'నా పేరు బండ్ల గణేష్.. పవన్‌కళ్యాణ్ నాకు దేవుడు..' అంటూ ఈ మధ్యనే 'కాటమరాయుడు' సినిమా ఫంక్షన్‌లో బండ్ల గణేష్ ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ మీద తన అభిమానాన్ని చాటేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! 'నేను నిప్పులాంటోడ్ని..' అని చెప్పుకుంటుంటాడాయన. అయితే, బండ్ల గణేష్‌పై చాలా ఆరోపణలున్నాయి. హీరో, నిర్మాత సచిన్ జోషిని నమ్మించి నిండా మోసేశాడనే వివాదం ఎప్పటినుంచో నడుస్తోంది. మొన్నీ మధ్యనే.. తనను సచిన్ జోషి, నయీం ద్వారా బెదిరించాలనుకున్నాడనీ, నయీంని పోలీసులు హతమార్చడంతో తాను బతికిపోయానని బండ్ల గణేష్ వ్యాఖ్యానించాడు ఓ ఇంటర్వ్యూలో.
చాలా సందర్భాల్లో సచిన్ జోషి వివాదంపై చాలా ఘాటుగా స్పందించాడు బండ్ల గణేష్. 'నేను అతన్ని మోసం చేయలేదు.. అతనే నన్ను మోసం చేశాడు.. స్నేహానికి అర్థం తెలియని వ్యక్తి.. నేనే లేకపోతే సచిన్ జోషి ఎక్కడుండేవాడో..' అంటూ గతంలోనే బండ్ల గణేష్, సచిన్ జోషికి తానే 'దిక్కు' అన్నట్లుగా మాట్లాడేశాడనుకోండి.. అది వేరే విషయం.
అయితే, బండ్ల గణేష్ నిర్మాతగా ఈ స్థాయికి రావడానికి సచిన్ జోషీనే కారణమన్నది సినీ వర్గాల్లో బలంగా విన్పించే వాదన. సచిన్ జోషికి సినిమాలంటే ప్యాషన్. తనను తాను హీరోగా చూసుకోవాలనీ, తెరపై స్టార్‌గా వెలిగిపోవాలనీ కలలు కన్నాడు. ఈ క్రమంలోనే, ఖర్చుకి వెనుకాడకుండా పలు సినిమాలు తీసేశాడు. బండ్ల గణేష్‌తో పరిచయం, వ్యాపార భాగస్వామ్యందాకా వెళ్ళింది. అంతకు ముందు వరకు సాధారణ కమెడియన్‌గా వున్న బండ్ల గణేష్ అనూహ్యంగా 'బడా ప్రొడ్యూసర్' అయిపోయాడు.!
'ఇదంతా నేను కష్టపడి సంపాదించినదే..' అంటాడు బండ్ల గణేష్. కాదు, 'నన్ను కొల్లగొట్టి బండ్ల గణేష్ ఎదిగాడు..' అంటాడు సచిన్ జోషి. తాజాగా తన కొత్త సినిమా 'వీడెవడు' ప్రమోషన్ కోసం వచ్చిన సచిన్ జోషి, 'బండ్ల గణేష్ అసలు మనిషే కాదు, తోడేలు.. నాకు మొత్తంగా 27 కోట్లు బాకీ పడ్డాడు.. కోర్టు ద్వారా అతన్నుంచి ఎలాగైనా అదంతా రాబడ్తా.. నమ్మించి నన్ను మోసం చేశాడు.. అరెస్టు చేయించాలనుకున్నాగానీ, అతని కుటుంబ సభ్యులు నా కాళ్ళా వేళ్ళా పడ్డంతో కాస్త ఆగాను..' అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు. మరి, సచిన్ జోషి ఆరోపణలపై పవన్ భక్తుడు బండ్ల గణేష్ ఏమంటాడో వేచి చూడాల్సిందే.