏవమ్మో, నీ మనవడు బాలకృష్ణుడు..’ అని ఈవిణ్ని ఖుషామత్ చేశాడు.
ఇరవై ఏళ్లు గడిచాయి. ఆస్తులు తరిగాయి. అట్లాగని దరిద్రం లేదు. ఏదోలా నడుస్తోంది. మనవడికి బందరులో ఉద్యోగం వచ్చింది. ఓ పెళ్లి సంబంధం వచ్చింది. కానీ నాలుగు కాసుల బంగారం దగ్గర తేడా వచ్చింది. డబ్బు గురించి కాకపోయినా మాట పట్టింపు వచ్చింది. ఎవరూ దిగి రాలేదు. ఆ అమ్మాయి బామ్మకు బాగా నచ్చింది. ఆమెను చేసుకుంటే సుఖపడతావురా అని మనవడికి చెప్పి చూసింది. ఔనంటే తలిదండ్రులకు కోపం వస్తుందేమోనని అబ్బాయి జంకు. ‘ఈ కోపతాపాలు నాలుగు రోజులుంటాయి, ఆనక పోతాయి. నిక్షేపం లాటి పిల్ల, చేసుకుంటానని కరాఖండీగా మీ అమ్మానాన్నకు చెప్పు. ఎనభై దాటేశాయి. నీ పెళ్లి కోసమే ప్రాణాలు ఉగ్గబట్టుక్కూచున్నా.’ అంది.
మనవడు ఏమీ చేయకుండా మౌనంగా ఉండి, చివరకు బందరు వచ్చి, ఆ సంబంధం ఖాయం చేయండి అని ఉత్తరం రాశాడు. పోస్టు చేసేలోగానే పెళ్లి ఖాయమైనట్లు కబురొచ్చింది. ఆడపెళ్లివారు దిగివచ్చారని యితని అమ్మానాన్నా సంతోషించారు. పెళ్లయింది. భార్య కాపురానికి వచ్చింది. బామ్మను బందరు రమ్మంటే రానంది. కొన్ని నెలలకే జబ్బు పడింది. ఆఖరి చూపుకి వెళ్లిన మనవడు దిగాలు పడితే ‘నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తానురా? అలా వెళ్లి కాసేపు పెత్తనం చేసి, మళ్లీ నీ యింటికి వస్తాగా..’ అంది. ఆవిడ పోయాక బంగారు మురుగు కరిగించబోతే తెలిసింది, అది గిల్టుదని. అందరూ తెల్లబోయారు. తర్వాత పెళ్లిపెద్దగా కథ నడిపినతను చెప్పాడు, మనవడికి మంచి పెళ్లం రావాలని తన బంగారు మురుగు కరిగించి బామ్మ యిచ్చిందని! ‘బామ్మ మా యింటికి వస్తుంది, నా కూతురిగా, ఆవిడ బంగారు మురుగు అవిడకే..’ మనవడు అనుకోవడంతో కథ ముగుస్తుంది.
నేను చెప్పడం చప్పగా చెప్పాను కానీ కథ చాలా రంజుగా ఉంటుంది. ‘‘మిథునం’’లో కథ పెద్దగా నడవక, తిండి గోల ఎక్కువై కాస్సేపు పోయాక నస అనిపించింది నాకు. కానీ యీ కథలో బామ్మ చాలా లైవ్లీ కారెక్టరు. ఆవిణ్ని చూస్తే ముచ్చటేస్తుంది. ఈ కథ 1993లో ఆంధ్రజ్యోతి వీక్లీలో వచ్చినపుడు 800 ఉత్తరాలు వచ్చాయి. ‘ఇది మా బామ్మకథే, అమ్మమ్మ కథే, మా తాత కథే..’ అంటూ. అంతగా ఐడెంటిఫై అయ్యారు పాఠకులు. వీలైతే తప్పక చదవండి. శ్రీరమణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ..
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2023)