తెలుగువారి గురించి ఎప్పుడూ ఒక మాట చెప్పుకుంటూ ఉంటారు. ఏమిటది? 'ఆంధ్రులు ఆరంభ శూరులు' అని. ఇదొక్కటే కాదు. వీరికి ఇంకా అనేక గుణాలున్నాయి. ఐకమత్యం లేదు. భాషను, సంస్కృతిని గౌరవించే, పరిరక్షించుకునే ఆలోచన, ప్రయత్నం తక్కువ. అనుకరణకు, అనుసరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. తెలుగువారు తెలుగువారిగా ఉండటం కంటే ఎవరిలాగానో ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. అంటే ఎక్కువగా వేరేవారిని ఇమిటేట్ చేస్తుంటారు. శతాబ్దాలపాటు తెలుగువారిని 'మదరాసీలు' అని పిలిచినా ఉలుకూపలుకూ లేకుండా ఉండిపోయారు. తెలుగువారి నగరమైన చెన్నపట్టణాన్ని (చెన్నయ్) అప్పనంగా తమిళులకే అప్పగించి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వచ్చేశారు. అనుకున్నది సాధించడంలో తెలుగువారు ఎప్పుడూ వెనకంజలోనే ఉంటారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ విషయంలో తెలుగు పాలకుల నిర్వాకం చూస్తూనే ఉన్నాం కదా. కాని తమిళులు అనుకున్నది సాధిస్తారు. భాషను, సంస్కృతిని బాగా గౌరవిస్తారు. ప్రేమిస్తారు. అదే వారి ప్రత్యేకత. తాజాగా జల్లికట్టు విషయంలో చూశాం కదా. తంబీలు పట్టిన పట్టుకు కేంద్రమే కాదు, సుప్రీం కోర్టు కూడా దిగి వచ్చింది. ఏ విషయంలోనైనా సరే పట్టుపట్టారంటే తాడోపేడో తేల్చుకునేదాకా వదలరు. ఇంత పోరాట పటిమ తెలుగువారిలో లేదనే చెప్పుకోవాలి.
ఒకటి రెండు అంశాల్లో ఎప్పుడైనా పోరాడారేమోగాని తుది వరకు నిలిచి గెలిచినవి తక్కువే. కారణం ఐకమత్యం లేకపోవడం. 'పీతల సీసాకు మూత అక్కర్లేదు' అనే సామెత తెలుగోళ్లకు బాగా వర్తిస్తుంది. తమిళనాడులో 1960 ప్రాంతంలో చెలరేగిన హిందీ వ్యతిరేకోద్యమం నుంచి ఇప్పటి జల్లికట్టు అనుకూల ఉద్యమం వరకు ఏదీ తీసుకున్న ప్రజలు పోరాట పటిమ, అంతకు మించి ఐక్యత కనబడతాయి. హక్కుల కోసం, నిధుల కోసం, ప్రాజెక్టుల కోసం అన్ని పార్టీలూ ఒక్కటవుతాయి. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందంటే చాలు కేంద్రంపైనో, పొరుగు రాష్ట్రం మీదనో పోరాటం చేయడానికి అధికార, ప్రతిపక్షాలు ఐక్యంగా కదులుతాయి. వెనకామందు ఆలోచన ఉండదు. సిద్ధాంత రాద్ధాంతాలు ఉండవు. ఒక్క తమిళనాడులోనే కాదు, ప్రపంచంలోని ఏ దేశంలో తమిళులకు అన్యాయం జరిగినా రాష్ట్రం మండిపోతుంది. హింసాత్మక చర్యలకు పాల్పడటానికి కూడా వెనుకాడరు. కర్నాటక-తమిళనాడు మధ్య శతాబ్దాలుగా జరుగుతున్న 'కావేరీ' పోరాటం చూస్తున్నాం.
ఈమధ్య కూడా కావేరీ జలాల సమస్యపై రెండు రాష్ట్రాల్లోనూ ఉద్రిక్తత ప్రబలి హింసాత్మక ఘటనలు జరిగాయి. తమిళ జాలర్లను అప్పుడప్పుడు శ్రీలంక సైన్యం అరెస్టు చేస్తుంటుంది. అలాంటప్పుడు వారి విడుదల కోసం అన్ని పార్టీలు ఐక్యంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తుంటాయి. శ్రీలంకలో ఎల్‌టీటిఈ పోరాటాన్ని సమర్ధించిన తీరు చూశాం కదా. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకే ఏదో ఒక జాతీయ నేతృత్వంలోని కూటమిలో చేరుతుంటాయి. ఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చినా డీఎంకే లేదా అన్నాడీఎంకే కేంద్ర కేబినెట్‌లో స్థానం పొందుతుంది. ఈ రెండు ద్రవిడ పార్టీలకు పార్లమెంటు ఎన్నికల్లో తక్కువ స్థానాలు వచ్చినా సరే కేంద్ర కేబినెట్‌లో మాత్రం కీలక శాఖలు దక్కించుకుంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 33 మంది కాంగ్రెసు ఎంపీలు గెలిచారు. అప్పుడు యూపీఏలో భాగస్వామి అయిన డీఎంకేకు చాలా తక్కువ స్థానాలు వచ్చాయి. అయినప్పటికీ కేంద్ర కేబినెట్లో ఆ పార్టీకే ఎక్కువ పదవులే కాకుండా కీలకమైనవి దక్కాయి. అత్యధికంగా ఎంపీలను పార్లమెంటుకు పంపిన ఏపీకి ఒకటో అరో కేబినెట్ పదవులు ఇచ్చి సహాయ మంత్రి పదవులతో సరిపెట్టారు.
అయినప్పటికీ నోరు మూసుకొని పడున్నారు తెలుగోళ్లు. కేంద్రం నుంచి (ఏ పార్టీ ప్రభుత్వమున్నా) నిధులు తెచ్చుకోవడానికి తెలుగు ముఖ్యమంత్రులు కాళ్లకు బలపాలు కట్టుకొని ఢిల్లీకి తిరుగుతుంటారు. కాని తమిళ ముఖ్యమంత్రులు చెన్నయ్ దాటకుండా వారికి న్యాయంగా రావల్సిన నిధులతో పాటు అదనంగా కూడా తెచ్చుకుంటారు. చంద్రబాబు ఎన్‌డీఏలో భాగస్వామి అయినప్పటికీ ప్రతి విషయంలోనూ మోదీ సర్కారును బతిమాలుకుంటున్నారు.'ఢిల్లీకి ముప్పయ్‌సార్లు వెళ్లొచ్చా' అని అదేదో గొప్ప విషయంలా చెప్పారు. కాని జయలలిత అడుగు బయట పెట్టకుండా కావల్సిన నిధులు తెచ్చుకున్నారు. ప్రధాని మోదీ చెన్నయ్‌కి వెళ్లినప్పుడు ఆయనే స్వయంగా జయ ఇంటికి వెళ్లి ఆమెను కలిశారు. 'తెలంగాణకు రండి మోదీగారూ' అని మొత్తుకుంటే రెండేళ్ల తరువాత వచ్చారు. ఇప్పుడే కాదు బ్రిటిషువారి హయాం నుంచి తమిళులకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. ఇతర రాష్ట్రాలవారి కంటే వారు తెలివైనవారనే అభిప్రాయముంది. ఏది ఏమైనా తమిళుల ఉడుం పట్టు ముందు ప్రభుత్వాలు , కోర్టులూ బలాదూరేనని చెప్పుకోవాలి.