షారుక్ ఖాన్… బాలీవుడ్‌లో ఒక సంచలనం. నటుడిగా తనలో చాలా పార్శ్వాలున్నప్పటికీ ప్రధానంగా రొమాంటిక్ హీరో ఇమేజ్‌తో చాలా బ్లాక్‌బస్టర్లు ఇచ్చాడు. ఒక టైమ్‌లో అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ అతని దరిదాపుల్లో కూడా లేరు. కానీ ఏజ్ పెరిగే కొద్దీ షారుక్‌కి వున్న రొమాంటిక్ హీరో ఇమేజ్ అడ్డంకిగా మారింది. అతడిని ఒకే తరహా పాత్రల్లో చూడ్డానికి ప్రేక్షకులు ఇష్టపడడంతో ప్రయోగాలు చేయలేకపోయాడు.
అమీర్ ఖాన్‌కి అంటూ ఇమేజ్ లేకపోవడంతో అతను రకరకాల కథలు చేసి స్టార్‌గా చాలా ఎదిగిపోయాడు. సల్మాన్‌ఖాన్ తనకున్న మాస్ ఇమేజ్‌ని పూర్తిగా క్యాష్ చేసుకుంటున్నాడు. వీళ్లిద్దరూ బాలీవుడ్‌కి ఇప్పుడు టాప్ హీరోస్‌గా మారగా, షారుక్ మాత్రం ఇమేజ్ ఛట్రంలోంచి బయటకు రాలేక తడబడుతున్నాడు. ఇటీవలి కాలంలో అతని చిత్రాలకి వచ్చిన వసూళ్లతో షారుక్ పూర్తిగా తన స్టార్‌డమ్ కోల్పోయాడనేది తేటతెల్లమైంది.
ఫాన్, డియర్ జిందగీ లాంటి ప్రయోగాలు బెడిసికొట్టడం, దిల్‌వాలే, రయిస్ లాంటి కమర్షియల్ చిత్రాలు అంచనాలని అందుకోలేకపోవడంతో షారుక్ చిత్రాలపై బయ్యర్లలోను మోజు తగ్గింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప షారుక్ తిరిగి పూర్వపు వైభవాన్ని తెచ్చుకోవడం కష్టమని కొందరు అంటుండగా, అతని శకం ముగిసినట్టేనని, ప్రైమ్ దాటేసాడని చాలా మంది కొట్టి పారేస్తున్నారు.