ఏక్ నాథ్ షిండే పాత్ర‌కు శుభం కార్డు రెడీనా!

మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య‌న కొన‌సాగుతూ ఉన్నాయి. ఏ ముహూర్తాన చివ‌రి సారి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయో కానీ, అక్క‌డ అనేక మ‌లుపులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల‌య్యాకా..…

మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య‌న కొన‌సాగుతూ ఉన్నాయి. ఏ ముహూర్తాన చివ‌రి సారి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయో కానీ, అక్క‌డ అనేక మ‌లుపులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల‌య్యాకా.. ఇప్ప‌టి వ‌ర‌కూ అక్కడ ఇద్ద‌రు సీఎంలు మారారు. మూడో సీఎంగా కొంత‌కాలం కింద‌ట ప్ర‌మాణ స్వీకారం చేసిన శివ‌సేన చీలిక వ‌ర్గం నేత ఏక్ నాథ్ షిండేను అతి త్వ‌ర‌లో తొల‌గించ‌నున్నారు అనే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. 

మ‌రి ప్రజాస్వామ్యంలో అయితే సీఎంను ప్ర‌జ‌లు తొల‌గించాలి, లేక‌పోతే అత‌డి సొంత పార్టీ ఆయ‌న‌ను ఇంటికి పంపించాలి. కానీ, షిండేను తొల‌గించ‌బోయేది భార‌తీయ జ‌న‌తా పార్టీ అని స్ప‌ష్టం అవుతోంది. షిండే స్థానంలో అజిత్ ప‌వార్ ను సీఎంగా చేయ‌బోతున్నార‌నే ప్ర‌చారం ఊపందుకుంటోంది. ఇందుకు పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌బోద‌ని.. వ‌చ్చే నెల ప‌దో తేదీక‌ల్లా షిండే స్థానంలో ప‌వార్ సీఎం ఉంటారంటూ కాంగ్రెస్ నేత‌లు బాహాటంగా వ్యాక్యానిస్తున్నారు. 

బీజేపీ గేమ్ ప్లాన్ ను వారు ప్ర‌స్తావిస్తూ ఉన్నారు. అయితే ఆ ప్ర‌క‌ట‌న‌ల‌ను బీజేపీ ఖండిస్తోంది. సీఎంను మార్చ‌మ‌ని అంటోంది. అయితే బీజేపీతో జ‌ట్టు క‌ట్టిన ఎన్సీపీ చీలిక వ‌ర్గం మాత్రం అజిత్ ప‌వార్ సీఎం అవుతాడ‌ని వ్యాఖ్యానిస్తోంది! త‌ద్వారా సీఎం మార్పు ఊహాగానాలు ఊతం ల‌భిస్తూ ఉంది.

ఒక‌వేళ కాంగ్రెస్ పార్టీ గ‌నుక ఈ విష‌యంలో ముందుగానే బీజేపీని విమ‌ర్శించ‌డం మొద‌లుపెట్ట‌క‌పోతే… ఈ పాటికి షిండేను ఎప్పుడో ఇంటికి పంపేవారు. వాస్త‌వానికి ఎన్సీపీలో అజిత్ ప‌వార్ వ‌ర్గాన్ని బీజేపీ చేర‌దీయ‌డం వెనుక షిండేతో అవ‌స‌రం తీరిపోవ‌డ‌మే అనే అభిప్రాయాలు అప్పుడే వినిపించాయి. ఆ విష‌యం షిండేకు కూడా తెలుసనేది స‌ర్వ‌త్రా వినిపించే అభిప్రాయం. 

అజిత్ ప‌వార్ డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తుండ‌గా షిండే ఖిన్నుడై  చూస్తున్న ఫొటో అప్పట్లోనే వైర‌ల్ అయ్యింది. బీజేపీ త‌న‌ను సీఎం చేస్తుంద‌నే ఆనందంతో అక్క‌డ నుంచి భారీగా ఎమ్మెల్యేల‌ను చీల్చుకువ‌చ్చాడు షిండే. సీఎం అయితే అయ్యారు. అయితే ఇప్పుడు అదే బీజేపీ ఇంటికి వెళ్ల‌మంటే వెళ్లాల్సిందే! అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు షిండే వెంట ఎమ్మెల్యేలు వెళ్ల‌క‌పోవ‌చ్చ‌ని స్ప‌ష్టం అవుతోంది.

