నేటి నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లకు స‌మ‌యం ముంచుకొస్తోంది. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం నుంచి నామినేష‌న్ల ప్ర‌క్రియ‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం శ్రీ‌కారం చుట్టింది. ఈ కీల‌క ఘ‌ట్టం కోసం అభ్య‌ర్థులు ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఉద‌యం…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లకు స‌మ‌యం ముంచుకొస్తోంది. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం నుంచి నామినేష‌న్ల ప్ర‌క్రియ‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం శ్రీ‌కారం చుట్టింది. ఈ కీల‌క ఘ‌ట్టం కోసం అభ్య‌ర్థులు ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఉద‌యం 11 నుంచి సాయంత్రం 3 గంట‌ల వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. అభ్యర్థులు నామినేషన్‌తోపాటు తన నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, ఇత‌ర‌త్రా వ్య‌క్తిగ‌త వివరాలను తెలియజేయాల్సి వుంటుంది.

ఈ నెల 10వ తేదీ వ‌ర‌కూ ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారులు నామినేష‌న్లు స్వీక‌రిస్తారు. సెల‌వు దినాల్లో స్వీక‌రించ‌రు. న‌వంబ‌ర్ 13న నామినేష‌న్ల ప‌రిశీల‌న‌, 15న ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు విధించారు. నామినేష‌న్ల‌కు సంబంధించి ప్ర‌తి రోజూ గ‌డువు ముగిసిన త‌ర్వాత వివ‌రాల‌ను ఎన్నిక‌ల అధికారులు వెల్ల‌డిస్తారు. అలాగే నామినేష‌న్ దాఖ‌లు చేసే సంద‌ర్భంలో అభ్య‌ర్థులు స‌మ‌ర్పించిన అఫ‌డివిట్‌ల‌ను ఈసీఐ(ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు.

నామినేష‌న్ వేసే సంద‌ర్భంలో అభ్య‌ర్థులు విధిగా నిబంధ‌న‌లు పాటించాల్సి వుంటుంది. అభ్య‌ర్థితో పాటు ఐదుగురిని మాత్ర‌మే ఆర్‌వో కార్యాల‌యంలోకి అనుమ‌తిస్తారు. అలాగే రిట‌ర్నింగ్ అధికారి కార్యాల‌యానికి 100 మీట‌ర్ల ప‌రిధిలో ఒక్కో అభ్య‌ర్థికి సంబంధించిన మూడు వాహ‌నాల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తారు. 

తెలంగాణ‌లోని 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఈ నెల 30న‌ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపుతో తెలంగాణ పాల‌కులెవ‌రో తేల‌నుంది.