మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది పవర్ ప్లే సినిమా. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది పూర్ణ. ఈ సినిమా మొత్తానికి ఆమె పాత్ర హైలెట్ అంటున్నారు. కానీ యూనిట్ దాస్తున్న మేటర్ ఏంటంటే, ఈ సినిమాలో విలన్ పూర్ణ.
థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాను మలుపుతిప్పే పాత్రలో పూర్ణ నటించింది. అంతేకాదు, ఈ మూవీలో ఆమె డ్రగ్ ఎడిక్ట్ (మాదక ద్రవ్యాలకు బానిసగా మారిన వ్యక్తి)గా కూడా కనిపించబోతోంది. రీసెంట్ యూనిట్ అంతా కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పూర్ణ పరోక్షంగా బయటపెట్టింది కూడా.
సినిమాలో తను డ్రగ్స్ సేవించే సీన్ ఉందని.. ఆ సన్నివేశం చేయడానికి చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. టేబుల్ పై వేసిన పౌడర్ ను పీలిస్తే కొన్నిసార్లు అది నేరుగా తన ముక్కులోకి వెళ్లిపోయిందని, సెట్ లో ఉన్న ఓ నటుడు డ్రగ్స్ ను ఎలా సేవించాలో తనకు చేసి చూపించాడని వెల్లడించింది పూర్ణ.
రాజ్ తరుణ్, విజయ్ కుమార్ కొండా కలిసి రెండో ప్రయత్నంగా చేసిన ఈ సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. హేమల్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతోంది.