టాలీవుడ్లో అద్భుతమైన స్టార్ డమ్, బీభత్సమైన ఫాలోయింగ్ వున్న హీరో పవన్ కళ్యాణ్ ఒకరు. ఒంటరిగా పార్టీ పెట్టి, రెండు పార్టీలను టార్గెట్ చేయగలిగిన సత్తా వుంది అంటే అది సినిమాల వల్ల వచ్చిన ఫాలోయింగ్ నే. కానీ ఆ ఫాలోయింగ్ ఇచ్చిన సినిమాలను మాత్రం పాడుచేసుకుంటున్నారు. సరైన మిత్రుడు అంటే చేదు అయినా మంచి సలహా ఇవ్వాలి. అంతే తప్ప బద్దకం నేర్పకూడదు. కానీ పవన్ విషయంలో అదే జరిగినట్లు, జరుగుతున్నట్లు కనిపిస్తోంది.
2008 లో జల్సా వచ్చిన తరువాత పులి.. తీన్ మార్.. పంజా అనే మూడు అట్టర్ ఫ్లాపులు ఇచ్చారు. మళ్లీ 2012 గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక ఓ ఫ్లాప్ ఇచ్చారు. అదే కెమేరామన్ గంగతో రాంబాబు. ఆ వెంటనే అత్తారింటికి దారేది సూపర్ హిట్. కానీ ఆ తరువాత గోపాల గోపాల యావరేజ్.
ఆపై సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఙాతవాసి గురించి కొత్తగా గుర్తు చేయక్కరలేదు. 2018లో అజ్ఙాతవాసి వచ్చాక ఇక సినిమాలు పక్కర పెట్టారు మూడేళ్ల పాటు. జగన్ అధికారంలోకి వచ్చాక పవన్ మళ్లీ సినిమాలు స్టార్ట్ చేసారు. 2021 లో వకీల్ సాబ్, 2022 లో భీమ్లా నాయక్, ఇప్పుడు బ్రో. మూడు సినిమాలు కూడా హడావుడి ఎక్కువే తప్ప రికార్డులు ఏమీ క్రియేట్ చేయలేదు. వీటిలో పక్కా కమర్షియల్ సినిమా భీమ్లా నాయక్ మాత్రమే. ఆ సినిమా కూడా నైజాంలో 30 కోట్లకు బాగా కిందకే వుండిపోయింది.
పవన్ కళ్యాణ్ ఏ సినిమాలు చేయాలి. ఏ సినిమాలు ఆపాలి అన్నవి అన్నీ ఇప్పుడు ఆయన ఆప్తుడు త్రివిక్రమ్ నే చూసుకుంటున్నారు. వకీల్ సాబ్ సినిమాను సెట్ చేసింది త్రివిక్రమ్ నే. భీమ్లా నాయక్ సినిమాకు అన్నీ తానై వ్యవహరించారు. షూటింగ్ అన్ని రోజులు సెట్ కు వచ్చి మరీ చూసుకున్నారు. బ్రో సినిమా ను కూడా ఆయనే సెట్ చేసారు. స్క్రీన్ ప్లే. మాటలు అందించారు. గమ్మత్తేమిటంటే త్రివిక్రమ్ మాటలు అందించిన తీన్ మార్ ఫ్లాప్ నే. అన్నీ ఆయనే చేసిన అజ్ఙాతవాసి కూడా డిజాస్టర్ నే. కేవలం జల్సా, అత్తారింటికి దారేది మాత్రమే హిట్ లు.
త్రివిక్రమ్ ప్రమేయం లేని హరి హర వీరమల్లు, ఉస్తాద్ సినిమాలు అలా పక్కన పడి వున్నాయి. నిజానికి ఈ రెండు సినిమాలే ఫ్యాన్స్ కు అసలు సిసలు ఆకలి తీర్చేవి. కానీ ఇవి మాత్రం ముందుకు కదలడం లేదు. ఎందుకంటే అక్కడ పవన్ సమస్య కూడా వుంది. పెద్ద హీరోలు పెద్ద సినిమా చేయాలంటే కనీసం 90 నుంచి 100 రోజులు అవసరం పడతాయి. కానీ పవన్ అలా చేయడానికి ఇష్టపడడం లేదు. ముఫై రోజులకు మించి చేయడం లేదు. పాటలు, ఫైట్లు వద్దంటున్నారు. డ్యాన్స్ లు చేయడం లేదు. బ్రో సినిమాలో ఫైట్ సీక్సెన్స్ లో పవన్ కూడా చేయాల్సి వుంది. కానీ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ కొట్టారు. అలాగే సాంగ్ కూడా సగం రోజు అంటే ఓ పూట లో కానిచ్చేయమన్నారు.
