గోడ మీది రాతను చూడకపోతే ఎలా?
నేను టిడిపి పాలనకు, వారసత్వ పాలనకు నైతిక మద్దతు యిచ్చానని కొందరు బాధపడ్డారు. నేనెవరికీ ఏ మద్దతూ యివ్వలేదు. ఉన్న వాస్తవాన్ని గుర్తిస్తున్నానంతే. నా బోటి 'మేధావి' కూడా యిలా సమర్థిస్తే ప్రజాస్వామ్యం ఏమైపోతుందంటూ కొందరు ప్రశ్నించారు. నా బొంద, నేను అవునంటే అవుతుందా, కాదంటే మానుతుందా? స్వాతంత్య్రపోరాట కాలంలో మహానుభావులు శక్తివంతమైన సంపాదకీయాలు రాసి ప్రజాభిప్రాయాన్ని మలచేవారట. ఇప్పుడెవరూ అలాటివారు కనబడటం లేదు. ఫిరాయింపులను ఖండిస్తున్నాను అంటూ ఘాటుగానో, వెటకారంగానో ఓ వ్యాసం రాస్తే పాఠకులు ఓహో అనవచ్చు తప్ప ఫిరాయింపులు ఆగుతాయా? వారికి మంత్రిపదవులు ఆగుతాయా? నేను ఆదర్శవాదిని కానని, రాజకీయాలను ఒక చదరంగంలా మాత్రమే చూస్తానని ఒక పరిశీలన. చాలాకాలం రాజకీయాలను అధ్యయనం చేస్తే ఎవరికైనా యిదే పరిస్థితి ఎదురవుతుంది. నేనూ చాలామందిపై ఆశలు పెట్టుకున్నాను. వాళ్లందరూ వాటిని వమ్ము చేశారు. అందువలన ప్రాక్టికల్‌గా జరుగుతున్నదే రాస్తాను తప్ప సంపాదకీయాల తరహాలో నీతిబోధలు చేయను. ఇప్పటికీ కలలు కనేవారికి అవి నచ్చకపోవచ్చు.
మోదీ దేశాన్ని గొప్పగా నడిపించేస్తాడని నేను అనుకోలేదు. నేను అనుకోకపోవడం చాలామందికి నచ్చలేదు. వారిలో కొంతమందికి తత్త్వం బోధపడింది. మరి కొంతమందికి ఆశలు చావలేదు. ఎవరి అనుభవాలు వారివి. యుపిఏ అంత అధ్వాన్నం కాకపోయినా మోదీ పాలన బాగాలేదని నా అభిప్రాయం. కానీ ప్రత్యామ్నాయం లేదు కాబట్టి మోదీ యింకో రెండు టెర్మ్‌లు, కనీసం ఒక టెర్మ్ కొనసాగుతాడనే అవగాహన నాకుంది. అది రాయడానికి జంకను. అంతమాత్రం చేత నేను మోదీ చర్యలను సమర్థిస్తున్నా ననుకోకూడదు. క్షేత్రవాస్తవాన్ని వాస్తవంగా గుర్తించకుండా 'మోదీని ఓడించండి' అని యావద్భారత ప్రజలకు నా కాలమ్ ద్వారా పిలుపు నిచ్చి భుజాలు చరుచుకోవడం అవివేకం. లేని బావ కంటె గూనిబావ మేలన్నారు. ఉన్న గూనిబావ తన గూనిని సవరించుకుంటాడనో, కనీసం కవర్ చేసుకుంటాడనో కోరుకోవడం తప్పు కాదు. మోదీ పాలన ఎలాగూ తప్పదు కాబట్టి అదేదో కాస్త మెరుగ్గా వుంటే బాగుండునని చిన్ని ఆశ. కెసియార్ విషయానికి వస్తే అతని వాగ్దానాలకు, వాటి అమలుకు హస్తిమశకాంతరం వుంది. అన్నీ అమరి వున్నాయి కాబట్టి ఏదోలా బండి లాగిస్తున్నారు. నగరం పరిస్థితి మెరుగు పడలేదు. గ్రామాల్లో ఎలా వుందో తెలియదు. మిషన్ భగీరథ మరో జలయజ్ఞమో, కాదో కొన్నాళ్లకు తెలుస్తుంది. అయినా యింకో టెర్మ్ నెగ్గడం ఖాయమనిపిస్తోందని రాస్తే అతని అప్రజాస్వామిక చర్యలను సమర్థించినట్లు కాదు.
