ఏప్రిల్‌లో జరిగే తిరుపతి ఉప ఎన్నికలో గెలిచి తీరుతామని బీజేపీ, జనసేన నేతలు ప్రగల్భాలు పలకడం విన్నాం, చూశాం. ఈ నేపథ్యంలో తిరుపతి కార్పొరేషన్‌కు ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి.
తిరుపతి ఉప ఎన్నికలో విజయం సాధించి, వైసీపీ కంచుకోటను బద్దలు కొడతామని హెచ్చరిస్తున్న బీజేపీ, జనసేన నేతలు, తిరుపతి కార్పొరేషన్‌లో ఏ మేరకు నామినేషన్లు వేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
గత ఏడాది మార్చిలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. కోవిడ్ కారణంగా ఎన్నికలు అర్ధాంతరంగా వాయిదాపడ్డాయి. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ఆగిన చోట నుంచే తిరిగి ప్రారంభమైంది.
నిన్నటితో నామినేషన్ల విత్‌డ్రా గడువు కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో తిరుపతి కార్పొరేషన్ బరిలో బీజేపీ, జనసేన నిలిచిన సీట్లు ఎన్నో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మొత్తం 50 డివిజన్లలో 21 చోట్ల అధికార వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది.
ఇక మిగిలిన 29 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో బీజేపీ 8, జనసేన కేవలం 3 స్థానాల్లో మాత్రమే తలపడుతోంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ 21 స్థానాల్లో పోటీతో సరిపెట్టడం గమనార్హం.
జనసేనాని పవన్‌కల్యాణ్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు తిరుపతిలో గణనీయంగా ఉన్నాయి. అయితే ఆ పార్టీకి నాయకత్వ కొరత ఏ స్థాయిలో ఉందో ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల తీరు ప్రతిబింబిస్తోంది. ఇక తిరుపతి బీజేపీ నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని ఆ పార్టీ కార్యకర్తలే అంటారు.
ఎంతసేపూ టీవీ చర్చల్లో, తిరుమలకు వచ్చే నాయకులను ఆహ్వానించేందుకు విమానాశ్రయాల్లో బొకేలతో ఎదురు చూడడానికే తమ నాయకులకు సమయం సరిపోలేదని బీజేపీ కార్యకర్తలు వ్యంగ్యంగా అంటుంటారు. ఇక పార్టీని బలోపేతం చేయడానికి సమయం ఎట్లా కుదురుతుందని ప్రశ్నిస్తుండడం గమనార్హం.
కావున మాటలు కట్టిపెట్టి బీజేపీ, జనసేన నేతలు తమ కూటమి తరపున గట్టి మేలు చేసే పనులకు శ్రీకారం చుట్టితే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ-జనసేన పార్టీలు కలిసి తిరుపతి కార్పొరేషన్‌లో కేవలం 11 డివిజన్లలో పోటీ చేస్తున్న పరిస్థితుల్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా సత్తా చాటుతారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కావున తాహతుకు మించిన మాటలు మాట్లాడ్డం మానేస్తే మంచిదని హితవు చెబుతున్నారు.