శశికళ అస్త్ర సన్యాసంలో అమిత్ షా పాత్ర ఎంత..?

భారతదేశ రాజకీయాల్లో అపర చాణక్యుడు అమిత్ షా. ఒకటా రెండా దీనికి వందలాది ఉదాహరణలున్నాయి. కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడమే కాదు.. ఒక్కొక్క రాష్ట్రాన్నే ఒడిసిపడుతూ తన మైండ్ పవర్ చూపిస్తున్నారు షా.…

భారతదేశ రాజకీయాల్లో అపర చాణక్యుడు అమిత్ షా. ఒకటా రెండా దీనికి వందలాది ఉదాహరణలున్నాయి. కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడమే కాదు.. ఒక్కొక్క రాష్ట్రాన్నే ఒడిసిపడుతూ తన మైండ్ పవర్ చూపిస్తున్నారు షా. తాజాగా తమిళనాట రాజకీయాల్లో జరిగిన నాటకీయ పరిణామాలు ఆయన చాణక్యాన్ని మరోసారి బయటపెట్టాయి. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ శశికళ చేసిన ప్రకటన వెనక కూడా అమిత్ షా చాతుర్యం ఉంది.

నిన్నమొన్నటి వరకూ బీజేపీ గుర్తుపై శశికళ వర్గాన్ని పోటీ చేయించాలని చూశారు అమిత్ షా. అయితే ఆ ప్రతిపాదనకు ఆమె ససేమిరా అనడంతో ఏకంగా శశికళ తోటే రాజకీయ సన్యాసం చేయించారు. “తమిళనాట జయలలిత బంగారు పాలన కొనసాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా, అమ్మ అభిమానులంతా సహోదరుల్లా ఐకమత్యంగా పనిచేయాలి, ఇకపై నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, నా సోదరి, నా దైవం పురచ్చితలైవి బంగారుపాలన కోసం ఆ దేవుడ్ని ప్రార్థిస్తా” అంటూ ఓ లేఖ విడుదల చేశారు శశికళ.

గతంలో డీఎంకే, వర్సెస్ అన్నాడీఎంకే.. ఇలా జరుగుతుండేవి తమిళనాడు రాజకీయాలు. జయలలిత, కరుణానిధి హయాం మొదలైన తర్వాత ఈ దఫా వారిద్దరూ లేకుండా తొలి ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

కాంగ్రెస్, డీఎంకేకి మద్దతిస్తోంది. అన్నాడీఎంకే బీజేపీ చేతిలో పావుగా మారింది. శశికళను జైలుకి పంపించడంలో బీజేపీ పాత్ర ఎంతుందో.. ఆమె బయటకు రావడంలో కూడా ఆ పార్టీ ప్లానింగ్ ఉందనే ప్రచారం జరుగుతోంది. శశికళను బయటకు తేవడం వల్ల అన్నాడీఎంకే బలం పెరుగుతుందని, డీఎంకేని ఓడించడంలో ఆమె సహాయపడుతుందనేది బీజేపీ ఆలోచన.

అయితే శశికళ వచ్చీ రావడంతోనే అన్నాడీఎంకే నాయకుల్ని టార్గెట్ చేయడంతో వ్యవహారం రివర్స్ అయింది. వారి మధ్య సయోధ్య కుదర్చిన అమిత్ షా.. మరో బ్రహ్మాండమైన ఎత్తుగడ వేశారు. శశికళ రాజకీయాల్లో ఉంటే ఆమెను అభిమానించే వర్గం కచ్చితంగా అన్నాడీఎంకేని వ్యతిరేకిస్తుంది, అది పరోక్షంగా డీఎంకేకి లాభం. శశికళను రాజకీయాలకు దూరం చేసి, ఆమెచేతే కార్యకర్తలంతా కలిసుండాలనే ప్రకటన చేయిస్తే.. అప్పుడు తిరుగుండదు. సరిగ్గా అదే ప్లాన్ అమలు చేశారు షా.

అన్నాడీఎంకే కార్యకర్తల్ని ఏకం చేసేందుకు, రెండు గ్రూపుల్ని ఒక్కటి చేసేందుకు శశికళకు రాజకీయ సన్యాసం ఇప్పించారు. రేపు అన్నాడీఎంకే కూటమి అధికారంలోకి వస్తే శశికళ సన్యాసం తీసేయడానికి ఎంతో సమయం పట్టదనే విషయం అందరికీ తెలిసిందే. అప్పటివరకు ఈ డ్రామా రక్తికట్టించాల్సిన బాధ్యత జయ నెచ్చెలిపై ఉంది. మొత్తమ్మీద తమిళనాడుపై ఉడుం పట్టు కోసం ఓ రేంజ్ లో ప్రణాళికలు వేస్తోంది బీజేపీ. 

తానకు వెట‌క‌రం ఎక్కువగా ఉంటుంది

6 పాటలు, 6 ఫైట్ల సినిమా కాదు