ఆశ కాదు, అవగాహన…
ఇదే ధోరణిలో టిడిపి 2019లో మళ్లీ నెగ్గే అవకాశం వుంది అని రాయడం జరిగింది. అది నా కోరిక కాదు, నెగ్గించండని ఓటర్లకు యిచ్చిన పిలుపు కాదు, మరేదీ కాదు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని వేసిన అంచనా మాత్రమే. ఆంధ్రలో పాలన అస్తవ్యస్తంగా వుందని ఆ వ్యాసంలోనే రాశాను. అక్కడ ఆర్భాటం, అనవసర వ్యయం ఎక్కువ, జరిగేది అతి తక్కువ. ఋణమాఫీ, ప్రత్యేక హోదా, వికేంద్రీకరణ, రాజధాని నిర్మాణం, పోలవరం, రైల్వే జోన్, మెట్రో, కేంద్రనిధులు… ఏ అంశం తీసుకున్నా బాబు వైఫల్యం కనబడుతోంది. ఇచ్చిన నిధులకు కేంద్రం లెక్కలడుగుతూంటే రాష్ట్రప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఏ పనీ సాగటం లేదు. అయితే మీడియాను చేతిలో పెట్టుకుని అద్భుతాలు జరిగిపోతున్నాయని చాటుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. రాజకీయ అవినీతి, మంత్రుల దాష్టీకం, తనవారి తప్పులను కాయడం, అస్మదీయులకు దోచిపెట్టడం అన్నీ యథేచ్ఛగా సాగిపోతున్నాయి. మామూలుగా అయితే ప్రజలు టిడిపిని మళ్లీ ఎన్నుకోనక్కరలేదు. అయితే 2019 నాటికి వారి వద్ద ప్రత్యామ్నాయం ఏముంది? 2014 పార్లమెంటు ఎన్నికలకు ముందు మోదీకి వ్యతిరేకంగా నేను వ్యాసాలు రాస్తూ వుంటే కొందరడిగారు – 'మోదీ పెట్టుబడిదారులకు మాత్రమే లాభం చేసే వ్యక్తి అని చెపుతున్నారు. సరే, అతనికి ఓటేయం. మరి ఎవరికి వేయం? రాహుల్ గాంధీకా?' అని. పోయిపోయి రాహుల్‌కు, కాంగ్రెసుకు వేయమని నేనెలా చెప్తాను? సరైనవాడు కనబడక నేనే 'నోటా' మీట నొక్కాను. 'ప్రత్యామ్నాయం చూపడం నా పని కాదు. మోదీపై మరీ ఆశలు పెట్టుకోకండి అని చెప్పడమే నా లక్ష్యం' అని జవాబిచ్చాను. ఇప్పుడు 2019లో ఆంధ్ర ఓటర్లు అడిగినా ఏం చెప్తాం? టిడిపి మళ్లీ నెగ్గితే దానికి కారణం వాళ్ల ప్రతాపం కాదు, ప్రతిపక్షం వైఫల్యం!
పవన్ ప్రత్యామ్నాయం కాదా?
ఈ ముక్క అంటే జగన్ అభిమానులు హర్షించలేదు. కాంగ్రెసు మళ్లీ కోలుకోలేదు అనే మాట ఎవరూ ఖండించలేదు. కొందరైతే పవన్‌పై ఆశలున్నాయన్నారు. బిజెపితో కలిసి అతను అద్భుతాలు చేయగలడన్నారు. నాకైతే అతని రాజకీయాల్లో చిత్తశుద్ధి, నిజాయితీ, కమిట్‌మెంట్ కనబడటం లేదు. రాష్ట్రం అధ్వాన్నంగా వున్నా, ఏ సమస్యపై ఎప్పుడు ఎలా స్పందిస్తాడో ఎవరూ వూహించలేరు. ఏదో కాల్‌షీటు యిచ్చినట్లు ఒకసారి వస్తాడు, ఏదో గందరగోళంగా మాట్లాడతాడు, శ్రోతలను కిర్రెక్కిస్తాడు, అంతే ఫాలోఅప్ కార్యక్రమం ఏమీ వుండదు, ఆచరణలో ఏమీ కనబడదు, ఆయన ప్రొడ్యూసర్లకే దొరకడు, యిక ప్రజలకు ఎలా అందుబాటులో వుండగలడు? వాళ్లు ఎన్నాళ్లు తపస్సు చేసినా ఆయన తలచుకున్నపుడే ప్రత్యక్షమవుతాడు. పోనీ అలా అని పార్టీలో ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకుల్ని తయారుచేసి ప్రజలతో సంపర్కం వుండేట్లా కార్యాలయాలు ఏర్పాటు చేశాడా అంటే అదీ లేదు. అదేమంటే నా దగ్గర డబ్బు లేదంటాడు.
