ఈ చర్చ యిప్పుడే చేయడం తొందరపాటు. ఇంకా రెండేళ్లు టైముంది. ఈ మధ్యలో ఏదైనా జరగవచ్చు. అయితే ''మంత్రిగా లోకేశ్'' అనే వ్యాసంలో నేను '2019 నాటికి టిడిపి మళ్లీ గెలిచి, లోకేశ్ ఏ ఉపముఖ్యమంత్రో కావచ్చు కాబట్టి అతను తన పాలనాపాటవాలను పెంచుకోవాలని ఆశిద్దాం' అని అనడంతో అలా ఎలా అంటారు అని నాపై చాలామంది విరుచుకు పడ్డారు. అంతే కాదు, లోకేశ్‌కి అంత సామర్థ్యం లేదు అని కూడా ఘాటుగా విమర్శించారు. ఆ విమర్శలకు జవాబుగానే యీ వ్యాసం రాస్తున్నాను. ఆ వ్యాసాన్ని మెచ్చినవారి కంటె మెచ్చనివారు ఎక్కువని అక్కడ అంకె చూపుతోంది. కానీ దానివలన నేను ప్రభావితం కావటం లేదు. నేననుకున్నది నేను రాశాను, దానిపై వాళ్లనుకున్నది వాళ్లు తెలియపరిచారు. నిజానికి చాలా విమర్శలకు మూడు, నాలుగు రోజుల పాటు నేను జవాబులిచ్చాను. అవి ఇంగ్లీషులో వున్నాయి. ఒకసారి వ్యాసం చదివాక కామెంట్ల కోసం, వాటిపై నా రెస్పాన్సు కోసం మళ్లీమళ్లీ ఎవరూ వెళ్లి చదవకపోవచ్చు. వ్యక్తిగతంగా కూడా చాలామంది మెయిల్స్ రాశారు. జవాబిచ్చాను. ఇంకా రాస్తున్నారు. నా ఉద్దేశాన్ని స్పష్టంగా రాయడానికి యిది సుదీర్ఘంగా రాస్తున్నాను. ఈ అంశంపై యిదే ముక్తాయింపు.
హైదరాబాదులో ఓటమికి లోకేశ్ బాధ్యుడా?
చాలామందికి లోకేశ్‌పై ఏ మాత్రం నమ్మకం వున్నట్లు కనబడటం లేదు. నేనూ అతను వీరుడు, శూరుడు అని రాయలేదు. కావాలనే అతను ప్రఖ్యాత యూనివర్శిటీల్లో చదివిన విషయాన్ని ప్రస్తావించలేదు. అతని మేధస్సు యిప్పటిదాకా ప్రకటితం కాలేదు. ఏదైనా జాతీయ మీడియా కాన్‌క్లేవ్‌లో అతను పాల్గొని వాదించి వుంటే కాస్త తెలిసేది. ఇప్పటిదాకా అతను బ్యాక్‌రూమ్ బాయ్‌గానే వున్నాడు. అందుకే అది నేర్చుకోవాలి, యిది నేర్చుకోవాలి అని సూచిస్తూ రాశాను. మనం సూచించాం కదాని అతను పాటించాలని ఏమీ లేదు. అతను మెరుగుపడ్డాడో లేదో కాలమే చెపుతుంది. ఈ లోపునే అతను పనికిరాడు అని తీర్మానించడం పొరపాటు. చంద్రబాబు కూడా ఎన్టీయార్‌కు బాక్‌రూమ్ బాయ్‌గానే వుండేవారు. తర్వాత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి వెళ్లారు. నేర్చుకుంటే ఏదీ అసాధ్యం కాదు. నేను 40 ఏళ్లు దాటాకనే వ్యాసాలు రాయడం మొదలుపెట్టాను. 50 ఏళ్లు దాటాక నా వాయిస్ రేడియోకు అనువుగా వుంటుందని తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా వినిపించే శాటిలైట్ రేడియోలో ఆర్‌జెగా పనిచేశాను. 55 ఏళ్లు దాటాక టీవీ తెరమీద కనబడి ఏడాది పైన ఓ కార్యక్రమాన్ని నిర్వహించాను. నాలో యిన్ని కళలున్నాయని నాకే తెలియదు. మోదీ ప్రధానిగా వెలుగుతాడని పదేళ్ల క్రితం ఎవరైనా అనుకున్నారా? అంతమాత్రాన ప్రతీవాడూ మోదీ అవుతాడని చెప్పలేం, కాలేడనీ చెప్పలేం. గబుక్కున 'యూస్‌లెస్ ఫెలో' అనేస్తాం కానీ అది తప్పు. వాడివలన ఎవడో ఒకడికి ప్రయోజనం వుండవచ్చు. వాడు పనికిమాలినవాడని, ఎప్పటికీ బాగుపడడని, ఎన్నేళ్లయినా ఏదీ నేర్చుకోకుండానే వెళ్లిపోతాడని తీర్మానించడానికి మనమెవరం? లోకేశ్ విషయంలో హైదరాబాదు మునిసిపల్ ఎన్నికలలో ఓటమిని అతని నెత్తిన కొందరు రుద్దారు. అతని స్థానంలో చంద్రబాబు వున్నా అదే ఫలితం వచ్చేది. తెలంగాణలో పార్టీని పూర్తిగా కరారావుడు చేసేసిన ఘనత చంద్రబాబుది. దానికి లోకేశ్‌ను తప్పుపట్టడం అనవసరం.
మాట్లాడే కళను అభ్యసించాలి
ఇక ఫలానా చోట అతని ఉపన్యాసం విన్నారా? అంటూ కొంతమంది అడిగారు. నేను ముందే చెప్పాను – అతను ఉపన్యాసకళ నేర్చుకోవాలని. నిజానికి ఆంధ్రలో యిప్పుడు నాకు మంచి వక్తలే కనబడటం లేదు. చంద్రబాబుకి క్లుప్తంగా, సూటిగా మాట్లాడడం రాదు. స్వోత్కర్ష, సోది, చెప్పినదే చెప్పి గంటల తరబడి మాట్లాడతారు. జగన్‌కి మాట్లాడేటప్పుడు మొహం ఎలా పెట్టుకోవాలో తెలియదు. ఉపన్యాసంలో పాయింట్లు వున్నా ఎప్పుడూ బాధతో, ఆవేదనతో మాట్లాడుతున్నట్లే వుంటుంది తప్ప వేరియేషన్స్ వుండవు. వైయస్ మంచి వక్త. వైసిపిలో రోజా మంచి వక్త, సబ్జక్ట్ వుంటుంది, అనర్గళంగా, ఎప్పుడే భావం పలికించాలో అది పలికిస్తూ, సమయస్ఫూర్తి చూపుతూ మాట్లాడతారు. ఇక ఉండవల్లి అయితే ఎదురే లేదు. అద్భుతమైన వక్త. కానీ ఆయన ఏ పార్టీలోనూ యాక్టివ్‌గా లేడు. ఇంకెవరున్నారు? పేర్లు తట్టడం లేదు. టీవీ చర్చల్లో బాగా వాదించే నాయకులున్నారు. వీళ్లంతా బహిరంగసభల్లో శ్రోతలను ఎలా ఆకట్టుకోగలరో కానీ నేను ఆ రాష్ట్రంలో నివసించను కాబట్టి, చెప్పలేను. అసెంబ్లీలో విందామంటే అంతా గోలగోల, ఎవర్నీ మాట్లాడనివ్వరు.
నిజానికి వక్తృత్వానికి చాలా ప్రాధాన్యత వుంది. సీజర్ దగ్గర్నుంచి విదేశాలు వెళ్లి 'రెటరిక్'లో తర్ఫీదు పొంది వచ్చేవారు. గతంలో ఎందరో నాయకులు అద్భుతంగా మాట్లాడేవారు. పోనుపోను క్వాలిటీ తగ్గిపోయింది. ప్రజల్ని మాటలతో కాక నోట్లతో ఆకట్టుకోవచ్చనే ధీమా పెరిగిపోయి, ఆ వైపు దృష్టి పెట్టడం మానేశారు. ఇప్పటికీ బాగా మాట్లాడేవారిలో ఆరెస్సెస్ నుంచి వచ్చిన వారు, కమ్యూనిస్టులు, ద్రవిడ పార్టీవారు కనబడతారు. వీళ్లందరికీ పుడుతూనే ఆ కళ అబ్బదు. తర్ఫీదు యిస్తారు. ఒక పాఠకుడు రాశారు – గొంతులో జీర వుంటే తప్ప లాభం లేదని. సాధన చేస్తే ఆ జీర అదే వస్తుంది. దాని ప్రాముఖ్యత గుర్తించాలి ముందుగా. ఎన్టీయార్ పార్టీ పెట్టిన కొత్తల్లో గండిపేట శిబిరంలో ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు రాజకీయ పరిజ్ఞానంపై, అసెంబ్లీ కార్యకలాపాలపై, మాట్లాడే తీరుపై అవగాహన కల్పించడానికి రాజకీయ తరగతులు నిర్వహింపచేశారు. చంద్రబాబే వాటిని పర్యవేక్షించేవారు. బాబు పార్టీ అధ్యక్షుడయ్యాక అవన్నీ అనవసరం అనుకున్నారు లాగుంది. ఇటీవల జరుగుతున్నట్లు లేవు. వాటి స్థానంలో యోగా క్లాసులు పెట్టిస్తున్నారు. మర్నాడు ఆ యోగా టీచరుకు ఎకరాలకు ఎకరాలు భూమి కేటాయిస్తున్నారు.
లోకేశ్‌ను బూస్ట్ చేసి తీరతారు
లోకేశ్ రూపం గురించి ప్రస్తావన అనవసరం అని కొందరు ఫీలైతే, మరికొందరు అతను మారలేడు అని తీర్మానించారు. ప్రజానాయకుడు – ముఖ్యంగా యువనేత – ట్రిమ్‌గా, స్మార్ట్‌గా వుంటే దాని సంగతే వేరు. జయలలిత బొద్దుగా వున్నా ఒకప్పుడు బ్రహ్మాండమైన ఓపికతో వుండేది. మొన్నటి ఎన్నికలలో నడవడానికి అవస్థ పడుతూ వుంటే విజయకాంత్ ఆమెను అనుకరించి వెక్కిరించాడు. మరి స్టాలిన్‌ను అలా వెక్కిరించగలిగాడా? జయలలిత కంటె స్టాలిన్ 5 ఏళ్లు మాత్రమే చిన్నవాడు. సుదీర్ఘ పాదయాత్ర చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపాడు. ప్రయత్నించినా లోకేశ్ తగ్గలేడు అనడం అన్యాయం. ఎందరో సినిమా యాక్టర్లు పాత్రల కోసం పెరుగుతున్నారు, తరుగుతున్నారు. చిత్తశుద్ధి వుండాలంతే!
లోకేశ్ ఏం నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా బాబు అతని యిమేజి పెంచడానికి ఎలాగూ బోల్డు కసరత్తు చేస్తారు. వైయస్ జగన్‌ను పెంచినట్లు కాకుండా తను తన కొడుకుని బ్రహ్మాండంగా పెంచానని ఎప్పుడో చెప్పుకున్నారు. 2009లో నగదు బదిలీ ఐడియా అతనిదే అని చెప్పారు. తను ప్రధాని కావాలా వద్దా అని అతన్నే అడిగి సలహా తీసుకున్నానని చెప్పారు. ఇప్పుడీ మంత్రి పదవి కట్టబెట్టాక, ఆ శాఖల్లో సమర్థులైన అధికారులను వేయడం, ఆ శాఖలు అదరగొట్టేస్తున్నాయని, మంత్రిగా లోకేశ్ అధికారులను తన ప్రశ్నలతో బెదరగొట్టేస్తున్నారని మీడియాలో ఎలాగూ వార్తలు రాయిస్తారు. ఇకపై ఐటీ కంపెనీలేవైనా ఆంధ్రలో పెట్టుబడులు పెడతాయని అంటాయని అంటే, వాటిని తన ఖాతాలో కాక కొడుకు ఖాతాలో వేస్తారు. ఇన్నాళ్లూ దానికి వేరే మంత్రి వున్నపుడు పరిస్థితి వేరు. ఇప్పుడు లోకేశ్ వచ్చారు కాబట్టి, ఆయన స్టాన్‌ఫోర్డ్‌లో విద్యార్థిగా వుండగానే అక్కడి బిగ్‌విగ్స్‌తో ఆంధ్రలో పెట్టుబడుల గురించి మంచీచెడ్డా మాట్లాడారని చెప్పేసుకోవచ్చు. మంత్రి కాక ముందు నుంచే ఆ ప్రయత్నాల్లో వున్నానని లోకేశ్ చెప్పుకున్నారు కూడా. 'చినబాబుగారా, అమ్మో తండ్రినే మించిపోయేట్లున్నారు' అనే భజనపరులు కూడా చేరతారు. మనం ఏమనుకున్నా సరే, 2019లో టిడిపి మళ్లీ గెలిస్తే ఆయన ప్రధాన పాత్రలో అవతరిస్తాడు అనేది గోడ మీద రాత అయినపుడు లోకేశ్ తన శక్తిసామర్థ్యాలను పెంచుకోవాలని ఆశించడంలో తప్పు లేదనే భావంతోనే వున్నాను. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]