‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’లో ఇదేం ఫొటో…!

తప్పులు చేయడం మానవ సహజం. ఇదే మీడియాకూ వర్తిస్తుంది. మీడియా అంటేనే హర్రీబర్రీ జాబ్‌. దిన పత్రికల్లో ఉద్యోగమంటే కాలంతో పరుగెత్తాల్సిందే. ఈ క్రమంలో ఒక్కోసారి పొరపాట్లు జరుగుతాయి. వీటిల్లో కొన్ని పెద్దగా పట్టించుకోదగ్గవి…

తప్పులు చేయడం మానవ సహజం. ఇదే మీడియాకూ వర్తిస్తుంది. మీడియా అంటేనే హర్రీబర్రీ జాబ్‌. దిన పత్రికల్లో ఉద్యోగమంటే కాలంతో పరుగెత్తాల్సిందే. ఈ క్రమంలో ఒక్కోసారి పొరపాట్లు జరుగుతాయి. వీటిల్లో కొన్ని పెద్దగా పట్టించుకోదగ్గవి కావు. ఆ పొరపాట్ల వల్ల ఎవ్వరికీ నష్టం జరగదు. పరువు పోదు. ఇలా చేయకుండా ఉండాల్సిందని అనుకొని వదిలేస్తారు. కొన్ని తప్పులు పెద్ద గొడలకు దారి తీస్తాయి. కోర్టుల దాకా వెళతాయి. పరువు నష్టం కేసుల పడతాయి. జరిగిన తప్పు తీవ్రమైందని పత్రిక యాజమాన్యం భావిస్తే లేదా ప్రచురించిన సమాచారం అవాస్తవమైతే, ఒక ఫొటోకు బదులు మరో ఫొటో ప్రచురిస్తే తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సివస్తుంది. మీడియాలో ఇలాంటివి అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. అయితే సాధారణంగా ఏ తప్పూ ఉద్దేశపూర్వకంగా జరగదు. హడావుడిలో జరిగిపోతుంది. 

పత్రిక ప్రచురణకు వెళ్లేముందు సబెడిటర్‌ నుంచి సీనియర్‌ సబెడిటర్‌, డెస్కు ఇన్‌ఛార్జి, చీఫ్‌ ఎడిటర్‌ వరకు అనేకమంది పరిశీలిస్తారు. కాని ఒక్కోసారి ఎవ్వరి కళ్లకూ తప్పు కనబడదు. ఎందుకని ప్రశ్నించుకుంటే అదంతే అని జవాబు. పత్రిక ప్రింటింగ్‌కు వెళ్లాక తప్పు జరిగిందని  ఎవరైనా గుర్తిస్తే ప్రింటింగ్‌ ఆపేసి కూడా  సరిచేస్తారు. ఇందువల్ల సమయం, మెటీరియల్‌ వృథా అయినా తప్పదు. ఒక్కోసారి జరిగిన తప్పు తెల్లవారి పేపరు చూసుకున్న తరువాతే తెలుస్తుంది. ఒక్కోసారి పేపరులో ఫలానా తప్పు జరిగిందని పాఠకులెవరైనా ఫోన్‌ చేసి చెప్పేదాకా తెలియదు.  పేపర్‌ ప్రింటైపోయి డిస్పాచ్‌ అయిన తరువాత కూడా కాపీలు పంపిణీ కాకుండా వెనక్కి తెప్పించిన ఘటనలు తెలుగు పత్రికల్లో జరిగాయి. మీడియాలో ఎంత టెన్షన్‌ ఉంటుందో అర్థం చేసుకోండి.

స్థానిక లేదా చిన్న పత్రికల్లో జరిగే తప్పులను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. పెద్ద పత్రికల్లో (ఏ భాషవైనా) జరిగే తప్పులు చర్చనీయాంశమవుతాయి. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే…జాతీయ ఆంగ్ల దిపపత్రిక 'ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌'లో ప్రచురించిన ఫొటో చూడండి. 'జల్లికట్టు రో: తమిళనాడు అసెంబ్లీ మీట్స్‌ టుమారో, బిల్‌ టు బి మూవ్‌డ్‌' అనే వార్తకు ప్రచురించిన ఫొటో ఇది. ఇందులో తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య కొట్టొచ్చినట్లు ప్రముఖంగా కనబడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా కనబడుతున్నారు. వార్త ప్రస్తుతానిది. ఫొటో పాతది. 

అంటే ఈ వార్తకు ప్రచురించాల్సిన ఫొటో కాదిది. ఇప్పుడు రోశయ్య గవర్నర్‌ కాదు. జయలలిత కన్నుమూశారు. ఈ వార్తకు జల్లికట్టు ఫొటో లేదా అసెంబ్లీ భవనం ఫొటో వేసుకోవచ్చు. జయలలిత పోయాక జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలు ఇవే కాబట్టి పాత అసెంబ్లీ సమావేశాల ఫొటోలు వేయకూడదు. కాని డెస్కులోని సిబ్బంది వార్తకు ఫొటో ఉండాలనుకున్నారు కాబట్టి హడావుడిగా దీన్ని పెట్టేశారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో దారుణమైన తప్పు జరిగిందని చెప్పడంలేదు. దినపత్రికలో ఉండే హడావుడిలో ఇలాంటి పొరపాట్లు జరుగుతాయని చెప్పడమే ఉద్దేశం.