మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. రైతుల కష్టాల గురించి కన్నీళ్లు కారుస్తూ ఉంటే మొసలి కన్నీరులాగా కనిపిస్తుంది. వారి మేలుకోసం ఆయన ఆవేదన చెందుతోంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది.
కష్టాల పాలవుతున్న అన్నదాతకు సేద్యానికి అవసరమయ్యే విద్యుత్తు పూర్తి ఉచితంగా ఇవ్వడం ద్వారా మేలు చేయాలని వైఎస్ రాజశేఖర రెడ్డి సంకల్పించినప్పుడు.. దాన్ని ఈసడించి.. ఎన్నికల్లో పరాభవం పాలైన చరిత్ర చంద్రబాబుది. అలాంటి చంద్రబాబు ఇప్పుడు వ్యవసాయ మోటార్లకు మీటర్లు అనే మాట ప్రభుత్వం అనగానే.. మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఈ మీటర్లు, రైతుల మెడలో ఉరితాళ్లు అని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.
చంద్రబాబుకు రైతుల మీద అంతగా ప్రేమ పొగుతూ ఉంటే గనుక ఎంచక్కా.. తాను అధికారంలోకి రాగానే.. మీటర్లు మొత్తం తీసేయించేస్తాననే హామీ ఇవ్వవచ్చు కదా..! జగన్ రైతుల మెళ్లలో బిగించే ఉరితాళ్లను తాను తీసేస్తానని హామీ ఇవ్వవచ్చు కదా..! ఆ పని మాత్రం చేయరు..!!!
ఉచితంగా సరఫరా చేసే విద్యుత్తు విషయంలో ఒక సంస్కరణలు తీసుకురావడానికి, జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రయత్నం చేస్తుండగా.. ఆ సంస్కరణల ఫలితాలను భవిష్యత్తులో తాను అధికారంలోకి వచ్చినా కూడా యథావిధిగా అనుభవించాలనేదే చంద్రబాబు కోరిక. కాకపోతే.. ఇప్పుడు ఆ మిష మీద జగన్ ను భ్రష్టు పట్టించాలనేది ఆయన ప్రయత్నం!
ఇక్కడ చంద్రబాబు గమనించాల్సిన విషయం ఒకటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నపళంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేయడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఆ పద్ధతిని అమలు చేశారు. అలాంటి పద్ధతి వల్ల విద్యుత్తు వినియోగం ఎంతగా ఆదా అయిందో ఆయన స్పష్టంగా లెక్కలు చెప్పారు. పైగా శ్రీకాకుళం జిల్లాలో ఏమాత్రం రైతుల నుంచి నిరసనలు రాలేదు.
రైతుల్లో లేని నిరసనను పనిగట్టుకుని వారి మెదళ్లలోకి చొప్పించడానికి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తే అభాసుపాలవడం తప్ప ఆయనకు ఏం దక్కుతుంది. మీటర్ల వల్ల రైతులు కోల్పోయేది ఏమీ లేదు. ఆ విషయం శ్రీకాకుళం రైతులకు ఆల్రెడీ అర్థమైంది. కనుకనే అక్కడ నిరసనలు ఏమీ రాలేదు.
కానీ.. అదేదో బూచిని చూపించినట్లుగా రైతులను మీటర్ల పేరిట భయపెట్డడానికి చంద్రబాబు కోటరీ పనిచేస్తోంది. ఏదో ఒక రూపేణా ప్రభుత్వం మీద నిత్యం బురద చల్లుతూ ఉండాలనే ప్రయత్నాల్లో ఒకటిగానే ఇది కూడా కనిపిస్తోంది.