నాగ్ చైతన్య-కళ్యాణ్ కృష్ణ సినిమా రారండోయ్ వేడుక చూద్దాం, మే 19న విడుదల అవుతుందని వార్తలు వినవచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా విడుదల వాయిదా పడే సూచనలు వున్నాయని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి కారణం, ఆ సినిమాకు కాస్త రిపేర్లు చేస్తుండడమే అని టాక్. ఇప్పటికే నాగ్ ఆ సినిమాను చూసి కొన్ని సలహాలు సూచనలు చేయడంతో కొన్ని రీషూట్ లు తప్పలేదని తెలుస్తోంది.
అక్కడితో ఆగకుండా సీనియర్ రైటర్ సత్యానంద్ ను కూడా ఈ ప్రాజెక్టులో ఇన్ వాల్వ్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్నేపెళ్లాడుతా కథకు కాస్త గట్టి ఎమోషన్లు జోడించి రారండోయ్ వేడుక చూద్దాం కథ తయారు చేసారు. నిన్నేపెళ్లాడుతాలో హీరోయిన్ తండ్రి (ఆహుతి ప్రసాద్) పాత్ర మాదిరిగా కాకుండా, ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రను తయారు చేసారు.
మంచి ఎమోషన్లు, పాత్రలతో కూడిన కథ రెడీ అయినా, అనుకున్న రేంజ్ లో తెరకెక్కలేదని, నాగ్ ఫీలయి, కొన్ని సూచనలు చేసారని, ఆఖరికి ఇప్పుడు సత్యానంద్ ను కూడా ప్రాజెక్టులోకి తెచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందువల్ల 19న విడుదలవుతుందా, 26కు వాయిదా పడుతుందా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే 19న విడుదలకు నిఖిల్ కేశవ సినిమా రుమ్మాలేసింది. అంతకు ముందువారం శర్వానంద్ రాధ సినిమా విడుదలయ్యే అవకాశం వుంది.