త్వరలోనే మరో వీడియో.. అందుకే ఈ గ్యాప్?

గుంటూరుకారం సినిమా గ్యారెంటీగా సంక్రాంతికి వస్తుందని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. హనుమాన్ యూనిట్ అయితే తమను పదేపదే అడగొద్దని పక్కాగా వస్తామని మీడియాపై కాస్త అసహనం వ్యక్తం చేసిన సందర్భం కూడా ఉంది. ఇక…

గుంటూరుకారం సినిమా గ్యారెంటీగా సంక్రాంతికి వస్తుందని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. హనుమాన్ యూనిట్ అయితే తమను పదేపదే అడగొద్దని పక్కాగా వస్తామని మీడియాపై కాస్త అసహనం వ్యక్తం చేసిన సందర్భం కూడా ఉంది. ఇక తాజాగా ఈగల్ యూనిట్ కూడా సంక్రాంతికి రావడం గ్యారెంటీ అని ప్రకటించేసింది. ఎవరికైనా అనుమానాలుంటే, తమ ఆఫీస్ కు వస్తే, థియేటర్ అగ్రిమెంట్ల్ కూడా చూపిస్తామని బహిరంగంగా ప్రకటించింది.

ఇలా సంక్రాంతి బరిలో ఎవ్వరూ తగ్గేలే కనిపించడం లేదు. ఎవరికివారు రావడం పక్కా అంటూ సంకేతాలు పంపుతున్నారు. ఈ లిస్ట్ లో కాస్త సైలెంట్ గా ఉన్న సినిమా ఏదైనా ఉందంటే అది నాగార్జున సినిమా మాత్రమే. నా సామిరంగా.. సంక్రాంతికి వస్తాం అంటూ గతంలో ఘనంగా ప్రకటించి, ఆనక సైలెంట్ అయింది యూనిట్.

దీంతో నాగార్జున సినిమా సంక్రాంతికి రాదనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఇక్కడే నాగార్జున కాస్త విభిన్నంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందర్లా ప్రకటించి ఊరుకోకుండా.. తాము సంక్రాంతికే వస్తామంటూ సినిమా నుంచి వీడియో రిలీజ్ చేసి చెప్పే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి నాగార్జున ప్రారంభం నుంచి కాస్త విలక్షణంగానే ప్లాన్ చేస్తున్నారు. సినిమా ఎనౌన్స్ మెంట్ కే మాంచి వీడియో విడుదల చేసి మరీ ప్రకటించారు. ఆ తర్వాత గుంభనంగా షూటింగ్ స్టార్ట్ చేసి, పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతి విడుదల అంటూ మరో వీడియో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టున్నారు.

వచ్చే వారం 'నా సామిరంగ' షూటింగ్ మైసూర్ లో జరగబోతోంది. అక్కడ సినిమాకు సంబంధించి కొన్ని విలేజ్ షాట్స్ తీయబోతున్నారు. మనం, సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాల నుంచి నాగార్జునకు మైసూర్ సెంటిమెంట్ గా మారిన సంగతి తెలిసిందే.