తమిళ హీరో మాధవన్‌కి తెలుగు సినిమాలపైనే పెద్దగా ఆసక్తి లేదు. చాలా సందర్భాల్లో ఆయన్ని తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన ఆఫర్లను తిరస్కరించిన మాట వాస్తవమే. కానీ, ఆయన తెలుగు రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నట్లున్నాడు. ఇదేం విచిత్రమో మరి. మరీ ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్ పట్ల అమితమైన అభిమానం కురిపించేశాడు మాధవన్. దాంతో, అంతా షాక్‌కి గురయ్యారు.
'అసలు మాధవన్ మతి వుండే ఇలా చేస్తున్నాడా..' అన్నది చాలామంది అనుమానం. నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు తన 'మంత్రివర్గాన్ని' విస్తరించిన విషయం విదితమే. ఆ మంత్రివర్గ విస్తరణపై మాధవన్ ట్విట్టర్ ద్వారా ప్రశంసలు గుప్పించేశాడంటూ అధికార తెలుగుదేశం పార్టీ తెగ మురిసిపోతోంది. ఏపీ సీఎం ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ మేరకు మాధవన్‌కి 'థ్యాంక్స్' కూడా చెప్పేయడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల, కొత్తగా మంత్రులు అయినవారి పట్ల, ఇప్పటికే మంత్రులుగా వున్నవారి పట్ల మాధవన్‌కి కనీస అవగాహన కూడా వుండి వుండకపోవచ్చు. సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో పట్టుకుని, చంద్రబాబుని 'సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్..' అంటూ అభినందించేస్తూ, ఆయనంటే ఇష్టమని మాధవన్ చెప్పడం వెనుక పెద్ద కథే వుండి వుండాలి.
అన్నట్టు, ఆ మధ్య బాలీవుడ్ నటుడు అజయ్‌దేవగన్‌ని చంద్రబాబు ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పెట్టుబడులన్నారు, ఇంకేవేవో అన్నారు.. చివరికి అంతా హంబక్ అయిపోయింది. మాధవన్ ఇప్పుడేమన్నా, ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి బిజినెస్ ప్రయత్నాలు చేస్తున్నాడో, లేదంటే మాధవన్‌ని తెలివిగా చంద్రబాబు అండ్ టీమ్ 'రంగంలోకి' దించుతుందో కొద్ది రోజులు ఆగితే తేలిపోతుంది కదా.!
కొసమెరుపు: అసలు రాజకీయాలంటే తెలుసా.? ఆంధ్రప్రదేశ్ గురించి ఏం తెలుసు.? చంద్రబాబు, లోకేష్ తదితరులపై అవినీతి ఆరోపణల గురించి తెలుసా.? మతి వుండే చంద్రబాబుని సమర్థిస్తున్నారా.? అంటూ ట్విట్టర్ జనాలు మాధవన్ మీద కామెంట్లు ఎడా పెడా పోస్ట్ చేసేస్తున్నారు. ప్చ్ పాపం మాధవన్ అడ్డంగా బుక్కయిపోయినట్లున్నాడు కదా.