1980 నాటికి వ్యక్తిత్వ వికాసం అనే పేరే తెలియదు. మానసిక సమస్యలకు సమాధానాలు అడిగే వాళ్లూ లేరు. ఇచ్చేవాళ్లు లేరు. సైకాలజీలో చాలా విషయాలుంటాయని, మన ప్రవర్తన వెనుక వింత కారణాలుంటాయని కూడా తెలియదు. సరిగ్గా అపుడు “రేపు” అనే మాస పత్రిక వచ్చింది. వెల 2 రూపాయలు. వీక్లీలు రూపాయి అమ్మే రోజుల్లో ఇది చాలా ఖరీదు.
అనంతపురం లైబ్రరీలో మొదటిసారి చదివాను. చాలా ఆశ్చర్యం అనిపించింది. రాజకీయాలు, సినిమా ఏమీ లేకుండా కేవలం ప్రవర్తనకి సంబంధించి మాత్రమే పత్రిక వుండడం అదే మొదలు. తరువాత ప్రతినెలా తప్పనిసరిగా చదివేవాన్ని.
రేపు తరువాత ఇంకో పత్రికని నరసింహారావు ప్రారంభించాలని అనుకున్నారు. అప్పుడే ఆయనకి రేపు నరసింహారావు అని పేరు. యాడ్స్ లేకుండా ఎడిటర్ పబ్లిషర్‌గా పత్రికని తీసుకొచ్చిన ప్రత్యేకత ఆయనది.
అయితే వివిధ కారణాల వల్ల రేపు ఆగిపోయింది. కొత్త పత్రిక కూడా రాలేదు. తరువాత స్వాతికి పోటీగా వీక్లీ తీసుకొచ్చారు. ఆఫీస్ ఎసి.గార్డ్స్‌లో వుండేది. ఒకసారి వెళ్లి కలిస్తే పత్రిక నడపడమంటే కోరి కష్టాలు తెచ్చుకోవడమేనని నిరాశగా చెప్పారు. తరువాత వీక్లీ కూడా మూతపడింది. వ్యక్తిత్వ వికాసంపై చాలా పుస్తకాలు రాసారు.
ఈ రోజు సైకాలజి, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గురించి అందరికీ తెలుసు. ఎన్నో పుస్తకాలున్నాయి. ఎవరికీ తెలియని రోజుల్లో తెలుగు వారికి ఈ సబ్జెక్టులు తెలియజేసింది నరసింహారావే. ఆయన గుండె పోటుతో మే 10వ తేదీ అర్ధరాత్రి చనిపోయారు. ఆత్మకి శాంతి కలగాలి.
జీఆర్ మహర్షి