హరి హర వీరమల్లు సినిమా యాజ్ ఇట్ ఈజ్ గా చేస్తే ఓ రేంజ్ సినిమా. పాటలు, ఫైట్లు ఒకటి కాదు. కానీ పవన్ ఆ స్క్రిప్ ను మొత్తం మార్పించారని, పాటలు, ఫైట్లు చాలా వరకు కోసేసారని ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా హరీష్ శంకర్ టైప్ ఫక్తు మాస్ కమర్షియల్ సినిమా. కానీ వంద రోజులు డేట్స్ ఇవ్వాలి.
త్రివిక్రమ్ చాలా సులువుగా ఆదాయం వచ్చే పద్దతి కనిపెట్టారు. తనకీ, పవన్ కు ఇద్దరికీ కలిసి వచ్చేలా. సింపుల్ గా ఇరవై.. ముఫై రోజులు డేట్ లు ఇవ్వడం, 60 కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ అందుకోవడం. ఒళ్లు అలిసిపోకుండా, పాటలు, ఫైట్లు లేకుండా, అలా అలా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి, అటు ఇటు నడిచి వదిలేయడం. త్రివిక్రమ్ కూడా సినిమాలు సెట్ చేసినందుకు ఎంతో కొంత ప్రమేయం చూపించి, తన ఆదాయం తాను అందుకోవడం. లేటెస్ట్ సినిమా ఓజి కూడా త్రివిక్రమ్ సెట్ చేసినదే. ఈ సినిమా వెనుక కూడా త్రివిక్రమ్ కమిట్ మెంట్లు, ఆర్థిక లావాదేవీలు వున్నాయనే గుసగుసలు వున్నాయి.
ఇప్పుడు ఈ పద్దతి అలవాటు పడిన తరువాత 100 రోజులు డేట్ ఇవ్వాలంటే పవన్ కే కాదు ఎవరికైనా కాస్త బద్దకంగా, ఇబ్బందిగా వుంటుంది. పైగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలు అన్నీ పవన్ పొలిటికల్ లైఫ్ మధ్యలో జరిగాయి. వస్తే వచ్చినట్లు లేదంటే లేనట్లు. ఎన్నో క్యాన్సిలేషన్లు.. ఇలా అన్ని విధాలా నిర్మాతలు, దర్శకులు రాజీ పడుతూ సినిమా చేయాలంటే అన్ని సార్లూ కుదిరేది కాదు. పక్కా మాస్ కమర్షియల్ సినిమాలకు అస్సలు కుదరదు. ఎందుకంటే అక్కడ అన్ని విధాలా కాంబినేషన్లు వుంటాయి.
ఇప్పుడు పవన్ మీద తన మార్కెట్ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వుంది. అలా చేయాలంటే కాస్త బద్దకం వదిలించుకుని మాస్ ఎంటర్ టైనర్లు చేయాల్సిందే. పాటలు, ఫైట్లు వుండాల్సిందే. క్రిష్ లాంటి దర్శకుడికి లేదా హరీష్ శంకర్ లాంటి డైరక్టర్ కు సరెండరై, వాళ్లు చెప్పినట్లు చేస్తే మళ్లీ ఫ్యాన్స్ ఆకలి తీరే రెండు మంచి హిట్ లు పడతాయి. లేదూ ఈ షార్ట్ కట్ పద్దతే బాగుంది అని, త్రివిక్రమ్ వెదికి వెదికి అలాంటి సినిమాలు సెట్ చేస్తూ పోతే ఫ్యాన్స్ ఫాలోయింగ్ పడిపోతుంది. అది పవన్ పొలిటికల్ మైలేజ్ ను కూడా పడేస్తుంది. తస్మాత్ జాగ్రత్త.
చాలా దూరంగా వినిపించే గ్యాసిప్ కూడా ఒకటి వుంది. ఇది కొంత మంది జోక్ గా కూడా అనే వెర్షన్. త్రివిక్రమ్ కావాలనే పవన్ కు తెలివిగా పక్కదారి పట్టిస్తున్నారా? అనేదే ఈ గ్యాసిప్. ఇది నిజమా కాదా అన్నది పక్కన పెడితే త్రివిక్రమ్ ప్రమేయం వల్ల జరుగుతున్న డ్యామేజ్ ను పవన్ కన్నా ఎక్కువ గ్రహించింది పవన్ ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే.
పవన్ వయస్సు కూడా పెరుగుతోంది. వికీపీడియా సంగతి పక్కన పెడితే ఆయన వయస్సు 55 ఏళ్లు అని అంటారు. ఇప్పుడు సరైన స్క్రిప్ట్ లు టేకప్ చేసి, వళ్లు వంచకపోతే కెరీర్ చివరికి వచ్చేస్తుంది. కానీ అలా జరగకూడదు. ఎందుకంటే 2024 లో పవన్ సిఎమ్ అయ్యే చాన్స్ లేదు. 2029 లో వుండొచ్చు. అప్పటి వరకు స్టార్ డమ్ ను, క్రేజ్ ను కాపాడుకోవాలి అంటే సరైన సినిమాలే కీలకం. ఆ సంగతి పవన్ అర్జంట్ గా తెలుసుకుని, మేలుకుని, మసులుకోవాలి.