‘శభాష్ నాయుడు’ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దశావతారం సినిమాలో బాగా పేరు తెచ్చుకున్న ‘నాయుడు’ పాత్రతో ఫుల్ లెంగ్త్ సినిమాను చేస్తున్నాడు కమల్. ఈ సినిమాకు స్వయంగా కథ, స్క్రీన్ ప్లేలు రాసుకున్న కమల్ కొన్నాళ్ల కిందట టీకే రాజీవ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను మొదలుపెట్టాడు. ఇందులో తెలుగు నటుడు బ్రహ్మానందం ఒక ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. కమల్ తనయ శ్రుతి హాసన్ కూడా నటిస్తోంది.
ఆసక్తికరమైన రీతిలో మొదలైన ఈ సినిమాకు ఆది నుంచి దు:శకునాలు వెన్నాడుతున్నట్టుగా ఉన్నాయి. ముందుగా ఈ సినిమా దర్శకుడు టీకే రాజీవ్ కుమార్ అనుకోకుండా జబ్బుపడ్డారు. ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతున్నప్పుడు రాజీవ్ అరుదైన వైరస్ బారిన పడి.. తీవ్రంగా జబ్బుపడ్డారు. రాజీవ్ కుమార్ ను అమెరికాలోనే ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆయన పరిస్థితి బాగోలేదని.. అందుకే ఆ సినిమాకు తనే దర్శకత్వం వహిస్తానని కమల్ అప్పట్లో ప్రకటించాడు.
అలా అనూహ్యంగా దర్శకుడు ఆసుపత్రి పాలైన ‘శభాష్ నాయుడు’ షూటింగ్ కొనసాగింది. అయితే అంతలోనే కమల్ గాయపడ్డాడు. చెన్నై వచ్చాకా తన ఆఫీసులో మెట్లు దిగుతూ కమల్ కింద పడిపోయాడు. స్వల్పగాయాలే అని చెప్పినప్పటికీ కమల్ మళ్లీ కోలుకోవడానికి నెలలు పట్టాయి. అంత కాలం పాటు ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది.
ఇలా ఆ సినిమాకు దర్శకత్వ బాధ్యలు చేపట్టిన ఇద్దరూ ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంగతిలా ఉంటే.. ఈ సినిమా ఆరంభం అయ్యాకా కమల్ వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని అనుకోని ఘటనలు చోటు చేసుకున్నాయి. కమల్ జీవన సహచరి గౌతమి ఆయనకు దూరం అయ్యారు. వారిద్దరూ విడిపోయారు. ఈ సినిమా ఆరంభం అప్పుడు.. కమల్, గౌతమిలు కలిసే ఉన్నారు. అయితే.. ఆ మధ్య విడిపోయినట్టుగా ప్రకటన చేశారు. అది కూడా అనూహ్యంగా జరిగిందే.
ఇక కమల్ కొన్ని వివాదాలను కూడా ఎదుర్కొంటున్నాడు. తమిళనాడు ప్రభుత్వం గురించి, మహాభారతం గురించి కమల్ చేసిన వ్యాఖ్యానాలు ఇబ్బంది కరంగా మారాయి. వాటిపై కేసులు నమోదయ్యాయి.
ఇంతలోనే కమల్ అన్న చంద్రహాసన్ మరణించారు. చంద్రహాసన్ కమల్ కు అన్న మాత్రమే కాదు.. మార్గదర్శకుడు, కమల్ ను వెనకుండి నడిపించిన వ్యక్తి. ఆది నుంచి కమల్ ఆర్థిక వ్యవహారాలను ఆయనే పర్యవేక్షిస్తూ వచ్చారు. వయసులో కూడా కమల్ కన్నా పెద్దవాడే కావడంతో.. చిన్నప్పటి తనను తండ్రి లాలించింది, పాలించింది చంద్రహాసనే అని కమల్ తరచూ చెబుతూ ఉంటారు.
చంద్రహాసన్ సంస్మరణ ఇటీవలే పూర్తి అయ్యింది, కమల్ కూడా అందులోంచి బయటపడకుండానే.. ఇంతలోనే ఆయన అగ్నిప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఈ సారి కమల్ ఇంట్లోనే ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా మంటలు లేచాయని, పుస్తకాలు అంటుకున్నాయని.. ఊపిరితిత్తుల నిండా పొగ చేరిందని.. మూడో ఫ్లోర్ నుంచి తను బయటపడ్డానని పనివాళ్లు సహకరించారని.. పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నట్టుగా కమల్ ట్వీట్ చేశాడు. ఈ అగ్ని ప్రమాదంలో పుస్తకాలు మాత్రమే తగలబడ్డాయని కమల్ పేర్కొన్నారు.
మరి పై సంఘటనల్లో ఒకదానికి మరో దానికి పోలిక లేకపోవచ్చు.. ఒకదానికీ మరోదానికి సంబంధం లేకపోవచ్చు.. అయితే ఇవన్నీ కూడా ‘శభాష్ నాయుడు’ సినిమా ఆరంభం అయిన తర్వాతే జరుగుతున్నవే. గమనించాల్సిన ఇంకో విషయం ఏమిటంటే.. ఈ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్న బ్రహ్మానందం, శ్రుతిహాసన్ ల కెరీర్ కూడా ఏమంత గొప్పగాలేదీమధ్య. ఈ సినిమా ఆరంభం కాకముందు నుంచినే ఔట్ ఆఫ్ పామ్. ఆరంభం అయ్యాకా కొన్ని సినిమాలు విడుదలైనా.. అవేవీ ఆయనకు పేరు తీసుకురాలేదు. ఇక శ్రుతి సంగతి సరేసరి.. సింగం-3, కాటమరాయుడు వంటి సినిమాలు ప్లాఫ్ లుగా మిగిలాయి. బాలీవుడ్ కూడా ట్రయల్స్ అంత సానుకూలంగా లేవు.