రాజకీయ నాయకులు నీతులు చెప్పడంలో, గొప్పలు చెప్పుకోవడంలో దిట్టలు. ఎన్ని పాడు పనులు చేస్తున్నా నీతినిజాయితీగా ఉన్నామంటారు. ఇందుకు సీనియర్లు, జూనియర్లనే తేడా లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయాల్లో తాను విలువలను పాటిస్తున్నానని, వాటికే కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇది ఉబుసుపోక కబుర్ల మాదిరిగా చెప్పలేదు. ఆగ్రహంగా చెప్పారు. ఆగ్రహం ఎందుకు? ఎవరి మీద? మీడియా మీద. ఈమధ్య కొన్ని పత్రికల్లో (ఆంగ్లం కూడా) పురంధేశ్వరి వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నారని వార్తలొచ్చాయి.
వైకాపా నాయకులు ఆమెతో టచ్‌లో ఉన్నారని ఆ వార్తల సారాంశం. కాని వార్తలు రాగానే ఈ నాయకురాలు స్పందించలేదు. కొద్దిగా సమయం తీసుకొని ఇప్పుడు స్పందించారు. ఏమని? తాను పార్టీ మారబోతున్నాననే ప్రచారం అబద్ధమని, వైకాపాలోకి వెళ్లే ఆలోచన లేదని చెప్పారు. పార్టీ మారబోతున్నట్లు వార్తలు రావడానికి, ఆమె స్పందించడానికి మధ్య సమయంలో (గ్యాప్‌లో) ఏం జరిగిందో తెలియదు. తన తండ్రి ఎన్టీ రామారావు, భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనకు రాజకీయాల్లో విలువలు నేర్పించారని, వాటిని తాను తు.చ.తప్పకుండా పాటిస్తానని చెప్పారు. ఆ విలువలేమిటో ఆమె వివరించలేదు.
భర్త వెంకటేశ్వరరావు విలువలు నేర్పించారంటే 'అవును కాబోలు' అనుకోవచ్చు. తండ్రి ఏం నేర్పించారు? ఆయన జీవించి వున్నప్పుడు ఈమె రాజకీయాల్లోకి రాలేదు కదా. తండ్రిని చూసి రాజకీయ విలువలంటే ఏమిటో పరోక్షంగా నేర్చుకున్నారేమో. రాజకీయ విలువలంటే పురంధేశ్వరి దృష్టిలో ఏమిటో…! రాజకీయ విలువలు ఉన్నవారు పదవుల కోసం పార్టీలు మారుతారా? భర్త రాజకీయ విలువలు నేర్పించాడంటున్నారు ఆయన ఎన్ని పార్టీలు మారారో తెలియదా? ఏ రాజకీయ పార్టీలోనూ ఆయనకు గుర్తింపు రాలేదో, ఇంకేదైనా కారణమో తెలియదుగాని ఇప్పుడాయన మౌనంగా ఉన్నారు. రాజకీయాలు నేపథ్యంగా కొన్ని పుస్తకాలు రాసి రచయితగా గుర్తింపు పొందారు.
ఇక పురంధేశ్వరి విషయానికొస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో ఆమె కాంగ్రెసు పార్టీలో చేరారు. చేరిన మరుక్షణం నుంచే ఆ పార్టీలో ఆమెకు అనూహ్యమైన గుర్తింపు లభించింది. ఇందుకు వైఎస్‌ఆర్ ఇమేజ్ కొంత కారణమైతే, ఎన్టీ రామారావు కూతురనే గౌరవం మరికొంత కారణమైంది. ఎన్టీఆర్ కాంగ్రెసుకు తీవ్ర ప్రత్యర్థే కావొచ్చు. కాని పురంధేశ్వరి రాజకీయరంగ ప్రవేశంపై ఆ ప్రభావం పడలేదు. 'ఎన్టీఆర్ కీ బేటీ' అంటూ కాంగ్రెసు నాయకులు ఆమెను ఆదరించారు.
మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. అందుకు తగ్గట్లే పురంధేశ్వరి కూడా మాటకారితనంతో, వక్తృత్వ సామర్థ్యంతో (ఆరేటరీ స్కిల్) పార్లమెంటులో, ప్రభుత్వంలో గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెసులో ఉన్నన్ని రోజులు అన్నీ అనుభవించిన ఈ నాయకురాలు రాష్ట్ర విభజనకు నిరసన పేరుతో కాంగ్రెసుకు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. ఏపీలో (ఉమ్మడి రాష్ట్రంలో) కాంగ్రెసుకు పుట్టగతులు ఉండవని ఆమెకు తెలుసు. బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఆ పార్టీలో చేరి పోటీ చేసి గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డారు. బీజేపీలో చేరడం వరకు బాగానే ఉన్నా ఆ తరువాతే ఆమె ఆశలు అడయాశలయ్యాయి.
'ఈ ఊరి కరణం ఆ ఊరికి షేక్సింది' అన్నట్లుగా కాంగ్రెసులో మంచి గుర్తింపు పొందిన పురంధేశ్వరి బీజేపీలో దానికి నోచుకోలేదు. గత ఎన్నికల్లోనే బీజేపీ ఆమెను దెబ్బ కొట్టింది. దగ్గుబాటికి, చంద్రబాబుకు పడదనే విషయం తెలిసిందే. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుకు పురంధేశ్వరిని దెబ్బతీసే అవకాశం వచ్చింది. కాంగ్రెసులో ఉన్నప్పుడు బాపట్ల, విశాఖపట్నం నుంచి విజయం సాధించిన ఎన్టీఆర్ కుమార్తెకు బీజేపీ కడప జిల్లాలోని రాజంపేట లోక్‌సభ స్థానం కేటాయించింది. దీంతోనే ఆమె రాజకీయ భవిష్యత్తు నిర్ణయమైపోయింది.
వైఎస్సార్‌సీపీకి బలమైన స్థానం రాజంపేట. ఆ ప్రాంతంతో సంబంధాలు లేని, అసలు పరిచయం లేని పురంధేశ్వరిని అక్కడ పోటీ చేయించడంతో సహజంగానే ఓడిపోయారు. గతంలో విజయం సాధించిన విశాఖపట్నం అడిగితే ఇవ్వలేదు. తన తండ్రికి ఆదరణ ఉన్న కృష్ణా జిల్లా నుంచి పోటీ చేస్తానన్నారు. చంద్రబాబు ఒప్పుకోలేదు. ఎన్నికల్లో ఓడిపోయినా మోదీని ప్రశంసిస్తూ, చంద్రబాబును విమర్శిస్తూ చాలాకాలం చురుగ్గానే ఉన్నా క్రమంగా డీలాపడిపోయారు.
పురంధేశ్వరి ఒక్కరే కాదు, అప్పట్లో ఆమెతో కాషాయం కండువాలు కప్పుకున్న కీలక కాంగ్రెసు నాయకులంతా మౌనంగా ఉన్నారు. పార్టీలో వీరికి గుర్తింపు లేదని, అసంతృప్తిగా ఉన్నారని చాలాకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాను బీజేపీలోనే కొనసాగుతానని, ఒకవేళ పార్టీ నుంచి వెళ్లిపోతే రాజకీయాలనుంచే తప్పుకుంటానని పురంధేశ్వరి చెప్పారు. 2019 ఎన్నికల్లో ఆమె ఏం చేస్తారన్నది చూడాలి.