ఏపీ స్థానిక ఎన్నికల అంశంలో తన విశేష అధికారాలను విరివిగా వాడుకున్న ఆ రాష్ట్ర ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఆఖర్లో వరస ఝలక్ లు తప్పలేదు. ఎన్నికల నిర్వహణ విషయంలో తన విశేష అధికారాలను వాడుకున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.
కారణాలు ఏవైనా నిమ్మగడ్డ అనుకున్నప్పుడు స్థానిక ఎన్నికలు వాయిదా పడటాన్ని, తర్వాత ఆయన అనుకున్నప్పుడు ఎన్నికలను నిర్వహించడానికి ఏపీ లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఆ అంశం కోర్టులకు చేరి నానా రభస జరిగింది. కోర్టుల్లో కూడా ఒక్కోసారి నిమ్మగడ్డ ఆదేశాలు రద్దు అయ్యాయి. ఆ తర్వాత అవే మళ్లీ ఆచరణలోకి వచ్చాయి. ఎట్టకేలకూ నిమ్మగడ్డ కోరుకున్నట్టుగానే ఎన్నికలు జరిగాయి, జరుగుతున్నాయి.
ఇక పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ముందుగా ఏకగ్రీవాలన్నింటినీ ఆపి నిమ్మగడ్డ సంచలన నిర్ణయమే తీసుకున్నారు. అయితే.. కలెక్టర్ల నివేదికల అనంతరం వాటి పై సానుకూలంగా స్పందించక తప్పలేదు. అలా నిమ్మగడ్డ విశేష అధికారాలు చివరకు కలెక్టర్ల నివేదికలతో ఏకీభవించాల్సి వచ్చింది.
ఇక మున్సిపల్ ఎన్నికల విషయంలో గత ఏడాది జరిగిన నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గత ప్రక్రియను అంతా రద్దు చేసి ఉంటే అది పెను సంచలనం అయ్యేది. అయితే గతంలో కోర్టుకు నిమ్మగడ్డ ఒక మాట చెప్పారు.
స్థానిక ఎన్నికల వాయిదా సమయంలో.. ఆ ప్రక్రియ తిరిగి ప్రారంభం అయినప్పుడు ఆగిన చోట నుంచినే మొదలవుతుందని పేర్కొన్నారు. స్వయంగా ఎస్ఈసీ ఈ మాట కోర్టుకు చెప్పారు. అలాంటి తరునంలో పాత ప్రక్రియను రద్దు చేసి ఉంటే.. అది కోర్టులో నిలిచేది కాదేమో!
గతంలో నిమ్మగడ్డే ఎస్ఈసీగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల ప్రక్రియను ఆయనే ఇప్పుడు రద్దు చేస్తే.. అంతకు మించిన దుమారం ఉండదు. దానికి కోర్టులు ఏ మేరకు ఒప్పుకుంటాయో ప్రస్తుత తీర్పులను గమనించినా అర్థం అవుతుంది. అభ్యంతరాలు వచ్చిన కొన్ని చోట్ల మళ్లీ నామినేషన్లకు అవకాశం అంటూ ఎస్ఈసీ ఇవ్వడాన్నే కోర్టు తప్పు పట్టింది. అది మీ పని కాదంటూ.. ఎస్ఈసీ ఆదేశాలను రద్దు చేసింది. మళ్లీ నామినేషన్లకు తావులేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
ఎన్నికల్లో అక్రమాలు, నామినేషన్లను అడ్డుకున్నారంటూ.. మీడియా ముందు చెబితే కాదు, ఆధారాలు ఇవ్వాలని, వాటితో ఎన్నికల పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని కోర్టు స్పష్టంగా పేర్కొంది. ఇలాంటి వాటిల్లో ఎస్ఈసీ చొరవ మంచిదే అయినా, ప్రొసీడ్ అయ్యే పద్ధతి అది కాదన్నట్టుగా కోర్టు పేర్కొన్నట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి.
ఇక ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలో కీలక ఘట్టాలు అన్నీ ముగిశాయి. ఇక వారం రోజుల్లో పోలింగ్ ఉంది. అదంతా ఎలాగూ సాఫీగానే జరుగుతుంది. కాబట్టి.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేకంగా ఇక తన విశేషాధికారాలను వినియోగించే పరిస్థితులు ఉండవేమో!
ఆల్రెడీ ఆయన వాడిన విశేషాధికారాలు… కోర్టుల వద్ద నిలబడలేని పత్రికల్లో వార్తలను బట్టి తెలుస్తోంది. ఇక ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మిగిలే ఉన్నట్టే. బహుశా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల అనుభవంతో నిమ్మగడ్డ వాటిని కూడా సమర్థవంతంగా నిర్వహించే అవకాశాలున్నాయి. బహుశా వాటి విషయంలో ఆయన తన విశేషాధికారాలను ఏ మేరకు వాడతారనే అంశంపై కూడా చర్చ జరుగుతూ ఉంది!