తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, 'యూ' టర్న్ తీసుకున్నాడు. రాజకీయాలపై ఓ ప్రకటన చేసేందుకోసమంటూ అభిమాన సంఘాలకు చెందిన ముఖ్యుల్ని (అధ్యక్షుడు, కార్యదర్శి, ఇతర ప్రముఖులు) చెన్నయ్‌కి రావాల్సిందిగా రజనీకాంత్ 'పిలుపు' పంపిన విషయం విదితమే. తమ అభిమాన హీరో పిలుపు ఇవ్వడమే చాలు, అక్కడ పెద్ద సంఖ్యలో వాలిపోకుండా వుంటారా.? అభిమానులు వచ్చేశారు.. కానీ, అక్కడ సీన్ సితారైపోయింది. ఇది నిన్నటి వ్యవహారం.
ఏప్రిల్ 2న రజనీకాంత్, రాజకీయాలపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడని లీకులు వచ్చింది ఆయన్నుంచి కాక, ఇంకెవరి నుంచో అని ఎలా అనుకోగలం.? ఆయనే పిలిచాడు, ఆయనే మీటింగ్ రద్దు చేశాడు. నిజానికి, అభిమానులతో ఏప్రిల్ 2న కలుస్తున్న మాట వాస్తవమనీ, అది రాజకీయ కోణంలో మాత్రం కాదని రజనీకాంత్ 'కలయిక'పై క్లారిటీ ఇచ్చిన విషయం విదితమే. కానీ, అభిమానులకు హ్యాండిచ్చేశాడు. ఇప్పుడేవో కొత్త తేదీలు ప్రకటించాడు. జస్ట్ ఫొటోసెషన్స్ కోసమట.
అభిమానులకి, తమ అభిమాన హీరో మీద అభిమానం ఎంత వుంటుందో, తేడా వస్తే.. అంతకన్నా దారుణంగా వ్యవహారాన్ని 'తేడా' చేసేయగల అసహనం కూడా అంతే వుంటుంది వారిలో. అయితే, ఈ విషయంలో మాత్రం రజనీకాంత్ అభిమానులు ఒకింత సంయమనం పాటిస్తుండడం విశేషమే మరి. వారు ఎదురుచూస్తున్నది రజనీకాంత్ రాజకీయాలపై ప్రకటన చేస్తాడని. ప్రతిసారీ ఇలాగే పిలవడం, తుస్సుమనిపించడమే చేస్తూ పోతే.. ముందు ముందు ఆయన సీరియస్‌గా పిలుపునిచ్చినా, పట్టించుకునేవారే వుండకపోవచ్చు.
ఇదిలా వుంటే, 'అత్యున్నత స్థాయిలో వచ్చిన ఒత్తిడి' నేపథ్యంలోనే, రజనీకాంత్ రాజకీయ ప్రకటనపై నిర్ణయం వెనక్కి తీసుకున్నారన్నది తమిళ రాజకీయాల్లో విన్పిస్తోన్న హాట్ గాసిప్. ఆ అత్యున్నత స్థాయి.. అంటే ప్రధాని నరేంద్రమోడీ అనుకోవాలేమో.!
కొసమెరుపు: మొన్నామధ్య కమల్ హాసన్ కూడా ఇదే తరహాలో హడావిడి చేసి, తుస్సుమనిపించేశాడు. ఏమయ్యింది ఈ తమిళ స్టార్ హీరోలకి.?