కేవ‌లం అధికారం కోసం ఠాక్రేను వీడి షిండేతో చేతులు క‌లిపిన ఎమ్మెల్యేల‌కు కావాల్సింది షిండే కాదు. కేవ‌లం అధికారం మాత్ర‌మే! ఎమ్మెల్యేల‌ను చీల్చి బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు కావ‌డంలో కీల‌క పాత్ర షిండేదే. ఠాక్రేను పార్టీ నుంచి బ‌హిష్క‌రించామ‌ని ప్ర‌క‌టించ‌డం అయినా, శివ‌సేన త‌మ‌దే అని ప్ర‌క‌టించుకోవ‌డం అయినా, ఇంకా ఉద్ద‌వ్ ఠాక్రేను ఎంత‌గా విమ‌ర్శించినా.. అప్పుడు షిండే కు అధికారం అండ ఉంది. మ‌రి ఉద్ధ‌వ్ ఠాక్రే నుంచినే ఎమ్మెల్యేల‌ను వేరు చేయ‌గ‌లిగిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఇప్పుడు షిండే ఒక లెక్క కాదు!

ఇందు మూలంగా బీజేపీ ఒక సందేశం అయితే గ‌ట్టిగా ఇస్తుంది. తాము అనుకుంటే ఏదైనా చేయ‌గ‌లం అనేది ఆ సందేశం. మిత్రుడు, శ‌త్రువు  అంటూ త‌మ‌కు తేడా లేద‌ని.. ఎవ‌రినైనా ఏదైనా చేయ‌గ‌ల‌మ‌ని క‌మ‌లం పార్టీ క్లారిటీ ఇస్తోంది. శివ‌సేన, భార‌తీయ జ‌న‌తా పార్టీలు ద‌శాబ్దాల మిత్రులు. భావ‌స్వారూప్యం ఉంద‌ని చెప్పుకున్న పార్టీలు. కేవ‌లం సీఎం సీటు అడిగార‌న్న కసితో క‌మ‌లం పార్టీ ఉద్ధ‌వ్ ఠాక్రే సార‌ధ్యంలోని శివ‌సేన‌ను నానా ర‌కాలుగా భ్ర‌ష్టు ప‌ట్టించింది. రేప‌టి రాజ‌కీయ చిత్రంలో శివ‌సేన పాత్ర ఎంత ఉంటుంద‌నేది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. అలా ఒక మిత్ర‌ప‌క్షాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించిన క‌మ‌లం పార్టీ, మ‌రో శ‌త్రు ప‌క్షాన్ని ఇప్పుడు కౌగిలించుకుంది.

ఆ కౌగిలి దృత‌రాష్ట్ర కౌగిలే కావొచ్చు! ఎన్సీపీని బీజేపీ విమ‌ర్శించినంత‌గా మ‌రో పార్టీ విమ‌ర్శించి ఉండ‌దు, ఎన్సీపీ అనే ప‌దాల‌కు న్యాచుర‌ల్లీ క‌ర‌ప్టెడ్ పార్టీ అంటూ నిర్వ‌చ‌నం ఇచ్చారు స్వ‌యంగా న‌రేంద్ర‌మోడీ. మరి ఇప్పుడు అదే ఎన్సీపీ.. ఇప్పుడు బీజేపీకి మిత్ర‌ప‌క్షం. అజిత్ ప‌వార్ పై స‌వాల‌క్ష ఆరోప‌ణ‌లు చేసిన క‌మ‌లం పార్టీ  ఆయ‌న‌ను డిప్యూటీ సీఎంగా చేసింది. వ‌చ్చే నెల‌లో ఆయ‌న‌ను సీఎంగా కూడా చేయ‌గ‌ల‌దు. 

షిండే అనే పాత్ర‌ధారిని వ‌దిలించుకోవ‌డానికి అజిత్ ప‌వార్ ను చేర‌దీయడం, ఆయ‌న‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేల‌ను ద‌రి చేర్చుకోవ‌డం.. స‌హ‌జ‌మైన అవినీతి పార్టీ అంటూ విమ‌ర్శించిన పార్టీకి ఇప్పుడు తామే అధికారంలో వాటా ఇవ్వ‌డం క‌మ‌లం పార్టీ లీల‌లు! వేరే ఎవ‌రైనా ఇలా చేసి ఉంటే.. భ‌క్త‌గ‌ణం విరుచుకుప‌డే వారు. అయితే బీజేపీతో జ‌త క‌డితే ఎంత‌టి అవినీతి పార్టీ అయినా.. నీతిమ‌యం అయిపోతుంది. ప‌దేళ్ల నుంచి ఇలాంటివే జ‌నాలు చూస్తూ ఉన్నారు. క‌మ‌లం పార్టీ అనుస‌రిస్తున్న ఈ విధానాలు ఇప్పుడు ప‌రాకాష్ట‌కు చేరాయంతే!