తనపై జరిగిన దాడి గురించి భావన స్పందించింది. అది ఎవరో ఆకతాయిలు చేసిన పని కాదని ఆమె స్పష్టం చేసింది. తనతో అనుచితంగా ప్రవర్తించి, ఫొటో దిగిన వాళ్లు తనను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేసేందుకు కాదని భావన అభిప్రాయపడిందింది. దాని వెనుక కొంతమంది బిగ్ షాట్స్ ఉన్నారని ఆమె ఆరోపించింది. ఇది వరకూ కూడా భావన నుంచి ఈ వెర్షనే వినిపించింది. అయితే.. అప్పుడు ఆమె డైరెక్టు గా ఈ మాట చెప్పలేదు, కేవలం లీకేజీగానే ఆ మాట వినిపించింది. అయితే భావన ఈ సారి సూటిగా ఈ విషయాన్ని చెప్పింది.
తనపై జరిగిన వేధింపుల వెనుక కొంతమంది పెద్ద మనుషుల ప్రమేయం ఉందని ఆమె వ్యాఖ్యానించింది. మరి ఆ పెద్ద మనుషులు ఎవరు? అనే మాట గురించి మాత్రం ఆమె పెదవి విప్పలేదు. వారి ప్రేమయం లేనిది అంత పని జరగదు అని భావన ఆరోపించింది.
విశేషం ఏమిటంటే.. భావనపై దాడి ఎంత సంచలనంగా వార్తల్లోకి వచ్చిందో.. అంతే చప్పున చల్లారిపోయింది. దుండగులను గుర్తించారు, అదుపులోకి తీసుకున్నారు కానీ.. ఈ దాడి వెనుక అసలు కథేంటి? అనే విషయంపై పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఆ కేసుకు సంబంధించి ఎలాంటి డెవలప్ మెంట్ గురించి పోలీసులు ప్రకటన చేయలేకపోయారు.
దీన్ని బట్టి.. దీని వెనుక పెద్ద మనుషుల ప్రమేయం ఉండొచ్చు.. అనే అనుకోవాల్సి వస్తోంది. వారి ప్రమేయమే లేకపోతే…. ఈ కేసు ఇంత త్వరగా డైల్యూట్ కాదని అనుకోవాలి. భావనపై దాడి వెనుక ప్రముఖ మలయాళీ హీరో దిలీప్ పేరు ప్రముఖంగా వినిపించింది. దిలీప్ మాజీ భార్య మంజు వారియర్ కు మద్దతుగా నిలిచినందునే, ఆమెకు అనుకూలంగా గళం విప్పినందునే భావనపై దాడి చేయించారనే ఆరోపణ గట్టిగా వినిపించింది. అయితే భావన మాత్రం అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదు.. కొంతమంది సినీ పెద్దల ప్రమేయం ఉందని మాత్రం ఆమె వ్యాఖ్యానించింది. మరి లోగుట్టు ఏమిటో!