'రామసేతు' మళ్ళీ వివాదాల్లోకెక్కింది. శ్రీరాముడు, తన భార్య సీతను చెరబట్టిన రావణాసురుడ్ని అంతమొందించేందుకు లంకకు వెళుతూ, మధ్యలో సముద్రం దాటే క్రమంలో 'రామసేతు'ని నిర్మించాడని రామాయణం చెబుతోంది. రామాయణం కల్పిత కథ, మహాభారతం కూడా అంతే.. అనేవారు 'రామసేతు'ని అడమ్స్ బ్రిడ్జ్‌గా అభివర్ణిస్తుంటారు. అయితే మహాభారతం నిజం, శ్రీకృష్ణుడు నిజం.. అనడానికి సముద్రంలో కూరుకుపోయిన 'మధుర' ఆనవాళ్ళే నిదర్శనం. ఇక, రామాయణానికి రుజువు 'రామసేతు'. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలూ అనవసరం.
అయితే, మేధావులుంటారు కదా.. వాళ్ళకు ఇప్పుడున్న ఆధారాలు సరిపోవు. రాముడు, రామసేతుని నిర్మించి వుంటే, ఆయనకు ఏ యూనివర్సిటీ ఇంజనీరింగ్ పట్టా ఇచ్చిందని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఓ సందర్భంలో ప్రశ్నించారండోయ్. చరిత్రలోకి తొంగి చూస్తే, ఏ కట్టడానికీ ఇంజనీర్లు కన్పించరు.. కానీ, చారిత్రక కట్టడాలు నేటి ఇంజనీరింగ్‌కే సవాల్ విసురుతుంటాయి.
ఇక, రామసేతుని బద్దలుగొట్టి.. భారతదేశ పశ్చిమ, తూర్పు తీరాల మధ్య దూరం తగ్గించాలన్న ప్రయత్నం ఎప్పటినుంచో జరుగుతోంది. అయితే, రామసేతు మత విశ్వాసాలతో కూడుకున్నది. ఇదేదో వందల ఏళ్ళ క్రితం నిర్మించింది కాదనీ.. వేల ఏళ్ళ క్రితం నిర్మించిందని గతంలో 'నాసా' పరిశోధనల్లో వెల్లడయ్యింది. నాసా లెక్కలు గట్టిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, శ్రీరాముడు జీవించి వున్న కాలంగా చెప్పబడుతోన్న సమయంలోనే రామసేతు నిర్మితమయ్యిందనే వాదన ఒకటుంది.
అయినాగానీ, రామసేతు విషయంలో ఇంకా 'వాస్తవాలు' వెలుగు చూడాల్సిందేనేమో. ఇప్పుడు రాముడొచ్చి, న్యాయస్థానంలో 'నేనే ఆ వారధి కట్టాను..' అని చెప్పినా, ఆ సాక్ష్యానికి విలువ వుండదు.. మళ్ళీ ఆధారాలు కావాలి. శ్రీరాముడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఇంజనీరింగ్ పట్టా తీసుకొచ్చినా, మళ్ళీ లొల్లి షురూ అవుతుంది.
కొన్నేళ్ళ క్రితం భారతదేశాన్ని సునామీ వణికించింది. ఆ సమయంలో రామసేతు కారణంగానే భారీ నష్టం తగ్గిందన్నది నిపుణుల వాదన. అలాంటి రామసేతుని కూల్చేసి, దేశానికి కొత్త ముప్పుని సృష్టించుకోవడమెంతవరకు సబబు.? ఇదొక్కటే కాదు, రామసేతుకు సంబంధించి సమాధానాల్లేని ప్రశ్నలు.. నేటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి ఇంకా సవాల్ విసురుతూనే వున్నాయి. రామసేతు కోసం వినియోగించిన రాళ్ళు నీటిలో ఎందుకు తేలతాయి.? అన్న ప్రశ్నకి ఏవేవో సమాధానాలు మేధావులు చెబుతున్నారుగానీ.. అసలంటూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో నీళ్ళలో తేలే రాళ్ళతో బ్రిడ్జి నిర్మాణం ఎలా సాధ్యమయ్యింది.? అన్న ప్రశ్నకు మళ్ళీ సమాధానం దొరకదు.
ఇప్పుడు కేంద్రంలో అధికారంలో వున్నది బీజేపీ ప్రభుత్వం. గతంలో మన్మోహన్ హయాంలో రామసేతు విషయమై పెద్ద రచ్చ జరిగింది. అప్పట్లో ఇదే బీజేపీ, రామసేతు కూల్చివేతను వ్యతిరేకించింది. మరి, మోడీ సర్కార్.. రాములోరికి ఇంజనీరింగ్ పట్టా ఇస్తుందా.? రామసేతు కూల్చివేత ఆలోచనలకు శాశ్వతంగా సమాధి కడుతుంందా.? లేదంటే, నౌకల ఇంధన పొదుపు పేరుతో 'శ్రీరాముడి గుర్తు'ని లేకుండా చేస్తుందా.? వేచి చూడాల్సిందే.