బాహుబలికి తెలుగు మీడియా లోకువే

తెలుగు సినిమా మీడియా అంటే అస్సలు పట్టని నిర్మాణ సంస్థ ఏదైనా టాలీవుడ్ లో వుంది అంటే అది కేవలం ఆర్కే మీడియా వర్క్స్ మాత్రమే. అది కూడా రాజమౌళితో తీసే సినిమాల విషయంలో…

తెలుగు సినిమా మీడియా అంటే అస్సలు పట్టని నిర్మాణ సంస్థ ఏదైనా టాలీవుడ్ లో వుంది అంటే అది కేవలం ఆర్కే మీడియా వర్క్స్ మాత్రమే. అది కూడా రాజమౌళితో తీసే సినిమాల విషయంలో మాత్రమే. 

టాలీవుడ్ మీడియా సర్కిళ్లలో ఓ జోక్ వినిపిస్తుంటూంది. ఏమిటి మీడియా అలా పరిగెడుతూంది అంటే, రాజమౌళి చెమట చుక్క విదిలించాడట, పట్టుకుని, వెబ్ సైట్లలో, చానెళ్లలో, పత్రికల్లో చూపించేందుకు…అని. నిజంగానే మన తెలుగు మీడియాకు బాహుబలి అన్నా, రాజమౌళి అన్నా విపరీతమైన ప్రేమ. ఎంత ప్రేమ అంటే మీడియా ఎవడి కోసం చేస్తుందిలే అన్న ధీమా, నిర్లక్ష్యం రాజమౌళి అండ్ కో లో అడుగు అడుగునా కనిపిస్తున్నా కూడా. 

నిన్నటికి నిన్న బాహుబలి ఫంక్షన్ కు మీడియాను వేదికకు ఫర్లాంగు దూరంలో వుంచారట. ఓ సీనియర్ రిపోర్టర్ ఫేస్ బుక్ లో వాపోయాడు. మరెందుకు అక్కడ వుండాలి. లేచి వచ్చేయచ్చు కదా? కానీ ఎవరు కడతారు పిల్లి మెడలో గంటలు. తెలుగు సినిమా మీడియా చిత్రంగా వుంటుంది. ఒక్కోసారి పది నిమషాలు లేటయితే బాయ్ కాట్ అంటుంది. ఒకరి విషయంలో గంట లేటయినా ఓకె అంటుంది. ఒక్కోసారి పిలవని పేరంటం అయినా సరే అంటుంది. ఒక్కోసారి పిలిచిన పేరంటం అయినా పట్టించుకోదు. అందుకే రాజమౌళి అండ్ కోకు తెలుగు మీడియా అంటే అంత నీరసభావం.

ఇక్కడ మీడియా జనాలు కోరి అడిగినా ఇంటర్వూలు ఇవ్వరు. కవరేజ్ కు పిలవరు. సుమతో ఇంటర్వూ చేయించి, వీళ్లకు పడేస్తే చాలు, పదే పదే చూపిస్తారు. ముక్క ముక్కలు చేసి రాసుకుంటారు. అదే బాలీవుడ్ కు మాత్రం అక్కడ నుంచి ఫ్లయిట్ టికెట్ లు పెట్టి మరీ రప్పించి ఇక్కడ వుంచి, ఇంటర్వూలు ఇచ్చి సాగనంపుతారు. బాహుబలి వన్ టైమ్ లో కూడా బాలీవుడ్ మీడియా ముందు రాజమౌళి టీమ్ ఏ విధంగా లయిజినింగ్ కు పాకులాట పడిందో కథలు వినిపిస్తుంటాయి.

ఇక్కడ కనీసం ఒకటో అరో మీట్ లు మాత్రం వుంటాయి. ఎందుకంటే బాహుబలి అంటే చాలు రాసేసుకుందాం. వేసేసుకుందాం అని ఇక్కడి మీడియా తహతహలాడుతుంటుంది. తమను పట్టించుకోని, తమకు గౌరవం ఇవ్వని బాహుబలి టీమ్ గురించి తామెందుకు పట్టించుకోవాలని ఒక్క మీడియా కూడా అనుకోదు. ఎందుకంటే మేనేజ్ మెంట్ లు వేరు. మీడియా జనాలు వేరు. సినిమా మీడియా జనాలు విడివిడిగా, వ్యక్తిగతంగా ఇలాగే వాపోతుంటారు. కానీ మళ్లీ మేనేజ్ మెంట్ లు చలో అనగానే పరుగెడుతుంటారు. ఈ వీక్ నెస్ రాజమౌళి అండ్ కో కూడా బాగా తెలుసు. అందుకే తెలుగు సినిమా మీడియా అంటే వాళ్లకు అంత అలుసు. 

నిన్నటికి నిన్న ఫంక్షన్ లో ఫర్లాంగు దూరంలో వుంచారని ఇవ్వాళ మీడియా జనాలు లోలోపల అసంతృప్తి చెందుతున్నాయి. కానీ ఆ జనాలకు తెలియాల్సిందేమిటంటే, బాహుబలి 2 విడుదల లోగా ఇలాంటివి జరుగుతూనే వుంటాయి. కానీ బాహుబలి విషయాలు మహా ప్రసాదం అని మీడియా వెదికి మరీ తీసుకుని కళ్లకు అద్దుకుంటూనే వుంటుంది. తెలుగు మీడియా కు సంబంధించి పబ్లిసిటీకి రూపాయి ఖర్చు చేసి ప్రకటనలు ఇవ్వాల్సిన పని లేదని ఇప్పటికే ఓవర్ సీస్ బయ్యర్ కు రాజమౌళి అండ్ కో నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఇక్కడ కూడా దగ్గర చేసి ఒక్క ప్రెస్ మీట్ మినహా మరేమీ హడావుడి అక్కర లేదని, బాలీవుఢ్ లో మాత్రం ప్రమోషన్ ఏక్టివిటీ విగరస్ గా చేయాలని రాజమౌళి అండ్ కో డిసైట్ అయిందట. 

రేపు ఎప్పుడయినా రాజమౌళి మీడియా ముందుకు వస్తే ఎవరయినా ఎందుకు ఇలా మీడియాను అంత దూరంలో కూర్చో పెట్టారు అని ఎవరయినా అడుగుతరా? అబ్బే.. ముందు సెల్ఫీలు తీసుకోవడానికి, ఫోటొలు తీసుకోవడానికి పోటీ పడతారు. అందుకే ఈ వ్యవహారం ఇలా సాగుతూనే వుంటుంది. కారణం మన మీడియా అలుసు అని కాదు. మన మీడియా బాహుబలి వెంటపడడం మానేయదని వాళ్లకు తెలుసు కనుక.