ఎన్నికలు యింకో రెండేళ్లల్లో వస్తున్నాయంటే యీ పాటికి ఎన్ని సన్నాహాలు జరిగి వుండాలి! చివరకు ఎన్నికల టైముకి ఏదో ఒక పార్టీకి పక్కవాయిద్యంగా తేలతాడనుకుంటున్నాను తప్ప ప్రధాన భూమిక వహించి, ప్రజానాయకుడిగా వస్తాడనుకోవడం లేదు. మరి ఏ పార్టీకి కాల్‌షీట్ యిస్తాడన్నది యిప్పుడే చెప్పలేం. అయితే బిజెపికో లేక టిడిపికో తప్ప వైసిపికి అయితే కాదు కదా! పవన్ మద్దతు యిచ్చినా బిజెపి 2019లో ఆంధ్ర గెలిచేస్తుందా? ఓ పాఠకుడు రాశాడు – 2014కు ముందు యుపిలో బిజెపికి వున్న బలమెంత? అయినా మోదీ 80లో 75 సీట్లు గెలవలేదా? అని. యుపిలో బిజెపికి ఎప్పుడూ కొన్ని ఓట్లు స్థిరంగా వున్నాయి. పైగా మోదీ తరహా నాయకుడు ఆంధ్ర బిజెపికి వున్నాడా? ఉన్నవాళ్లల్లో చాలామంది బిజెపి మౌలిక సిద్ధాంతాలేమిటో తెలియని ఫిరాయింపుదారులే. పైగా ఆంధ్ర బిజెపి టిడిపి సమర్థకులు-వ్యతిరేకులుగా చీలిపోయి వుంది. అమిత్ షా దీనిపై దృష్టి పెట్టాలి, పార్టీ నిర్మించాలి, యివన్నీ ఎప్పటి కవుతాయో తెలియదు. అందుకని ప్రతిపక్షం అంటే వైసిపి ఒక్కటే కనబడుతోంది. దాని పరిస్థితి ఏమిటి?
వైసిపి బలం పెరుగుతోందా? తరుగుతోందా?
దాని పరిస్థితి ఎలా వుందన్న విషయంలోనే చాలామంది పాఠకులు నాతో విభేదించారు. వారి వాదనలో రెండు అంశాలు – 2014 ఎన్నికలలో టిడిపికి, వైసిపికి ఓట్ల శాతంలో వ్యత్యాసం అతి తక్కువ, సంఖ్యలో అయిదు లక్షల చిల్లర. అందువలన జగన్‌కు ప్రజాదరణ బాగా వుందనుకోవాలి! ఇక్కడ ఓట్ల శాతం మాత్రమే లెక్కలో తీసుకుంటే సరైన చిత్రం రాదు. వైసిపి బలమంతా కొన్ని జిల్లాలకే పరిమితమై అక్కడే చాలా ఓట్లు వచ్చాయి. అనేక జిల్లాలలో వైసిపి ఘోరంగా దెబ్బ తింది. 34 సీట్లున్న ఉత్తరాంధ్రలో 4 సీట్లు, 34 సీట్లున్న ఉభయగోదావరుల్లో 3, 33 వున్న కృష్ణా, గుంటూరులలో 10… యిలాటివి కూడా లెక్కలోకి తీసుకోవాలి. రెండో విషయం 2014 తర్వాత యీ మూడేళ్లలో వైసిపి యీ జిల్లాలలో పుంజుకుందా అనే ప్రశ్న. దానికి ఆధారం ఏమీ కనబడటం లేదు. తాజా ఎన్నికల్లో కడప జిల్లాలో సైతం వైసిపి ఓడిపోవడమేమిటి? అంటే టీచర్స్ విభాగంలో మరో సీటు నెగ్గిందిగా అంటున్నారు. నాయకుడి సొంత జిల్లాలోనే యిలా ఓదార్చుకోవలసి వస్తోంది చూడండి.
