ఒక హీరో, ఒక విలన్. పాటల కోసం ఓ హీరోయిన్. లవ్‌ట్రాక్, కొంచెం కామెడీ. కొంచెం మెసేజ్ కూడా, మూడు భారీ ఫైటింగ్‌లు. ఇవన్నీ కలిపితే కమర్షియల్ సినిమా. అభిమానుల విజిల్స్, కలెక్షన్లు. ఇంతకు మించి ఏం కావాలి?
రోజులు మారాయి. వరుసగా రాధేశ్యామ్, ఆచార్యని తిప్పికొట్టారు. ఇంకా ఏదో కావాలి. విలన్ ఇంట్లోకి దూరి అందర్నీ తన్నడం, హీరోని విలన్ “ఎవడ్రా నువ్వు, నీకేం కావాలి? అన్నాడంటే అది ఫార్ములా” కథ అని అర్థం. మరి హీరోలకి కొత్తగా కథలు ఎక్కడి నుంచి తెచ్చేది? తెచ్చినా వాళ్లకి నచ్చుతాయా? ఆ ఇమేజ్ నుంచి బయటికొస్తారా? వచ్చినా జనం చూస్తారా? అవన్నీ తర్వాత, ముందు కథ అనే బ్రహ్మపదార్థం డైరెక్టర్లకి అర్థం కావాలి కదా.
సామాన్యుడు అప్పు చేస్తే ఆస్తిని వేలం వేసి వసూలు చేసే బ్యాంకులు, పెద్ద వాళ్లు వేల కోట్లు ఎగ్గొట్టినా ఎందుకు చర్య తీసుకోవు? సర్కార్‌వారి పాట సినిమాలోని ఈ పాయింట్ కొత్తది. అయితే పాయింట్ ఒకటే సరిపోతుందా? 2 గంటల 40 నిమిషాలు. మధ్యలో కాసింత బ్రేక్ ఇచ్చి ప్రేక్షకున్ని కూర్చో పెట్టాలంటే ఎంత విషయం వుండాలి? మరి అది వుందా? కాసేపు బోర్ కొడితేనే ఫోన్ తీసి మెసేజ్‌లు చూసుకునే వాళ్లు. నువ్వు ఇచ్చే మెసేజ్ కోసం అంతసేపు కూచుంటారా?
విలన్ మాఫియా డాన్. లేదంటే విలేజ్‌లో వున్న ఒక దుర్మార్గుడు అనుకుంటే వాడి ఆట కట్టించడానికి హీరో ఓ పాతిక మందిని తన్ని హీరోయిజం చూపిస్తే ok. అంతకంటే దారి లేదు. హీరోని ఆ రకంగా చూడడానికి అలవాటు పడ్డాం. కానీ బ్యాంకులు, మోసాలు, రికవరీలు అనే సబ్జెక్టు తీసుకున్నప్పుడు హీరోకి కండబలంతో పాటు బుద్ధిబలం కూడా వుండాలి. అదేం లేదు. మహేశ్ డైలాగ్‌లు కామెడీ టైమింగ్‌తో బయటపడి పోదామనుకుంటే పాటలో పల్లవి పాడి చరణం మరిచినట్టు వుంటుంది. లేదు వేలం పాట అనుకుంటే ఒకటోసారి అని మాత్రమే అన్నట్టు వుంటుంది. మూడోసారి అంటే కదా పాట పూర్తయేది.
సినిమా అంటే అందమైన అబద్ధం, లాజిక్‌లు వెతక్కూడదని అందరికీ తెలుసు. సినిమాటిక్ లిబర్టీకి కూడా ఒక హద్దు వుంటుంది కదా? బ్యాంక్ సిబ్బందిని దూషిస్తే చట్ట ప్రకారం నేరం, బ్యాంక్‌కి తాళం వేస్తే బెయిల్ కూడా రాదు. అంత రియాల్టీ వద్దనుకుంటే వడ్డీ వ్యాపారం చేసుకునే హీరోలో అంత మార్పు వచ్చి ఒక Social cause కోసం పోరాడ్డానికి Driving point ఏంటి?
శంకర్ “భారతీయుడు, ఒకే ఒక్కడు” కూడా లాజిక్‌కి కొంచెం దూరంగానే వుంటాయి. అయితే కథనం కన్విన్సింగ్‌గా వుంటుంది. కారణం ఏమంటే కథ మీద లోతైన అధ్యయనం.
మన డైరెక్టర్లు చాలా మంది భూమ్మీద నడవడం మానేశారు. దూర ప్రాంతాలకైతే విమానం, దగ్గరికైతే కారు. చుట్టూ భజన బృందాలు నేలమీద తిరిగే మనుషులు వాళ్లకి అర్థం కారు. అందుకే మానవతీత పాత్రలు లేదా తెలివి తక్కువ పాత్రలతో నింపేస్తారు.
జనం సంగతి దేవుడెరుగు, హీరోలకి నచ్చితే చాలు అనుకుంటున్నారు. వరుసగా రొటీన్ సినిమాలే వస్తూ వుంటే కొంత కాలానికి హీరోలే నచ్చడం మానేస్తారు.
సింగిల్ లేయర్ కథలు జనానికి ఎక్కించడం కష్టం. దూకుడు హిట్ అయ్యిందంటే కథలో అనేక లేయర్లు, పాత్రలుంటాయి. వాళ్లంతా రిజిస్టరై జనం తెగ నవ్వుకున్నారు. ఒక లైన్ అనుకుని దాని చుట్టూ పాప్‌కార్న్ సీన్స్ రాసుకుంటూ మునిగిపోతారు. ఇటలీలో తీసినా, అమెరికాలో తీసినా చూసేది అనకాపల్లి వాళ్లు, నచ్చాల్సింది వరంగల్‌లో. అంటే మొత్తంగా తెలుగు వాళ్లకి కనెక్ట్ కాకుండా ఏం చేసినా వేస్టే.
సర్కార్ వారి పాట మొత్తం మహేశ్ భుజాల మీద నడిచింది. ఫస్టాఫ్ స్క్రీన్ ప్రెజెన్స్ కామెడీ నవ్వులు కురిపించింది. సెకెండాఫ్ బ్యాంక్‌లో , సముద్రఖని దగ్గర ఇరుక్కుపోయింది. నటించేందుకు ఎక్కడా అవకాశం లేకుండా కీర్తి సురేష్ వుంది.
ఫ్లయ్ వోవర్ మీద వెళ్లాల్సిన బండి, కింద అనవసరంగా రైల్వేగేటు దగ్గర ఆగినట్టు అనిపిస్తే తప్పు మనది కాదు.
ప్రేక్షకులు మారుతున్నారు. మారాల్సింది హీరోలు, డైరెక్టర్లే!
జీఆర్ మహర్షి