ఎక్కువ కాలం జీవించాలంటే ఏం తినాలి? ఇదొక బ్రహ్మపదార్థం. దీనికి సరైన సమాధానం కూడా లేదు. ఈ ప్రశ్నను క్యాష్ చేసుకునేందుకు “మా ఉత్పత్తులు తినండి” అంటూ ఫేక్ ప్రచారం కూడా సోషల్ మీడియాలో చూస్తుంటాం. అమెరికాలో కొంతమంది న్యూట్రిషనిస్టులకు కూడా ఈ అనుమానం ఉంది. అందుకే వాళ్లు దీనిపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నారు.
అమెరికాకు చెందిన డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ దీనిపై అధ్యయనం చేసింది. పలు సంస్థల సహకారంతో.. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది ప్రజలపై సర్వే చేసింది. ఈ అధ్యయనంలో వీళ్లంతా కలిసి నిర్థారించింది ఏంటంటే.. రోజూ 2 రకాల పండ్లు, 3 రకాల కూరగాయలు తింటే ఎక్కువ కాలం జీవించొచ్చు.
రోజువారీ ఆహారంలో సీజన్ కు తగ్గట్టు 2 రకాల పండ్లు, 3 రకాల కూరగాయలకు చోటిస్తే.. ప్రమాదకరమైన రోగాలు, గుండె సమస్యలు, కాన్సర్ లాంటివి రావని వీళ్లు ప్రాధమికంగా నిర్థారించారు. ఉత్తర, దక్షిణ అమెరికాలతో పాటు యూరోప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలోని వివిధ వయసుల వ్యక్తుల ఆహారపు అలవాట్లను అధ్యయనం చేసి వీళ్లు ఈ విషయాన్ని నిర్థారించారు.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కు చెందిన జర్నల్ లో ఈ విషయాల్ని వెల్లడించారు. అయితే ప్రపంచంలో ప్రతి 10 మందిలో కేవలం ఒకరు మాత్రమే ఇలా రోజుకు 2 పండ్లు, 3 రకాల కూరగాయల్ని తింటున్నారని అధ్యయనంలో వెల్లడైంది.
ప్రపంచంలో మనుషులు భౌగోళిక, వాతావరణ పరిస్థితుల కంటే.. తాము తినే తిండి వల్లనే చేజేతులా ఎక్కువగా అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారనే విషయాన్ని ఈ అధ్యయనం పరోక్షంగా వెల్లడించింది.