జగన్ తన ఎమ్మెల్యేలను పోగొట్టుకుంటున్నాడు అని రాస్తే అధికార పార్టీ ఒత్తిళ్లు అలా వున్నాయి మరి.. అంటున్నారు కొందరు. బాబు పదేళ్లు ప్రతిపక్షంలో వున్నారు. ఈ స్థాయిలో ఎమ్మెల్యేలను పోగొట్టుకున్నారా? ఎన్నో రాష్ట్రాలలో పార్టీలు దశాబ్దాల తరబడి అధికారంలో లేకపోయినా నాయకులను తమతో వుంచుకోగలుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలోనే ప్రతిపక్షాలు చతికిల పడుతున్నాయి. ఎందువలన? ఇవి మళ్లీ అధికారంలోకి రావు అని ఆ పార్టీల ఎమ్మెల్యేలు అనుకోవడం చేతనే! వాళ్లకీ గ్రౌండ్ రిపోర్టులు వుంటాయి కదా! ఫిరాయింపుల తర్వాత వాళ్ల యిళ్ల ముందు ప్రజలు ప్రదర్శనలు చేయడం లేదు కదా! మంత్రులుగా మారి వస్తే దండలు వేయడం మానటం లేదు కదా! పార్టీలు మారేవారికి 2019లో ప్రజలు బుద్ధి చెప్తారు అనుకుని మధ్యతరగతి మేధావులు తమకి తామే నచ్చచెప్పుకుంటూ కూర్చోవాలి తప్ప అప్పటికి చమత్కారాలు ఏమీ జరగవు. దేశమంతా ఫిరాయింపులే. అధికారపక్షాలు నిస్సిగ్గుగా స్పీకరు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యంతో ఆడుకుంటున్నాయి. ప్రజల్లో చైతన్యం ఏమైనా కనబడుతోందా? వాళ్లకి తీరిక ఎక్కడ? ఏ ఎటిఎంలో క్యాష్ వస్తోందోని పరుగులు పెట్టడంతోనే సరిపోతోంది.
ఫిరాయింపుల గురించి ఫిర్యాదులు ఎన్నాళ్లు?
ఫిరాయింపుల గురించి ఫిర్యాదులు చేస్తూ తిరగడంతోనే జగన్‌కు సరిపోతోంది. అసలు అతని పార్టీయే ఫిరాయింపుదార్లతో ప్రారంభమైంది. ఎన్టీయార్‌లా కొత్త మొహాలతో, యువతతో పార్టీ పెట్టి వుంటే తనకు విశ్వాసంగా వుండేవారు. కాంగ్రెసును చీల్చివేసి, వాళ్ల ప్రభుత్వాన్ని పడగొట్టేసి, ముఖ్యమంత్రి అయిపోదామనే ఆదుర్దాతో ఫిరాయింపులపై ఆధారపడ్డాడు. అయితే అందులో ఒక నీతి పాటించాడు. వాళ్ల చేత రాజీనామా చేయించి, తన పార్టీ ద్వారా మళ్లీ గెలిపించుకున్నాడు. ఇప్పుడు బాబుకి ఆ నీతి కరువైంది. రాజీనామా చేయించి ఉపయెన్నిక పెట్టడం లేదు. అవసరం కనబడకో, ధైర్యం చాలకో చెప్పలేం. కేంద్రమో, మీడియానో కలగచేసుకుంటే తప్ప ఆ పని చేయకపోవచ్చు. ఉపయెన్నికలంటూ జరిగితే అప్పుడు పడిన ఓట్లు బట్టి ప్రతిపక్షం పుంజుకుందో, చతికిలబడిందో స్పష్టంగా తెలుస్తుంది. అప్పటిదాకా ఎవరికి నచ్చినట్లు వాళ్లు వూహించుకోవడమే!
ఏది ఏమైనా ఫిరాయింపుదారు ఫిరాయింపుదారే. ఎన్నికల ముందు కొందరు గోడ దూకితే, తర్వాత కొందరు దూకారు. దూకుతూ దూకుతూ పాత నాయకుడి మీద రాళ్లు రువ్విపోతారు. జగన్ నియంత అని, ప్రతిభ వున్నవాళ్లను సహించలేడని, మంచీమర్యాద తెలియనివాడని ఏవేవో అనేసి పోతున్నారు. అవన్నీ నమ్మనక్కరలేదు అనుకున్నా జగన్ పార్టీలోంచి మైసూరా రెడ్డి వంటి చాలామంది మంచి వక్తలు, ప్రతిభావంతులు వెళ్లిపోయారన్న మాట వాస్తవం. తెలంగాణలో అయితే మరీనూ. జగన్ వ్యవహారశైలి ఎటువంటిదో మనకైతే తెలియదు. కానీ యీ స్థాయిలో అనుచరులను పోగొట్టుకోవడం ఉత్తమ నాయకత్వ లక్షణమైతే కాదు. చంద్రబాబు పాలన పట్ల ప్రజల్లో ఆగ్రహం ఎంత వుందో తెలియదు కానీ అసహనం, అసంతృప్తి అయితే ధారాళంగా వుంది. దాన్ని ఛానెలైజ్ చేసే వ్యూహం వైసిపి వద్ద లేదు. ఎంతసేపూ ''సాక్షి'' పత్రికలో, టీవీలో చెప్పుకుంటే సరిపోయిందా? ప్రజలు ఓ పట్టాన తిరగబడరు. సహిస్తూనే పోతూ వుంటారు. వారిలో చైతన్యం రగిలించాలంటే ప్రజాసంఘాలను కూడగట్టుకోవాలి, ప్రజావేదికలను ఏర్పరచాలి. సదస్సులు పెట్టి, సమావేశాలు పెట్టి జరుగుతున్నదానిపై ప్రజలకు అవగాహన ఏర్పరచాలి. ఊరూరా నాయకులు తయారుచేయాలి. బాబు వంటి మీడియా మేనేజర్‌ను తట్టుకోవడానికి యిప్పుడు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం చాలవు.
