ఓవైపు సుకుమార్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చిన రామ్ చరణ్ మైండ్ లో సేమ్ టైం మరో మూవీ కూడా కదలాడుతోంది. అదే చిరు 151వ సినిమా. ఖైదీ నంబర్ 150కు నిర్మాతగా వ్యవహరించిన చెర్రీ, ఈ సినిమాను కూడా తనే ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ఖైదీ నంబర్ 150 టైమ్ లో నెరవేరని ఓ కోరికను.. చిరు 151వ సినిమాతో నెరవేర్చుకోవాలని అనుకుంటున్నాడు.
ఖైదీ నంబర్ 150లో వెంకటేష్ తో స్పెషల్ ఎప్పీయరెన్స్ ప్లాన్ చేశాడు రామ్ చరణ్. కానీ కొన్ని కారణాల వల్ల అది వర్కవుట్ కాలేదు. ఈ విషయాన్ని వెంకీ కూడా ఆమధ్య ప్రస్తావించాడు. కుదిరితే చిరంజీవి 151వ సినిమాలో గెస్ట్ ఎప్పీయరెన్స్ ఇస్తానని కూడా ప్రకటించాడు. సరిగ్గా ఇదే అంశంపై వెంకీతో చెర్రీ మంతనాలు సాగించినట్టు తెలుస్తోంది.
సుకుమార్ సినిమా కోసం రాజమండ్రికి వెళ్లకముందే వెంకటేష్ తో ఈ మేటర్ పై చర్చించాడట రామ్ చరణ్. నిజానికి ఖైదీ నంబర్ 150లో ఓ సాంగ్ లో స్టెప్స్ మాత్రమే వేయాలనుకున్నాడు వెంకీ. కానీ చారిత్రక కథాంశంతో వస్తున్న 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో వెంకటేశ్ ఓ కీలకపాత్ర పోషించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెల్లోనే చిరంజీవి-సురేందర్ రెడ్డి సినిమా ప్రారంభమౌతుంది.