రైలూ రైలూ ఎందుకు పట్టాలు తప్పావ్‌.?

అసలు రైలు ఎందుకు పట్టాలు తప్పుతుంది.? ఒకటీ, ఇంజన్‌ సహా బోగీల నిర్వహణ సరిగ్గా లేకపోవడం. ఇంకో కారణం, రైలు పట్టాల్లో లోపాలు. మరో కారణం, వాతావరణ కూడా కావొచ్చు. ఇక్కడ విద్రోహ కోణాన్నీ…

అసలు రైలు ఎందుకు పట్టాలు తప్పుతుంది.? ఒకటీ, ఇంజన్‌ సహా బోగీల నిర్వహణ సరిగ్గా లేకపోవడం. ఇంకో కారణం, రైలు పట్టాల్లో లోపాలు. మరో కారణం, వాతావరణ కూడా కావొచ్చు. ఇక్కడ విద్రోహ కోణాన్నీ కాదనలేం. వీటన్నిటికీ తోడు మానవ తప్పిదాల పుణ్యమా అని రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సందర్భాలు కోకొల్లలు. మానవ తప్పిదమంటే, నిర్లక్ష్యం.! 

గతంలో ఏదన్నా రైలు ప్రమాదం జరిగితే, వెంటనే 'రైల్వే శాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసెయ్యాలి..' అంటూ రాజకీయ డిమాండ్‌ తెరపైకొచ్చేసేది. కొన్ని సందర్భాల్లో రైల్వే శాఖ మంత్రులు రాజీనామాలు కూడా చేసేశారు.. ఆయా దుర్ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ. అప్పట్లో ఈ తరహా డిమాండ్లు బీజేపీ నుంచీ గట్టిగానే వచ్చేవి. ఇప్పుడు బీజేపీ అధికారంలో వుంది. గడచిన రెండున్నరేళ్ళలో రైలు ప్రమాదాలు కాస్త ఎక్కువగానే చోటుచేసుకుంటున్నాయి. మరి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయరట.? 

చిత్రమైన విషయమేంటంటే, ప్రమాదం జరిగిన వెంటనే 'విద్రోహకోణం' అన్న వాదనలు తెరపైకొస్తుండడం. ప్రభుత్వం, తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ముందుగా 'విద్రోహకోణం' అనే అంశాన్ని తెరపైకి తెస్తోందన్నది ఇక్కడ సుస్పష్టం. విచారణ జరిగాక కదా, అది విద్రోహమా.? నిర్లక్ష్యమా.? అసలు దేనివల్ల ఆ ప్రమాదం జరిగిందనేది తేలుతుంది.! 

ముందేమో, తీవ్రవాదులు పట్టాల్ని కోసేసి వుండొచ్చన్న వాదనని తెరపైకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రైలు పట్టా విరిగి వుండడమే ఈ అనుమానానికి కారణం. ఆ తర్వాత, 'మొన్నీమధ్యనే ఆంధ్రా – ఒరిస్సా బోర్డర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు. సో, ప్రతీకారంగా మావోయిస్టులు ఈ దారుణానికి ఒడిగట్టి వుండొచ్చు. ఘటన జరిగిన ప్రాంతం కూడా మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా వున్న ప్రాంతమే' అంటూ కొత్త కారణాన్ని తెరపైకి తెచ్చేశారు. 

ముందే చెప్పుకున్నాం కదా, రైలు ప్రమాదానికి గురవడానికి కారణాలనేకం. మన రైళ్ళ నిర్వహణ ఎంత చెత్తగా వుందో, రైలు ప్రయాణీకులందరికీ అనుభవమే. ఛార్జీల మీద శ్రద్ధ, రైళ్ళ నిర్వహణపై కన్పించడంలేదు. గడచిన రెండున్నరేళ్ళలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 'ప్రీమియం రైళ్ళు' అంటూ, ప్రయాణీకుల జేబుల్ని గుల్ల చేయడం తప్ప, ప్రయాణీకుల భద్రత గురించి పాలకులకు ఏమాత్రం పట్టడంలేదు. ప్రమాద భీమా పేరుతో, ఈ మధ్యన రైల్వే శాఖ కొత్త తరహా బాదుడికి సిద్ధమైన విషయం విదితమే. ప్రమాదం జరిగిన వెంటనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించే పాలకులు, ప్రమాదాల నివారణపై శ్రద్ధ చూపకపోవడం శోచనీయం. 

రైళ్ళు ఇంత తేలిగ్గా పట్టాలు తప్పేస్తోంటే, మనకి బుల్లెట్‌ రైళ్ళ మీదా, హై స్పీడ్‌ రైళ్ళ మీద మమకారం పెరిగిపోతోంది. ఇంత నిర్లక్ష్యంతో పాలకులు వ్యవహరిస్తున్నప్పుడు, రైల్వే శాఖలో ఇంత నిస్తేజం పెరిగిపోయినప్పుడు.. హైస్పీడ్‌ రైళ్ళు, బుల్లెట్‌ రైళ్ళు మన దేశంలోకొస్తే, తద్వారా దేశానికి ఒరిగేదేమీ వుండదు.. అను నిత్యం ప్రమాదాలు తప్ప.