జల్లికట్టు స్ఫూర్తితో మరో ఉద్యమం…!

జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో మరో ఉద్యమమా? ఎక్కడ? జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలని భారీఎత్తున ఉద్యమం జరిగిన తమిళనాడులోనే. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన మెరీనా తీరం ఆందోళన మొదట్లో ప్రశాంతంగా జరిగి ప్రశంసలందుకున్నా చివర్లో హింసాత్మకంగా…

జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో మరో ఉద్యమమా? ఎక్కడ? జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలని భారీఎత్తున ఉద్యమం జరిగిన తమిళనాడులోనే. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన మెరీనా తీరం ఆందోళన మొదట్లో ప్రశాంతంగా జరిగి ప్రశంసలందుకున్నా చివర్లో హింసాత్మకంగా మారడంతో వచ్చిన మంచి పేరు తుడిచిపెట్టుకుపోయింది. మళ్లీ ఉద్యమమంటున్నారు. అలాంటిదేమైనా జరుగుతుందా? ఏం భయపడనక్కర్లేదు. ఇదీ ఒక విధమైన ఉద్యమమేగాని మెరీనా తీరంలో లక్షలాదిమంది బైఠాయించే కార్యక్రమం కాదు. గొడవ చేసేది కాదు. సంప్రదాయ క్రీడను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో జల్లకట్టు ఉద్యమం జరిగింది. జరగబోయేది కూడా సంప్రదాయ పరిరక్షణకే. జల్లకట్టుపై నిషేధం ఎత్తేయడం కోసం ఉద్యమించగా, జరగబోయే ఉద్యమం 'నిషేధం' కోసం ఉద్దేశించింది.

ఇంతకూ ఏమిటిది? తమిళనాడులో విదేశీ శీతల పానీయాలైన కోకకోలా, పెప్సీలను నిషేధించాలని వ్యాపారులు నిర్ణయించారు. మార్చి ఒకటో తేదీ నుంచి ఓ ఉద్యమంలా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. విదేశీ శీతల పానీయాల స్థానంలో రాష్ట్రంలో తయారయ్యే సంప్రదాయ పానీయాలైన కలీ మార్క్‌, బొవొంటో, టొరినొ మొదలైన పానీయాలు పెద్దఎత్తున విక్రయించాలని వ్యాపారులు నిర్ణయించారు. కోలా, పెప్సీకి ప్రత్యామ్నాయంగా దేశీయ పానీయాలకు భారీ ప్రచారం కల్పిచబోతున్నారు. 'జల్లికట్టు ఉద్యమం తరువాత రాష్ట్రంలో యువత విదేశీ శీతల పానీయాలకు ప్రతికూలంగా ఉన్నారు' అని వ్యాపార సంఘాల నాయకులు చెబుతున్నారు.

జల్లికట్టు ఉద్యమానికి, విదేశీ శీతల పానీయాలకు ప్రతికూలత వ్యక్తం కావడానికి సంబంధం ఏమిటో వ్యాపార సంఘాలవారు స్పష్టంగా చెప్పలేకపోతున్నా సంప్రదాయ పానీయాలను పరిరక్షించి , తద్వారా ఉపాధిని పెంచాలన్న ఆకాంక్ష, సెంటిమెంటు కనబడుతోంది. మార్చి ఒకటో తేదీ నుంచి దేశీయ పానీయాలు మాత్రమే విక్రయిస్తామని, విదేశీ పానీయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో పెద్దఎత్తున ప్రచారం చేస్తామని వ్యాపార సంఘాల నాయకులు చెబుతున్నారు. జల్లికట్టు ఉద్యమంలో రాష్ట్రంలోని యువత అంతా కలిసికట్టుగా ఉన్నట్లుగా కోక్‌, పెప్సీ నిషేధించాలనే విషయంలోనూ అన్ని వ్యాపార సంఘాలు ఒక్కటయ్యాయి. ఒకే మాట మీద ఉన్నాయి.

వ్యాపారుల నిర్ణయంతో ఇండియన్‌ బేవరేజెస్‌ అసోసియేషన్‌ (ఐబిఎ) తీవ్రంగా ఆందోళన చెందుతోంది. 'వ్యాపారుల నిర్ణయం మమ్మల్ని తీవ్రంగా కుంగదీస్తోంది' అని ఐబిఎ సెక్రటరీ జనరల్‌ అరవింద్‌ వర్మ చెప్పారు. కోకకోలా ఇండియా, పెప్సికో ఇండియా భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈ రెండు పరిశ్రమల మీద దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, రైతులు, చిరు వ్యాపారులు ఆధారపడి ఉన్నారని, వ్యాపార సంఘాల నిర్ణయంతో వారంతా ఇబ్బందుల్లో పడతారని చెప్పారు.

కోయంబత్తూరులోని కొన్ని హోటళ్లలో ఆల్రెడీ విదేశీ శీతల పానీయాలను నిషేధించినట్లు తెలుస్తోంది. కోలా కంపెనీల ప్రకటనల మాయాజాలం కారణంగా తమిళులు సంప్రదాయబద్ధంగా సేవించే కాఫీ, టీ కూడా వదులుకునే పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు అంటున్నారు. తమిళనాడులో వ్యాపారుల నిర్ణయం గట్టిగా అమలు జరిగితే కోలా కంపెనీలు భారీ నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుందేమో. విదేశీ శీతల పానీయాలు తాగాలా? స్వదేశీ డ్రింక్స్‌ తాగాలా? అనేది ఎవరికి వారు నిర్ణయించుకునే అంశం. వ్యాపార సంఘాలవారు, వారి మద్దతుదారులు చేసే ప్రచారానికి ఆకర్షితులైనవారు తీసుకునే నిర్ణయంపై కోలాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.