ప్రజల కోసం ప్రతిపక్షం ఏం చేస్తోంది?
టిడిపి చేతిలో అవస్థలు పడుతున్న సాధారణ ప్రజలు వైసిపి తమకోసం ఏం చేస్తోందా అని చూస్తారు. కనీసం అసెంబ్లీలో తమ బాధలను వినిపించగలుగుతోందా అని ఆలోచిస్తే సమాధానం శూన్యం. 'ఏం చేయమంటారు, మమ్మల్ని మాట్లాడనివ్వటం లేదు' అని వీళ్లు చెప్తే 'మాట్లాడనిచ్చేట్లుగానే ప్రవర్తించు' అని జనాలు సలహా చెప్తారు. జగన్ లేవగానే టిడిపి వారందరూ 'లక్ష కోట్లు' అనో, 'జైలుపక్షి' అనో ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటారు. ఇతనికి చికాకు వేసి ఏదో అంటాడు, మైకు లాక్కుంటారు. పరిస్థితి యిలా వున్నపుడు జగన్ తను కాకుండా తక్కినవారిని మాట్లాడనివ్వాలి. అభ్యంతర పెట్టలేని భాష ఉపయోగించాలి. 'వచ్చీరాని ఇంగ్లీషులో బాబు..' అంటూ రెచ్చగొట్టడం దేనికి? ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీషు వచ్చని బాబుకి జనాలు ఓట్లేయలేదు. ఇటికకు కంకర్రాయితో సమాధానం చెప్తాం అన్నట్లు వుంది అధికార పార్టీ. వాళ్లు ఏం చేసినా చెల్లిపోతోంది. స్పీకరు వాళ్లు చెప్పినట్లే ఆడుతున్నాడు. ఇక్కడే కాదు, అనేక రాష్ట్రాలలో యిదే పరిస్థితి. అలాటప్పుడు ఎంత లౌక్యంగా, దొరక్కుండా ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామనేది ఒక కళ. తను ఏం చేసినా భూతద్దంలో చూపుతారని తెలిసినపుడు జాగ్రత్తగానే వుంటే పోయె.
ప్రజలకు కావలసినది తమ సమస్యలు తీరడం, వచ్చేసారి తమరు ముఖ్యమంత్రి అవుతారా లేదా అన్నది కాదు. అది గ్రహించాలి. 'ఆ ఒక్కటీ అడక్కు'లో రాజేంద్రప్రసాద్‌లా 'ఆఫ్టర్ టూ ఇయర్స్, ఐ యామ్ ద సిఎం' అని చెప్పుకుంటే ఎబ్బెట్టుగా వుంటుందని తోచదా? కావాలంటే అలాటివి పార్టీ సమావేశంలో కార్యకర్తలను ఉత్సాహపరచడానికి చెప్పుకోవచ్చు. ప్రజల మధ్య, అధికారుల ముందు ఎందుకు? ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిపక్ష నాయకుడిలో ఎన్నో లోటుపాట్లు కనబడుతున్నాయి. అతన్ని సవరించే పార్టీ ప్రిసీడియం వంటి వ్యవస్థ ఏమీ లేదు. తక్కిన ప్రాంతీయ పార్టీలలాగానే అక్కడా అధినాయకుడి మాటే వేదం. అతనే కేంద్రబిందువు. ఎవరూ కిక్కురుమనడానికి లేదు. పొగడగలిగినంత కాలం పొగడడం, తేడా వస్తే బయటకు నడవడం. ఇలాటి పరిస్థితుల్లో టిడిపి మళ్లీ గెలుస్తుందని అనుకోవడంలో తప్పు లేదని నా భావన. ఎన్నికలు వచ్చేలోగా మార్పులు వస్తే రావచ్చు. వస్తే అప్పుడే మాట్లాడుకోవచ్చు. ఈ లోపున చర్చలు అనవసరమనుకుంటాను.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]